Chief Minister Chandrababu will Inaugurate: నేటి నుంచి మహిళా సాధికార సదస్సు
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:15 AM
తిరుపతిలో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా సాధికార సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..
లోక్‌సభ స్పీకర్ సహా 200కు పైగా ప్రతినిధులు తిరుపతికి రాక
ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు
ముగింపు సభకు రానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
తిరుపతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా సాధికార సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సదస్సుకు లోక్‌సభ స్పీకరు ఓంబిర్లా సహా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల సభ్యులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించనున్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు. తిరుపతి శివార్లలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సదస్సును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం ఉదయం ప్రారంభిస్తారు. సదస్సుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్‌పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యె మోషేను రాజుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్నారు. ‘వికసిత్ భారత్ కోసం మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి’ అనే ప్రధాన లక్ష్యంతో జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్, కొత్త సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మహిళా సాధికారత అనే రెండు అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. పలు కీలక తీర్మానాలు ఆమోదించనున్నారు. సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుండడంతో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతినిధులకు బస, రవాణా సదుపాయాలతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనాలకు సైతం ఏర్పాట్లు చేసింది.
సీఎం చంద్రబాబు పర్యటన ఇలా...
సీఎం చంద్రబాబు ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టరులో బయలుదేరి 9 గంటలకు తిరుపతి చేరుకుంటారు. శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే విట్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు విశ్వనాథం మనవరాలి వివాహానికి హాజరవుతారు. అనంతరం 10 గంటలకు సదస్సు జరిగే కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని ఓం బిర్లాను ఆహ్వానిస్తారు. ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. 2.15 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు. కాగా, గవర్నర్ ఆదివారం ఉదయం తిరుపతి చేరుకుని ఓ వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం నగరంలోనే బస చేస్తారు. సోమవారం జాతీయ మహిళా సాధికార సదస్సు ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు.