Kurnool Kaveri Bus Accident: 19 వాహనాలు బైక్‌ను తప్పించాయి
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:11 AM
గత శుక్రవారం తెల్లవారు జామున 2:45 గంటల సమయంలో పల్సర్ బైక్‌పై డోన్‌కు వెళ్తున్న శివశంకర్, ఎర్రిస్వామిలు కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర డివైడర్‌ను ఢీకొట్టారు.
ఒక్క వి.కావేరి బస్సే బైకును ఈడ్చుకెళ్లింది
దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేహం
తెల్లవారుజామున 2:45కు డివైడర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
రోడ్డుకు అడ్డంగా పడిన బైక్.. తర్వాత అదే దారిలో లారీలు, బస్సులు
బైక్‌పై నుంచి వెళ్లింది ఆ బస్సు ఒక్కటే.. బైకు కనిపించలేదా?
కర్నూలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): గత శుక్రవారం తెల్లవారు జామున 2:45 గంటల సమయంలో పల్సర్ బైక్‌పై డోన్‌కు వెళ్తున్న శివశంకర్, ఎర్రిస్వామిలు కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర డివైడర్‌ను ఢీకొట్టారు. బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు. బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. అదే రోడ్డులో అర్ధరాత్రి దాటాక 2:55 నుంచి 3 గంటల మధ్య బెంగళూరు వైపు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను గుర్తించకుండా ఆ బైక్ పైనుంచి వాహనాన్ని నడిపించడంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. అంటే.. ఈ రెండు ఘటనల మధ్య 10-15 నిమిషాల వ్యవధి ఉంది. అయితే.. ఈ స్వల్ప వ్యవధిలో అదే మార్గంలో 19కి పైగా బస్సులు, లారీలు రోడ్డుపై పడిన బైక్‌ను గుర్తించి.. దానిని తప్పించుకొని ముందుకుసాగాయి. మరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్యకు రోడ్డుపై పడి ఉన్న బైకు కనిపించలేదా? లేదా నిర్లక్ష్యంగా ఆయన బస్సును నడిపారా? అనేది కీలక ప్రశ్న. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తే.. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట్లో బైకర్ ఎదురుగా వచ్చి బస్సును ఢీకొట్టాడని, ఆ తర్వాత ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు.
తర్వాత, శివశంకర్, ఎర్రిస్వామిలు ఓ బంకులో పెట్రోలు పోయించుకున్న సీసీ కెమెరా ఫుటేజీ వెలుగులోకి వచ్చాక రోడ్డుపై పడిన నల్లరంగు బైక్‌ను గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లక్ష్మయ్య వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులు లక్ష్మయ్యను మరింత లోతుగా విచారిస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడుతోంది. రోడ్డుపై పడి ఉన్న బైక్ నలుపు రంగులో ఉంది. చీకట్లో దూరం నుంచి బైక్‌ను గుర్తించలేకపోయాను. దగ్గరకు వచ్చాక బైక్ కనిపించిందని, సడెన్ బ్రేక్ వేస్తే.. వెనుకాల వచ్చే వాహనాలు మా బస్సును ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి తప్పని పరిస్థితుల్లో బైక్ పైనుంచి బస్సును పోనిచ్చా.’’ అని డ్రైవర్ లక్ష్యయ్య పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. కానీ, అంతకుముందు అదే దారిలో 19కి పైగా బస్సులు, లారీలు రోడ్డుపై పడి ఉన్న బైకును తప్పించుకుని ముందుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆ దారిలో వెళ్లిన నలుగురు బస్సు, లారీల డ్రైవర్లను గుర్తించి విచారించగా.. ‘‘ఓ బైక్ రోడ్డు పై అడ్డంగా పడి ఉంది. స్పృహ లేకుండా పడిపోయిన ఓ యువకుడిని మరో వ్యక్తి పక్కకు లాగుతున్నట్లు గుర్తించాం. బైక్‌ను తప్పించుకొని ముందుకు వెళ్లిపోయాం.’’ అని పోలీసులకు వివరించారు. అంటే 19కి పైగా వాహనాల డ్రైవర్లు ప్రమాదానికి గురైన యువకులు, రోడ్డుపై పడిన బైక్‌ను గుర్తించి తప్పించుకొని వెళ్లిపోయారు. ఆ డ్రైవర్లకు కనిపించిన బైకును కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య గుర్తించ లేకపోయానని చెప్పడం ఎంత వరకు నిజం? అనే దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. బస్సు ప్రమాదానికి లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణమని అనుమానిస్తున్నారు.
నివేదికలు వస్తే కొలిక్కి
కర్నూలు బస్సు ప్రమాదంపై రోడ్డు రవాణా, అగ్నిమాపక శాఖ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎ్‌ఫఎస్‌ఎల్) నుంచి నివేదికలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే లేఖలు రాశారు. వారి నుంచి నివేదికలు రాగానే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
తమిళనాడు వాసి మృత దేహానికి కర్నూలులో అంత్యక్రియలు
గుండెలవిసేలా రోదించిన తండ్రి
కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది అగ్ని ఆహుతైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు తమిళనాడుకు చెందిన ప్రశాంత్ రాజన్(29). డీఎన్‌ఏ సరిపోల్చి 18 మంది మృతదేహాలను ఆదివారం కుటుంబీకులకు అప్పగించారు. అయితే, 550 కి.మీ.దూరంలోని స్వస్థలం ధర్మపురి జిల్లా జిత్తన్‌దహల్లికి రాజన్ మృతదేహాన్ని తీసుకెళ్లే అవకాశం లేక కర్నూలులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా, ‘నా కొడుకు ఎక్కడో తమిళనాడులో పుట్టి ఊరుగాని ఊరులో చివరి మజిలి ముగించాల్సి వచ్చింది. వందల కిలోమీటర్లు దూరం ఉండడంతో అందరూ ఉన్నా అనాథలా సాగనంపాల్సి వస్తోంది దేవు డా’ అంటూ తండ్రి రాజన్ గుండెలవిసేలా రోదించారు.
