Share News

కొలిమిగుండ్లలో నక్సల్స్‌ కలకలం!

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:00 PM

కొలిమిగుండ్ల మండలంలో నక్సల్స్‌ కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఎర్రకోన కొండల్లో నక్సల్స్‌ సంచరిస్తున్నారంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

   కొలిమిగుండ్లలో నక్సల్స్‌ కలకలం!
జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఎర్ర కొండలు

ఎర్రకోన కొండల్లో ఛత్తీస్‌గడ్‌ పోలీసుల ఆరా

కొలిమిగుండ్ల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కొలిమిగుండ్ల మండలంలో నక్సల్స్‌ కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఎర్రకోన కొండల్లో నక్సల్స్‌ సంచరిస్తున్నారంటూ పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి బలం చేకూరుస్తూ శుక్రవారం ఉదయం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని నేలబిళం, ఓబులేసు కోన ప్రాంతాల్లో ఎర్రకోన కొండలను ఛత్తీస్‌గడ్‌ రాషా్ట్రనికి చెందిన పోలీసులు సందర్శించారు. సుమారు రెండు వాహనాల్లో 20మంది వరకూ ఛత్తీస్‌గడ్‌ పోలీసులు ఆ కొండల వద్ద మ్యాప్‌ బయటకు తీసి పరిశీలించారు. అదేదారిలో పయనిస్తున్న కొందరి వాహనదారులను పోలీసులు ఆపి విచారణ చేశారు. కాగా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలను కలుపుతూ ఈఎర్రమల కొండలు పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి. ఇటీవల ఛత్తీస్‌గడ్‌, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎనకౌంటర్లు చోటు చేసుకోవడం, పలువురు నక్సల్స్‌ మృతి చెందడం ఘటనలు జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ కూబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కొలిమిగుండ్ల మండలం సరిహద్దు కొండల్లో గాలి మరల సమీపంలో కొంత మంది నక్సల్స్‌ తలదాచుకుంటున్నార్న అనుమానాలు ఉండటంతో ఛత్తీస్‌గడ్‌ పోలీసులు ఎర్రకోన కొండలకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు గతంలో బెలుం గనులు, కొండల్లో నక్సల్స్‌ ఆశ్రయం పొంది, పోలీసులతో ఎదురు కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో మరోసారి మండలంలోని నక్సల్స్‌ సంచారం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Nov 28 , 2025 | 11:00 PM