PM-Suryaghar Scheme: నెడ్‌క్యాప్, మెప్మా.. నిజమేమిటి చెప్మా
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:08 AM
విజయవాడకు చెందిన ఎల్విన్ ఇండస్ట్రీస్ సంస్థ పీఎం-సూర్యఘర్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ముందుకు వచ్చింది. అదే విషయాన్ని మెప్మాకు ఫార్వర్డ్ చేశాం. ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేవు.
అంతా సక్రమమే అని కమలాకర్, తేజ్‌భరత్ వివరణ
అవాస్తవాలంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి ఖండన
‘ఇన్‌స్టలేషన్’ను దాచేసి... ‘ప్రచారం’ వరకే పరిమితం
దాచేస్తే దాగని నిజం... లేఖల్లో అసలు వాస్తవం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘విజయవాడకు చెందిన ఎల్విన్ ఇండస్ట్రీస్ సంస్థ పీఎం-సూర్యఘర్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ముందుకు వచ్చింది. అదే విషయాన్ని మెప్మాకు ఫార్వర్డ్ చేశాం. ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేవు. ఏ వెండర్‌కూ మేం ప్రాధాన్యత ఇవ్వలేదు. వినియోగదారుల్లో అవగాహన కార్యక్రమాలు ఎవరైనా చేపట్టవచ్చు’’ అని ఏపీ నూతన, పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (నెడ్‌క్యాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్‌బాబు స్పష్టీకరించారు.
‘సూర్యఘర్ పథకం అమలులో మేం ఒక నిర్దిష్ట కంపెనీ లేదా ఏజెన్సీని ప్రోత్సహించడం లేదు. మా సిబ్బందికి అలాంటి సూచనలేవీ జారీ చేయలేదు’’ అని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ వివరణ పంపారు. ‘సూర్యఘర్‌కు మాస్క్ మస్కా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై వారిరువురూ ఇలా స్పందించారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎటువంటి నిర్ధారణలు చేసుకోకుండా, స్పష్టత కోరకుండా తన పేరు ప్రస్తావించి, అవాస్తవాలను ప్రచురించిందని తేజ్ భరత్ ఆక్రోశం, విచారం కూడా వ్యక్తం చేశారు. వారిరువురి స్పందనపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతిస్పందన ఇదీ.....
ఏదీ వాస్తవం?
సూర్యఘర్‌కు ‘మాస్క్ మస్కా’ వేయడం అక్షర సత్యం! ‘ఆంధ్రజ్యోతి’ కథనం పూర్తిగా వాస్తవం! ఇందుకు తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. రూ.8వేల కోట్ల విలువైన సూర్యఘర్ ప్రాజెక్టు ప్రచారం, ఇన్‌స్టలేషన్ కోసం విజయవాడకు చెందిన ‘ఎల్విన్ ఇండస్ట్రీ్‌స’కు సహకరించాలంటూ నెడ్‌క్యాప్ ఎండీ నుంచి మెప్మా డైరెక్టర్‌కు ఆగస్టు 28న ఒక లేఖ వెళ్లింది. ఆ లేఖను కోట్ చేస్తూ, అందులో పేర్కొన్న మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌లకు ఆగస్టు 30వ తేదీన మెప్మా డైరెక్టర్ లేఖ రాశారు. అందులో... ప్రచారంతోపాటు ఇన్‌స్టలేషన్ బాధ్యతలు కూడా ఎల్విన్ ఇండస్ట్రీ్‌సకే ఇస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ... శనివారం నెడ్‌క్యాప్ ఎండీ ఇచ్చిన వివరణలో మాత్రం... ‘ఇన్‌స్టలేషన్’ అనే పదాన్ని దాచేశారు. ‘ప్రచారం’ వరకే పరిమితమయ్యారు. ‘సూర్యఘర్‌పై అవగాహన కల్పిస్తామని ఎల్విన్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. దానినే నేను ఫార్వర్డ్ చేశాను’ అని నెడ్‌క్యాప్ ఎండీ చెప్పడం గమనార్హం! ఇదొక్కటే కాదు... కమలాకర్ బాబు, తేజ్‌భరత్ దాటవేసిన, దాచేసిన నిజాలు ఇంకా ఉన్నాయి. సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలూ ఉన్నాయి.
చెప్పండి సార్...
‘సూర్యఘర్‌పై ఎవరైనా ప్రచారం చేయవచ్చు’ అని మెప్మా, నెడ్‌క్యాప్ అధిపతులు చెబుతున్నారు. కానీ... ఇక్కడ ఎల్విన్ ఇండస్ట్రీస్ అంతకుమించి చేస్తోంది. బ్యాంక్ లోన్ కాకుండా లబ్ధిదారుడు చెల్లించాల్సిన వాటా రూ.23 వేలు తానే భరిస్తానని చెప్పింది. అంత అవసరం ‘ఎల్విన్’కు ఏమొచ్చింది? ఇది ‘ఇన్‌స్టలేషన్’ కోసం వేసే వల! ఎంతమంది లబ్ధిదారులు ముందుకు వస్తే ఎల్విన్‌కు అంత లాభం! ఇది నిజం కాదంటారా?
