Electricity Line Construction: నిర్లక్ష్యపు పునాదులు
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:59 AM
రాజధాని అమరావతి పరిధిలోని విద్యుత్ లైన్ల నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ముందుగా ఒక లైన్ అనుకుని.. పునాదులు నిర్మించారు. కానీ, అది తప్పుడు అలైన్‌మెంట్ అని గుర్తించేసరికి నిర్మాణాలు పునాదుల...
రూ.30 కోట్లు నేలపాలు.. సీఆర్డీయే పరిధిలోని విద్యుత్ లైన్ల మార్పుతో నష్టం
400 కేవీ లైన్ మార్పునకు 2018లో ప్రారంభమైన పనులు
అలైన్‌మెంట్‌లో భారీగా తప్పులు.. ఆలస్యంగా గుర్తించిన అధికారులు
2024లో మళ్లీ టెండర్లకు పిలుపు.. పునాదుల దశలో వృథా అయిన 15 టవర్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతి పరిధిలోని విద్యుత్ లైన్ల నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ముందుగా ఒక లైన్ అనుకుని.. పునాదులు నిర్మించారు. కానీ, అది తప్పుడు అలైన్‌మెంట్ అని గుర్తించేసరికి నిర్మాణాలు పునాదుల దశకు చేరిపోయాయి. దీంతో రూ.30 కోట్ల వరకు ప్రజాధనం నేలపాలైంది. వెంకటపాలెం, తదితర ప్రాంతాల్లో 400 కేవీ విద్యుత్ లైన్లు సీడ్ యాక్సిస్ రోడ్డు, వెస్ట్ బైపా్‌సతోపాటు పలు సంస్థలకు కేటాయించేందుకు నిర్దేశించిన స్థలాల మీదుగా వెళుతుండటంతో వాటిని మార్చాలని అధికారులు నిర్ణయించారు. సీఆర్డీయే అధికారులతో కలిసి ట్రాన్స్‌కో అధికారులు కొత్త లైన్ వెళ్లాల్సిన అలైన్‌మెంట్‌ను గుర్తించారు. వీటీపీఎస్ నుంచి సత్తెనపల్లి, నెల్లూరు వైపు వెళ్లే ఈ 400 కేవీ లైన్ల పునర్మార్గాల(రీ-రూటింగ్) పనుల కోసం 2018లో టెండరు పిలిచారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. పునాదుల స్థాయి వరకు నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారులు అలైన్‌మెంట్‌లో తప్పులు జరిగాయని గుర్తించారు. అయితే, అప్పటికే 15 టవర్లు పునాదుల స్థాయి వరకు చేరుకున్నాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ లైన్ల మార్పిడి వ్యవహారం తెరపైకి వచ్చింది. రూ.357 కోట్లతో టెండర్లు పిలిచి 9 శాతం అదనంగా(రూ.35 కోట్లు) గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించారు. మళ్లీ కొత్త టవర్ల కోసం పునాదులు తీయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. కాగా, ఒక్కో టవర్ బేస్‌మెంట్ నిర్మాణానికి సుమారు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. 15 టవర్లకు రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.30 కోట్లు నేలపాలయ్యాయి.
విలువైన భూమీ వృథానే..
అలైన్‌మెంట్‌లో తప్పు కారణంగా వృథాగా మిగిలిన 15 టవర్ల వేసిన ప్రాంతం సుమారు 2ఎకరాలు వరకు ఉంటుంది. 400కేవీ టవర్ నిర్మాణానికి 20/20 మీటర్ల వైశాల్యంలో బేస్‌మెంట్ నిర్మాణం చేశారు. అంటే సుమారు 500 గజాల స్థలంలో పునాది నిర్మించారు. రాజధాని ప్రాంతంలో గజం రూ.40 వేలు వేసుకున్నా 7,500 గజాల విలువ రూ.30 కోట్లు వరకు ఉంటుంది. టవర్ బేస్‌మెంట్లు భూమిలో 12 అడుగుల లోతున ఉంటాయి. వీటిని తొలగించడం కూడా కష్టం.
వృథా ఖరీదు!
ఈ చిత్రంలో కనిపిస్తున్న కాంక్రీట్ దిమ్మెలు అధికారుల నిర్లక్ష్యానికి ఆనవాళ్లు!. ఆ నిర్లక్ష్యం ఖరీదు రూ.30 కోట్లు!!. రాజధాని అమరావతిలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు హడావుడిగా వీటిని నిర్మించారు. తర్వాత ఈ లైన్‌లలో మార్పు చేశారు. ఫలితంగా ప్రజాధనం నిరుపయోగమైంది. దీంతోపాటు అత్యంత విలువైన 2 ఎకరాల స్థలం కూడా కొరగాకుండా పోయింది.
తప్పు ఎవరిది?
విద్యుత్ లైన్ మార్పిడిలో తప్పుడు అలైన్‌మెంట్‌కు కారణం ఎవరనేది అధికారులు ఇంత వరకు గుర్తించలేదు. తమ తప్పు కాదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతుంటే.. అలైన్‌మెంట్‌తో తమకేమీ సంబంధం లేదని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. తప్పంతా ట్రాన్స్‌కో అధికారులదేనని అంటున్నారు.