Share News

Defense Minister Rajnath Singh: దేశ ఆర్థిక భద్రతకు నేవీ వెన్నుదన్ను

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:22 AM

సముద్ర తీరానికి రక్షణ కల్పించడమే కాకుండా దేశ ఆర్థిక భద్రతలో కూడా భారత నావికాదళం ప్రధాన భూమిక పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Defense Minister Rajnath Singh: దేశ ఆర్థిక భద్రతకు నేవీ వెన్నుదన్ను

  • ఉదయగిరి, హిమగిరి నౌకల ప్రారంభ వేడుకలో రాజ్‌నాథ్‌

  • విశాఖలో రెండు యుద్ధనౌకలు ప్రారంభించి జాతికి అంకితం

  • ఏకకాలంలో రెండు నౌకలు ప్రారంభించడం ఇదే తొలిసారి

విశాఖపట్నం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): సముద్ర తీరానికి రక్షణ కల్పించడమే కాకుండా దేశ ఆర్థిక భద్రతలో కూడా భారత నావికాదళం ప్రధాన భూమిక పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. సముద్ర జలాల్లో లభించే చమురు, సహజ వాయువులను శత్రువుల నుంచి కాపాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. రెండు వేర్వేరు నౌకా నిర్మాణ కేంద్రాల్లో (ముంబై, కోల్‌కతా) తయారుచేసిన మల్టీ మిషన్‌ స్టెల్త్‌ ఫ్రిగేట్లు ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి నౌకలను విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో ఆయన మంగళవారం సాయంత్రం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రెండు వేర్వేరు షిప్‌ యార్డుల్లో నిర్మించిన రెండు యుద్ధ నౌకలను ఇలా ఏకకాలంలో ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా సొంతంగా యుద్ధనౌకలు తయారు చేసుకోవాలనే కల వీటితో సాకారమైందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌తో సమాధానం చెప్పామని తెలిపారు. అయితే ఈ ఆపరేషన్‌ పూర్తి కాలేదని, తాత్కాలికంగా ఆగిందని వెల్లడించారు. కార్యక్రమంలో తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


అత్యాధునిక ఆయుధాలు, సెన్సర్లు

ఉదయగిరి, హిమగిరి నౌకలను దేశీయంగా నిర్మించారు. సముద్ర రక్షణలో ఇవి భారత నౌకాదళానికి కీలకం కానున్నాయి. ప్రాజెక్ట్‌-17ఏ కింద నిర్మించిన రెండో నౌక ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి. ఇందులో తొలి నౌక ఐఎన్‌ఎస్‌ నీలగిరిని ఈ ఏడాదే ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉదయగిరిని ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మించింది. మూడో నౌకగా ఐఎన్‌ఎస్‌ హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎ్‌సఈ) రూపొందించింది. నీలగిరి శ్రేణిలో మొత్తం 7 గైడెడ్‌ మిస్సైల్‌ ఫ్రిగేట్లను భారత్‌ నిర్మిస్తోంది. నీలగిరి, ఉదయగిరి, తారగిరి, మహేంద్రగిరి యుద్ధనౌకలను ఎండీఎల్‌... హిమగిరి, దునాగిరి, వింధ్యాగిరి యుద్ధనౌకలను జీఆర్‌ఎ్‌సఈ నిర్మిస్తున్నాయి. ఉదయగిరి బరువు 6,700 టన్నులు. ఇది శివాలిక్‌ క్లాస్‌ కంటే ఐదు శాతం ఎక్కువ. అధునాతన రాడార్‌ వ్యవస్థ కలిగిన ఉదయగిరి సొగసైన రూపంతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అధునాతన ఆయుధాలు, సెన్సర్లు, రాడార్‌ వ్యవస్థలను అమర్చారు. సూపర్‌సోనిక్‌ క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణులు, 76 ఎంఎం ఎంఆర్‌ గన్‌, 30 ఎంఎం, 12.7 ఎంఎం క్లోజ్‌-ఇన్‌ ఆయుధ వ్యవస్థలు కూడా ఉన్నాయి. భారత నేవీకి చెందిన వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో డిజైన్‌ చేసిన 100వ నౌకగా ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి నిలిచింది.

Updated Date - Aug 27 , 2025 | 05:23 AM