Share News

PM Surya Ghar Solar Scheme: ఎందుకీ నిర్లక్ష్యం!

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:53 AM

దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్‌’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది...

PM Surya Ghar Solar Scheme: ఎందుకీ నిర్లక్ష్యం!

  • సోలార్‌ విద్యుత్‌ కోసం 14 లక్షల దరఖాస్తులు

  • రాష్ట్రంలో ఇప్పటిదాకా 56 వేల ఇళ్లకే ఏర్పాటు

  • వెండర్ల చేతిలో ‘పీఎం సూర్యఘర్‌’ విలవిల

  • సోలార్‌ పవర్‌లో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్‌’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద నివాస సముదాయాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుని సౌర శక్తిని విద్యుత్‌గా మార్చుకోవచ్చు. స్వీయ అవసరాలకు వాడుకున్నది పోగా విక్రయించుకునే అవకాశం కూడా ఉంది. ఇక, సోలార్‌ ప్యానళ్ల కొనుగోలుకు సబ్సిడీ కూడా ఉంది. కిలోవాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.30 వేలు చొప్పున 3 కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేల సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. పథకం మంచిదే అయినా ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో చాలా రాష్ట్రాల్లో ఈ పథకం నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా పీఎం సూర్యఘర్‌ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా రూప్‌టాప్‌ సోలార్‌ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. అయినప్పటికీ.. రాష్ట్రంలో ఈ పథకం ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదు. ఈ నెల 3వ తేదీ వరకు 14,24,773 దరఖాస్తులు అందగా, వీటిలో 56,451 దరఖాస్తులకు మాత్రం మోక్షం కలిగింది.

వెండర్ల మాయాజాలం

సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానళ్ల ఏర్పాటులో వ్యాపారులు కీలకంగా వ్యవహరిస్తారు. అలాంటి కీలక వ్యవస్థను పర్యవేక్షించడంలో నెడ్‌క్యాప్‌, డిస్కంలు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ చూపిన ప్రతి ఒక్కరూ ‘పీఎం సూర్యఘర్‌’ వెబ్‌సైట్‌లో వెండర్‌గా నమోదు కావచ్చు. వీరికి సాంకేతికంగా సామర్థ్యం ఉందా?. ఏదైనా సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారా?. వంటి విషయాలను ఏవీ పరిశీలించకుండానే వెండర్‌గా నమోదు చేస్తున్నారు. దీంతో రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు రూ.2 లక్షల బ్యాంక్‌ గ్యారెంటీ చూపి వెండర్లుగా రిజిస్టర్‌ అవుతున్నారు. సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన తర్వాత 5 ఏళ్లు సర్వీసు ఇస్తామని వెండరు గ్యారెంటీ ఇవ్వాలి. ఈ విషయాలను ఎవరూ పరిశీలించడం లేదు.


వాటిపై ప్రజలకూ అవగాహన కల్పించడం లేదు. రాష్ట్రంలో 3 డిస్కంలు(సీపీడీసీఎల్‌, ఈపీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌) ఉండగా ఒక్కొక్క డిస్కం పరిధిలో 500 నుంచి 1000 మంది వరకు వెండర్లు రిజిస్టర్‌ అయ్యారు. వీరు స్థానిక నాయకులు, విద్యుత్‌ ఉద్యోగుల సహకారంతో వినియోగదారులను ప్రభావితం చేసి, తమ సంస్థ సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకునేలా వారితో ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేయిస్తున్నారు. ఒక రిజిస్ట్రేషన్‌కి రూ.500 నుంచి 1000 వరకు నేతలకు ముడుపులు ముట్టచెబుతున్నట్టు తెలిసింది. ఇలా ఒక్కొక్క వెండర్‌ 4000 నుంచి 5000 మంది వినియోగదారులను రిజిస్టర్‌ చేయిస్తున్నారు. అయితే, ఆ స్థాయిలో వీరి వద్ద సామగ్రి, నిపుణులు లేకపోవడంతో ఇన్‌స్టాలేషన్‌ చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా పథకం అటకెక్కుతోంది. కొంత మంది వెండర్లు తాము రిజిస్టర్‌ చేయించిన కనెక్షన్లను వేరే సంస్థలకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. అయితే, ఫలానా సంస్థ రూఫ్‌టాప్‌ ప్యానల్‌ను ఏర్పాటు చేయించుకునేందుకు అంగీకరించి రిజిస్టర్‌ అయితే, 40 రోజుల వరకు మారడానికి వీలు లేకపోయినా మార్చేస్తున్నారు.

వెండర్లపై పర్యవేక్షణ శూన్యం

పీఎం సూర్యఘర్‌ పథకం కింద రిజిస్టర్‌ అయ్యే వెండర్ల అర్హతలు పరిశీలించే వ్యవస్థ లేదు. ఫలితంగా మాస్కులు, ఫైనాన్స్‌ వ్యాపారం చేసే వారు కూడా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేస్తామంటూ వెండర్లుగా రిజిస్టర్‌ అవుతున్నారు. వీరికి సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుపై ఎలాంటి శిక్షణ ఉండటం లేదు. మరోవైపు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా జరగడం లేదు. ఫలితం గా ‘పీఎం సూర్యఘర్‌’ పథకం లక్ష్యం నీరుగారుతోంది.

Updated Date - Oct 05 , 2025 | 03:53 AM