నాలుగేళ్లుగా నిర్లక్ష్యం
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:55 AM
మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనాస్థానంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. మచిలీపట్నం సౌత మండలం రుద్రవరంలోని గురుకుల జూనియర్ కళాశాల పక్కనే 16.34 ఎకరాలను నాలుగేళ్ల క్రితం కేటాయించినా నేటి వరకు కనీస వసతులు కల్పించలేదు. దీంతో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు నిలువనీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-వ్యవసాయ పరిశోధనాస్థానంపై నీలినీడలు
- రుద్రవరంలో 16.34 ఎకరాలు కేటాయింపు
- నేటికీ అధికారికంగా అప్పగించని అధికారులు
- అభివృద్ధికి రూ.5 కోట్లతో అంచనాలు
- ప్రతిపాదనలకే భవనాలు, ల్యాబ్, గోడౌన్, ప్రహారీ పరిమితం
- ఇబ్బందులు పడుతున్న శాస్త్రవేత్తలు, ఉద్యోగులు
- పట్టించుకోని అధికారులు, పాలకులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనాస్థానంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. మచిలీపట్నం సౌత మండలం రుద్రవరంలోని గురుకుల జూనియర్ కళాశాల పక్కనే 16.34 ఎకరాలను నాలుగేళ్ల క్రితం కేటాయించినా నేటి వరకు కనీస వసతులు కల్పించలేదు. దీంతో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు నిలువనీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో పూరిస్థాయి హంగులతో 26 ఎకరాల విస్తీర్ణంలో మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనాస్థానం నడిచేది. నాలుగేళ్ల క్రితం పరిశోధనాస్థానం భూములను మచిలీపట్నం మెడికల్ కళాశాల నిర్మాణం కోసం తీసుకున్నారు. ఇక్కడున్న పరికరాలు మచిలీపట్నం మార్కెట్ యార్డులో భద్రపరిచారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది పెడన రోడ్డులో ఉన్న జిల్లా ఏరువాక కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. రుద్రవరంలోని వ్యవసాయ పరిశోధనాస్థానానికి కేటాయించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీంతో నిలువనీడలేక శాస్త్రవేత్తలు, కార్యాలయ ఉద్యోగులు పరిపాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో సిబ్బంది అయినా వచ్చేవారు. గత రెండేళ్ల నుంచి కార్యాలయ సిబ్బంది కూడా ఎవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడటంలేదు.
నిలిచిపోయిన పరిశోధనలు
రాష్ట్ర వ్యాప్తంగా సముద్రతీర ప్రాంతంలోని చౌడు భూముల్లో అధిక దిగుబడులు వచ్చే వరి వంగడాలను కనుగొనేందుకు మచిలీపట్నంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రాన్ని 29 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఈ పరిశోధనాస్థానం భూములను మెడికల్ కళాశాలకు కేటాయించడంతో గత నాలుగేళ్లుగా నూతన వరి వంగడాలపై పరిశోధనలు, ప్రయోగాలు నిలిచిపోయాయి. వ్యవసాయ పరిశోధనాస్థానం అభివృద్ధి కోసం ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక కమిటీని గతంలో ఏర్పాటు చేసినా ఎలాంటి పురోగతిలేదు. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనాస్థానం ద్వారా ఎంసీఎం-100, ఎంసీఎం-101 వరి వంగడాలను కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఇతర రాష్ర్టాల్లోని తీర ప్రాంత భూముల్లో ఈ వరి వంగడాలు సాగు చేస్తున్నారు. రుద్రవరంలోని వ్యవసాయ పరిశోధనాస్థానానికి కేటాయించిన భూమిలో 2022 ఖరీఫ్ సీజన్‌లో 3.50 ఎకరాల విస్తీర్ణంలో దేశ, విదేశాలకు చెందిన మూడు వేల రకాల వరి వంగడాలను ప్రయోగాత్మకంగా సాగుచేశారు. సాగు నీరు సక్రమంగా అందకపోవడం, ఇక్కడి భూమిలో ఉప్పుశాతం అధికంగా ఉండటం, డ్రెయినేజీ సౌకర్యం లేకపోవడంతో సాగు చేసిన వరిపైరు చనిపోయింది.
భూమిలో 24 చౌడు శాతం
వ్యవసాయ పరిశోధనాస్థానానికి కేటాయించిన 16.34 ఎకరాల భూమి సాగుకు పనికివస్తుందా లేదా అనే అంశంపై శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు జరిపారు. ఈ భూమిలో 24 శాతం చౌడు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది. భూమిలో ఎనిమిది శాతానికి మించి చౌడుశాతం ఉంటే వరిసాగుకు అనుకూలం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏడాది పాటు వర్షపు నీరు, పంట కాలువ ద్వారా వచ్చే సాగు నీటిని ఈ పొలం మీదుగా నడిపితే కొంత మెరకైనా చౌడుశాతం తగ్గుతుందని శాస్త్రవేత్తల మాటగా ఉంది. ఈ భూమి పల్లపు ప్రాంతంగా ఉండటంతో కనీసం అడుగు ఎత్తున మెరక చేస్తేనే వ్యవసాయానికి అనుకూలంగా మారుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ భూమికి మల్లవోలు ప్రధాన పంట కాలువకు అనుబంధంగా ఉన్న కొత్తిమీర కోడు పంటకాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. కాలువ ద్వారా నీరు పొలానికి అందని స్థితి నెలకొంది.
రూ. 5 కోట్లతో అంచనాలు
రుద్రవరంలో వ్యవసాయక్షేత్రానికి కేటాయించిన భూమిలో పరిశోధనలు చేయాలంటే ముందస్తుగా పశువులు సంచారాన్ని అరికట్టేందుకు చుట్టూ ప్రహరీ అవసరం. భవనాలు, ల్యాబ్, గోడౌన్, ప్రహారీ నిర్మాణాలకు సంబంధించి ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ అధికారులు రూ.5కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. జిల్లా స్థాయిలో సమావేశాలు జరిగిన ప్రతిసారి ఈ పరిశోధనాస్థానం అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు తమ వంతు కృషి చేస్తామని పాలకులు, అధికారులు చెప్పడం, ఆ తర్వాత ఈ విషయాన్ని మరచిపోవడం రివాజుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికికేటాయించిన భూమిలోనే గురుకుల జూనియర్ కళాశాలకు వెళ్లే రహదారి, విద్యుత లైన్లు, తాగునీటి పైప్‌లైన్లు ఉన్నాయి. వీటిని పక్కకు మార్చాలని చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. ఈ పరిశోధనాస్థానం ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ప్రతిష్టాత్మకమైన ఈ వ్యవసాయ పరిశోధనాస్థానం నిర్మాణానికి పాలకులు, అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాలి.