ఉద్యోగులకు జగన్ చేసిన గాయాలింకా మానలేదు: నీలాయపాలెం
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:14 AM
గత ఐదేళ్లు ఉద్యోగులకు జగన్ చేసిన గాయాలు ఇంకా మానలేదని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ అన్నారు.
అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లు ఉద్యోగులకు జగన్ చేసిన గాయాలు ఇంకా మానలేదని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ఉపాధ్యాయులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఇచ్చిందని, జగన్ దాన్ని 21 శాతానికి తగ్గించారని, ఉద్యోగుల పీఎఫ్ నిధులను దోచుకున్న చరిత్ర జగన్‌దని విమర్శించారు. ఉద్యోగ సంఘ నాయకుడు కేఆర్ సూర్యనారాయణను చంపేస్తామని బెదిరించి, రాష్ట్రం వదిలిపోయేలా చేశారని, కరోనా సమయంలో మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై చేతులు విరిచి ఈడ్చుకుంటూ వెళ్లారని, అలాంటి జగన్‌కు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఉద్యోగులపై పెట్టిన క్రిమినల్ కేసులను కూటమి అధికారంలోకి రాగానే ఎత్తివేసిందని గుర్తు చేశారు.