Share News

Road Accidents: నిర్లక్ష్యం.. ప్రాణాంతకం

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:11 AM

వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం రహదారి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వేలాది మంది మరణిస్తుండటంతో వారి కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోతున్నాయి.

Road Accidents: నిర్లక్ష్యం.. ప్రాణాంతకం

  • కలవరపెడుతున్న రహదారి ప్రమాదాలు

  • సగటున ఏటా 20వేలకు పైగా యాక్సిడెంట్లు

  • పదకొండు ఏళ్లలోనే 87,341 మంది మృత్యువాత

  • గాయాలపాలైన వారు మరో 2,68,871 మంది

  • కనీస చర్యలు చేపట్టని పోలీసు, రవాణా శాఖలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం రహదారి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వేలాది మంది మరణిస్తుండటంతో వారి కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 11 ఏళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య 2,28,223. వీటిలో 87,341 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,68,871 మంది క్షతగాత్రులు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో చాలామంది కాళ్లు, చేతులు, నడుము వంటి కీలక భాగాలు దెబ్బతిని జీవచ్ఛవాల్లా మిగిలారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనను పరిశీలిస్తే.. మద్యం తాగి, హెల్మెట్‌ లేకుండా తీవ్ర నిర్లక్ష్యంతో బైక్‌ నడిపిన ఓ ద్విచక్ర వాహనదారుడు తన చావును కోరి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను నడిపిన వాహనం మరో 19మంది బస్సు ప్రయాణికులను బలి తీసుకుంది. బస్సు డ్రైవర్‌ అతివేగం కూడా ఈ ప్రమాదానికి మరో కారణంగా కనిపిస్తోంది.


అవగాహన కల్పించడంలో వైఫల్యం

రాష్ట్రంలో రహదారి భద్రతపై అవగాహన పెంచకపోవడంతో పాటు కనీస చర్యలు చేపట్టక పోవడం ప్రమాదాలకు ప్రధాన కారణం. ప్రయాణికులు, వాహనదారుల భద్రత కోసం పోలీసు శాఖలో రోడ్‌ సేఫ్టీ విభాగం ఉంది. రోడ్‌ సేఫ్టీ అఽథారిటీకి డీజీపీ ర్యాంకు అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే ఈ దీని గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ. వాహనదారులకు రాసే చలానాల సొమ్ములో 40శాతం రోడ్‌ సేఫ్టీ అథారిటీ ద్వారా ఖర్చు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా కొన్నేళ్లుగా రాష్ట్రంలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ పోస్టు అంటేనే పనిష్మెంట్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు భావిస్తుంటారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా రవాణా శాఖ రక్షణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కర్నూలులో బస్సు ప్రమాదం జరగ్గానే రాష్ట్రమంతా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వందల బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్ని రోజులు కనీస అనుమతులు కూడా లేకుండా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాకళ్లు మూసుకున్న ఆర్టీఏ అధికారులు ఇప్పుడు ప్రయాణికుల జాబితా డ్రైవర్‌ వద్ద లేనందుకు కూడా కేసులు రాస్తున్నారు.


వాహనాల పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుకు కేంద్రం రెండేళ్ల క్రితం రూ.6.5 కోట్లు ఇస్తే ఇప్పటికీ అతీగతి లేదు. జీపీఎస్‌ తప్పనిసరని కేంద్రం చెబుతున్నా అమలు కావట్లేదు. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయుల్లో రోడ్‌ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. పోలీసు, రవాణా, రోడ్లు భవనాలు, వైద్య ఆరోగ్య, విద్యా శాఖల అధికారులతో పాటు స్థానిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఈ కమిటీల్లో నియమించాలి. ఇవి ఎప్పటికప్పుడు సమావేశమై ఇచ్చే నివేదికలు, సూచనల మేరకు చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు వేల ప్రాణాలు నిలుస్తాయి. కానీ 2019 తర్వాత అటువంటి కమిటీలు రాష్ట్రంలో లేవు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా కమిటీల ఏర్పాటు దిశగా ఆలోచన చేయలేదు.

ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఇవీ...

నిర్లక్ష్యం, అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్‌ ధరించకపోవడం, మద్యం తాగి వాహనం నడపడం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వంటి కారణాలతో ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 06:14 AM