CM Chandrababu: దేశాన్ని అగ్ర భాగాన నిలిపేది జాతీయ భావమే..
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:00 AM
ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచంతో పోటీపడుతూ మన దేశం అగ్రస్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సమరయోధుల స్ఫూర్తితో ఇంటింటా జాతీయజెండా: సీఎం
విజయవాడ సిటీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచంతో పోటీపడుతూ మన దేశం అగ్రస్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పౌరుల్లో ఉండే జాతీయభావమే దేశాన్ని అన్నిరంగాల్లో మొదటి స్థానంలో నిలుపుతుందని, స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను ఇంటింటా ఎగురవేయాలని పిలుపిచ్చారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ జాతీయ జెండా) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మాట్లాడుతూ.. శక్తి, స్ఫూర్తి, ఉద్వేగం, అనుబంధం, ఐక్యతకుమారుపేరు మువ్వన్నెల జెండా అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగాకు ప్రధాని శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కులం, మతం, భాష, ప్రాంతీయ విభేదాల్లేకుండా జాతీయ స్ఫూర్తిని నింపే త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపైనా ఎగురవేసి, ప్రతి ఒక్కరూ జాతికి పునరంకితమై దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మోదీ నాయకత్వంలో దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతోందని చెప్పారు. భారతదేశానిది డెడ్ ఎకానమీ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 143 కోట్ల మంది సామర్థ్యాన్ని చాటే జాతీయ జెండాను అందించిన పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సర్దార్ గౌతు లచ్ఛన్న, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను సీఎం స్మరించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు దుర్గేశ్, సత్యకుమార్, ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు. అనంతరం సమరయోధుల కుటుంబీకులను సీఎం ఘనంగా సత్కరించారు. పింగళి జీవితచరిత్ర పుస్తకాన్ని, చిత్రపటాన్ని ఆవిష్కరించారు.