Negligence Sparks Tragedy: నిర్లక్ష్యపు నిప్పు
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:50 AM
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి అసలు కారణం తెలిసింది. బస్సు మంటల్లో చిక్కుకొని 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఈ ఘటన ఎలా జరిగింది...
ప్రైవేటు బస్సు విషాదంలో కీలక మలుపు
బస్సు రాకముందే డివైడర్‌ను ఢీకొన్న బైకర్
అక్కడిక్కడే శివశంకర్ మృతి.. స్నేహితుడికి గాయాలు
రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్
తర్వాత ఇదే మార్గంలో వెళ్లిన 3 బస్సులు
2:55 గంటలకు వచ్చిన వి.కావేరి బస్సు
ఆ బైక్‌ను తోసుకుంటూ ముందుకు
రోడ్డు, బైక్ మధ్య రాపిడికి నిప్పు రవ్వలు
బైక్ ట్యాంక్ మూత ఊడి పెట్రోలు బయటికి
వెంటనే బస్సంతా వ్యాపించిన మంటలు
బైక్‌ను గుర్తించకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
అధికారికంగా నిర్ధారించిన పోలీసులు
ఏం జరిగిందంటే..
శుక్రవారం తెల్లవారుజాము 2:45 గంటలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్-బెంగళూరు హైవేపై పల్సర్ బైక్ డివైడర్‌ను ఢీకొని రోడ్డు మధ్యలో పడిపోయింది. బైక్ నడుపుతున్న బి.శివశంకర్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనక కూర్చున్న ఎర్రిస్వామి డివైడర్ మధ్యలో గడ్డిపై పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. చలనం లేని శివశంకర్‌ను ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాగాడు.
2:45 నుంచి 2:55 వరకు: పది నిమిషాల్లో ఓ ఆర్టీసీ బస్సు సహా 3 బస్సులు ఇదే మార్గంలో బెంగళూరు వైపు వెళ్లాయి. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను గమనించి పక్కగా వెళ్లాయి. అయితే... దానిని పక్కకు లాగేయాలని ఏ ఒక్కరూ అనుకోలేదు.
2:55 గంటలకు: రోడ్డు మధ్యలో ఉన్న బైక్‌ను పక్కకు లాగేద్దామని ఎర్రిస్వామి ప్రయత్నిస్తున్నప్పుడే... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న ఆ బైక్‌ను ఢీ కొట్టి అలాగే తోసుకుంటూ 200 మీటర్లు వెళ్లింది.
ఘోర ప్రమాదం: బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ ట్యాంక్ మూత తెరుచుకొని పెట్రోల్ రోడ్డుపై కారడం.. బైక్, రోడ్డు మధ్య రాపిడి వల్ల నిప్పురవ్వలు ఎగిసి పెట్రోల్‌ను అంటుకోవడంతో క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. 15 నిమిషాల్లో ఘోరం జరిగిపోయింది.
కర్నూలు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి అసలు కారణం తెలిసింది. బస్సు మంటల్లో చిక్కుకొని 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఈ ఘటన ఎలా జరిగింది? కారణాలేంటి? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముందుగా భావించినట్లుగా పల్సర్ బైక్‌ను వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరగలేదు. బస్సు రావడానికి ముందే పల్సర్ బైక్ డివైడర్‌ను ఢీ కొని ప్రమాదానికి గురైంది. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామి మరొకరు గాయపడ్డాడు. బైకు రోడ్డు మధ్యలో పడిపోయింది. బైక్‌ను ప్రైవేటు బస్సు తోసుకుని వెళ్లడంతో ప్రమాదం జరిగి, బస్సు మంటల్లో చిక్కుకొందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బైక్ కదలికలకు సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు.
పోలీసుల దర్యాప్తులో మలుపు
గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన డీడీ01 ఎన్9490 ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు కలిపి 46 మంది ఉన్నారు. మంటల్లో చిక్కుకున్న ఈ బస్సులో అద్దాలు పగులగొట్టి 27 మంది ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. మంటల్లో చిక్కుకుని 19 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు బాధ్యతను పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్యకు అప్పగించారు. శుక్రవారం రాత్రే రంగంలోకి దిగిన పోలీస్ విచారణ బృందం కర్నూలు నగరం నుంచి చిన్నటేకూరు సమీపంలో ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బస్సు తగలబడిపోవడానికి కారణమైన పల్సర్ బైక్‌కు సంబంధించిన ఫుటేజీలు గుర్తించారు. బైక్‌పై వెళ్తూ మరణించిన శివశంకర్‌తోపాటు ఉన్న మరో యువకుడిని ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఆ యువకుడిని తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన సి.ఎర్రిస్వామిగా గుర్తించారు. ఆ యువకుడిని అదుపులో తీసుకొని పోలీసులు విచారించారు. ముందు వెళ్తున్న పల్సర్ బైక్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో బైకర్ బి.శివశంకర్ ఎగిరి పక్కకు పడిపోయి మృతి చెందాడని, ఆపకుండా ముందుకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని మొదట్లో పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ కేసు దర్యాప్తులో మలుపు తిరిగింది.
ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే...
కర్నూలు శివారులోని బి.తాండ్రపాడు గ్రామం ప్రజానగర్‌లో నివాసం ఉంటున్న బి.శివశంకర్, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన సి.ఎర్రిస్వామిలు ఇద్దరూ స్నేహితులు. గురువారం రాత్రి ఇద్దరూ కర్నూలులో భోజనాలు చేశారు. ఎర్రిస్వామిని అతడి స్వగ్రామం రాంపల్లిలో దింపి వస్తానని శివశంకర్ తన బైక్‌పై ఎక్కించుకొని గురువారం అర్ధరాత్రి బయలుదేరాడు. ‘వర్షం వస్తోంది.. ఉదయమే వెళ్తా’ అని ఎర్రిస్వామి వారించినా వినలేదు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44లో చిన్నటేకూరు సమీపంలో కియ షోరూం ఎదురుగా ఉన్న ఓ బంకులో రూ.300కు పెట్రోల్ పట్టించుకున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 2:24 గంటలు. బైక్‌కు హెడ్‌లైట్ వెలగడం లేదని, లెఫ్ట్ ఇండికేటర్ వెలుతురులోనే వెళ్లారని బంకు సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత 2:42 గంటల ప్రాంతంలో ఆరంఘర్ హోటల్ వద్ద సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యారు. అక్కడి నుంచి రెండు కి.మీ. వెళ్లాక 2:45 గంటల సమయంలో బైక్ కుడివైపు డివైడర్‌ను ఢీకొని రోడ్డు మధ్యలో పడిపోయింది. వెనకాల కూర్చున్న ఎర్రిస్వామి డివైడర్ మధ్యలో గడ్డిపై పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై పడిపోయిన బి.శివశంకర్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చలనం లేని మిత్రుడిని ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాగాడు. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో ఓ ఆర్టీసీ బస్సు సహా మూడు బస్సులు అదే మార్గంలో బెంగళూరు వైపు వెళ్లాయి. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను గమనించి పక్కన వెళ్లాయి. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ను పక్కకు లాగేద్దామని ఎర్రిస్వామి ప్రయత్నించాడు. ఇంతలో 2:55 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది. రోడ్డు మధ్యలో పడిఉన్న ఆ బైక్‌ను తోసుకుంటూ వెళ్లింది. భారీ శబ్దం రావడంతో డ్రైవర్ బ్రేక్ వేసి వదిలి ముందుకు వెళ్లాడు. మళ్లీ భారీ శబ్దం రావడంతో మరోసారి బ్రేక్‌వేసి వదిలాడు. ఈ క్రమంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ ట్యాంక్ మూత తెరుచుకొని పెట్రోల్ రోడ్డుపై కారుతూ వచ్చింది. బైక్, రోడ్డు మధ్య రాపిడి వల్ల నిప్పురవ్వలు ఎగిసి పెట్రోల్‌ను అంటుకుంది. క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో 15 నిమిషాల్లో ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఆరుగురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, బిహార్, ఒడిశాకు చెందిన ఒక్కొక్కరు, గుర్తు తెలియని మరో వ్యక్తి కలిపి 19 మంది సజీవదహమైన సంగతి తెలిసిందే.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం..
ప్రమాద ఘటనకు ప్రైవేటు బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎంత వర్షం పడుతున్నా బస్సు హెడ్ లైట్ వెలుతురుకు రోడ్డుపై ముందు భాగంలో పడిపోయిన బైక్‌ను గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యమని అంటున్నారు. బైక్‌ను ఢీకొనగానే దఢేల్‌మనే భారీ శబ్దం వచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. శబ్దం రాగానే బ్రేక్ వేసి వదిలేశానని డ్రైవర్ లక్ష్మయ్య కూడా పోలీస్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. తక్షణమే బస్సు ఆపేసి కిందకు దిగి ఏం జరిగిందో గుర్తించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. 19 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి కావని అభిప్రాయపడుతున్నారు. బస్సు ముందు భాగంలో పల్సర్ బైక్ ఇరుక్కుపోయినా డ్రైవర్ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా దాదాపు 200 మీటర్ల వరకు బస్సును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ప్రమాదంలో బస్సులో మంటలు వ్యాపించాయి. ట్రావెల్ యాజమాన్యం రవాణా శాఖ నిబంధనలు పాటించకపోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచిందని అంటున్నారు.
ముందుగానే బైక్ ప్రమాదం
బస్సు ప్రమాదంపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. సీసీ ఫుటేజీలు పరిశీలించాక శివశంకర్ బైక్‌పై వెళ్లిన ఎర్రిస్వామితో పాటు ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఇద్దరిని విచారించాం. వారు చెప్పిన వివరాలు పరిశీలిస్తే.. డివైడర్‌ను ఢీకొట్టడం వల్ల బైక్ రోడ్డుపై పడిపోయింది. శివశంకర్ తలకు బలమైన గాయాలై మృతి చెందాడు. ఎర్రిస్వామి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఎర్రిస్వామి హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో పని చేస్తున్నాడు. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఎర్రిస్వామి పక్కకు లాగేసే ప్రయత్నం చేసేలోపే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది. బస్సు కింద ఇరుక్కున్న బైక్‌ను ముం దుకు లాక్కుని వెళ్లింది. బైకర్ మద్యం సేవించాడా..? లేదా..? అన్నది ఇప్పుడే చెప్పలేం. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశాం.
- డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు రేంజ్ డీఐజీ