‘ప్రచారం, ఇన్‌స్టలేషన్’ అనే రెండు పదాలనూ మెప్మా డైరెక్టర్ తన లేఖలో వాడారు. ఎల్విన్ ఇండస్ట్రీ్‌సకు ఈ రంగంలో ఏం అనుభవం, అర్హత ఉందని సిఫారసు చేశారు? అదేమైనా ఎన్‌జీఓనా? లేక ప్రభుత్వ రంగ సంస్థా? ఒక ప్రైవేటు సంస్థను సిఫారసు చేయడంలోని ఆంతర్యం ఏమిటి?
‘మెప్మా తరఫున ఏ సంస్థనూ ప్రోత్సహించలేదు’ అని సంస్థ డైరెక్టర్ తేజ్ భరత్ చెబుతున్నారు. మరి... నెడ్‌క్యాప్ లేఖను ఉటంకిస్తూ, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాజెక్టు అధికారులకు లేఖ ఎందుకు రాసినట్లు? నెడ్‌క్యాప్ కోరినవెంటనే ఓ ప్రైవేటు కంపెనీకి సహకరించాలంటూ లేఖ రాయడం ‘ప్రోత్సహించడం’ కాదా?
‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన వెంటనే.. శనివారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లకు మరో సర్క్యులర్ పంపించారు. ‘ఎల్విన్ ఇండస్ట్రీస్’ ప్రస్తావన లేకుండా... ‘సూర్యఘర్ ప్రాజెక్టుకు సహకరించండి’ అని అందులో ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’కి పంపిన వివరణకు ఈ కొత్త సర్క్యులర్‌నే జత చేశారు. మరి... గత నెల 30వ తేదీన రాసిన లేఖ మాటేమిటి? ‘ప్రచారం, ఇన్‌స్టలేషన్ కోసం ఎల్విన్ ఇండస్ట్రీ్‌సకు సహకరించండి’ అని అందులో చెప్పలేదా? అది దాచేస్తే దాగుతుందా?
‘మాస్క్’ తీసిన కంపెనీ!
‘అబ్బే... ఎల్విన్ ఇండస్ట్రీస్ ప్రచారం మాత్రమే చేస్తుంది’ అని కమలాకర్ బాబు, తేజ్ భరత్‌లు వివరణ పంపగా... ‘కాదు కాదు. మేం సోలార్ రూఫ్‌టా్‌పల వ్యాపారం కూడా చేస్తున్నాం’ అని ఎల్విన్ సంస్థ ‘మాస్క్’ తీసేసి మరీ చెప్పింది. ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో ఆ సంస్థ పేరు ప్రస్తావించనప్పటికీ... ‘అది మేమే’ అని బయటపడింది. ‘‘మేం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎం-సూర్యఘర్ పథకం అమలుకు ఎంప్యానల్ అయ్యాము. ఎంప్యానల్ అయిన కంపెనీలు వారి సోలార్ ప్లాంటు నాణ్యతను, ధరను ప్రజలకు వివరిస్తాయి. వారికి నచ్చితే బ్యాంక్ లోను లేదా సొంతంగా ఖర్చుపెట్టి ఇన్‌స్టలేషన్ చేయించుకుంటారు. దీనికి నెడ్‌క్యా్‌పతో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో టెండర్ ప్రక్రియ లేదు. వర్క్ కాంట్రాక్టర్ ఆర్డర్ మాకు ఇవ్వలేదు’’ అని ఆ సంస్థ తెలిపింది. వెరసి... తాము ప్రచారంతోపాటు, ఇన్‌స్టలేషన్ పని కూడా చేస్తామని చెప్పేసింది. నెడ్‌క్యాప్ ఎండీ మాత్రం ‘ప్రచారానికే’ పరిమితమయ్యారు. ఎల్విన్ ఇండస్ట్రీస్ నిజంగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఎంప్యానల్ అయి ఉంటే... ఆ విషయాన్ని ‘మెప్మా’కు పంపిన లేఖలో నెడ్‌క్యాప్ ఎండీ చెప్పి ఉండొచ్చు కదా!? ఇక... ఎల్విన్‌తోపాటు చాలా కంపెనీలు ‘ఎంప్యానల్’ అయి ఉంటాయి. వాటన్నింటినీ కాదని... ఆ సంస్థకు మాత్రమే సహకరించాలని ఎందుకు లేఖలు రాసినట్లు?