Share News

National Medical Commission: ఇంటర్న్‌షిప్‌ చేయాల్సిందే

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:26 AM

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థుల(ఎఫ్ఎంజీ) శాశ్వత రిజిస్ట్రేషన్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు దాదాపు తెరపడింది.

National Medical Commission: ఇంటర్న్‌షిప్‌ చేయాల్సిందే

  • విదేశాల్లో వైద్య విద్య చేసిన వారికి ఎన్‌ఎంసీ స్పష్టీకరణ

  • క్లినికల్‌ నైపుణ్యం అవసరం

  • వైద్య పుస్తకాలు చదివితే సరిపోదు

  • అసమగ్ర విద్యతో రోగులకు ముప్పు

  • విదేశాల్లో చదివిన వారిపై రాజీవద్దు

  • రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు పాటించాలి

  • విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ వ్యవహారంపై మంత్రి రాసిన లేఖకు ఎన్‌ఎంసీ వివరణ

  • హైకోర్టులో ఏపీఎంసీ రివ్యూ పిటిషన్‌

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థుల(ఎఫ్ఎంజీ) శాశ్వత రిజిస్ట్రేషన్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు దాదాపు తెరపడింది.ఎఫ్‌ఎంజీ రిజిస్ట్రేషన్‌ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని, ఈ విషయంలో ఎలాంటి రాజీపడొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) స్పష్టత ఇచ్చింది. ఏపీలో శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఎఫ్‌ఎంజీలు పోరాటం చేస్తున్నారు.నెల రోజుల క్రితం వందల మంది విద్యార్థులు విజయవాడలోని హెల్త్‌ వర్సిటీ ఎదుట ధర్నా కూడా చేశారు. ఈ క్రమంలో ఎఫ్‌ఎంజీ కట్టా వంశీ హైకోర్టును ఆశ్రయించారు. కిర్గిస్థాన్‌ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించిన వంశీ.. శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోరుతున్నారు. వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై జూలై 9న న్యాయస్థానం తీర్పునిచ్చింది.‘‘ఆ విద్యార్థి చదువుకు సంబంధించి భారత రాయబార కార్యాలయం నెల రోజుల్లో అధీకృత సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోయినా..వంశీకి శాశ్వత రిజిస్ట్రేషన్‌ ఇవ్వాలి.’’ అని ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌(ఏపీఎంసీ)ను ఆదేశించింది. ఇదే విషయంపై మరో నలుగురు ఎఫ్‌ఎంజీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపైనా హైకోర్టు తీర్పునిచ్చింది. పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఎందుకివ్వడం లేదో నెలలోపు చెప్పాలని ఈ నెల 4న ఆదేశించింది. ఈ రెండు తీర్పుల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబు ఎఫ్‌ఎంజీలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎన్‌ఎంసీని కోరారు. కొవిడ్‌-19, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా రాష్ట్రానికి తిరిగి వచ్చి, ఆన్‌లైన్‌లో వైద్య విద్యను అభ్యసించిన ఎఫ్‌ఎంజీలు.. ఏ మేరకు ఆఫ్‌లైన్‌ ద్వారా చదవాలన్న అంశంపై స్పష్టత కోరారు.


అలాగే,ఆయా దేశాలు జారీ చేసే ‘కాంపన్సేషన్‌ స్టడీ సర్టిఫికెట్‌’లో ఎలాంటి వివరాలను పొందుపరచాలనే అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.వీటితో పాటు ఆన్‌లైన్‌ విద్యకు బదులుగా ఆఫ్‌లైన్‌లో చదవడానికి విద్యా కాలాన్ని పొడిగించాలా? అనే అంశంపై కూడా స్పష్టత కోరుతూ ఈ నెల 5న ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అడిగిన వాటికి ఎన్‌ఎంసీ స్పందించి, ఆయా వివరాలను గురువారం రాష్ట్రానికి పంపింది.

ఎంఎన్‌సీ ఏం చెప్పిందంటే

వైద్య విద్యలో అంతర్భాగమైన క్లినికల్‌ కోర్సుల ప్రాధాన్యతను వివరిస్తూ..ఈ కోర్సులకు సంబంధించిన విద్యను ఆన్‌లైన్‌లో అభ్యసించడం వీలు కాదని స్పష్టం చేసింది. ‘‘వైద్య విద్య కేవలం పుస్తకాలు చదివేందుకే పరిమితం కాదు. అతి ముఖ్యమైన క్లినికల్‌ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ప్రజల ప్రాణాలను కాపాడడానికి తగు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా వైద్య విద్యార్థులు పెంపొందించుకోవాలి.అసమగ్ర వైద్య విద్యనభ్యసించే వారితో సమాజానికి తీవ్ర ముప్పు ఎదురవుతుంది. విదేశాల్లో వైద్య విద్యనభ్యసించే వారిలో భారత్‌లో వైద్య వృత్తి చేపట్టడానికి అవసరమైన అర్హతలు కల్పించే నిమిత్తం 2021 నుంచి పలు మార్గదర్శకాలు, పబ్లిక్‌ నోటీసులు ఇచ్చాం.శాశ్వత రిజిస్ట్రేషన్‌ జారీ చేసే ముందు.. ఈ నియమాలు,మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి.ఈ బాధ్యత రాష్ట్రాల వైద్య సంఘాలదే.విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారంతా స్వదేశంలో తప్పనిసరిగా ఏడాది పాటు ఇటర్న్‌షిప్‌ చేయాల్సిందే.’’ అని ఎన్‌ఎంసీ పేర్కొంది. కొవిడ్‌-19, రష్యా-ఉక్రెయిన్‌ యద్ధం నేపథ్యంలో ఎన్‌ఎంసీ జారీ చేసిన పబ్లిక్‌ నోటీసులను కూడా లేఖలో ప్రస్తావించింది.వీటి ప్రకారం దేశానికి తిరిగి వచ్చి ఆన్‌లైన్‌లో విద్యనభ్యసించిన కాలం ఆధారంగా ఒకటి లేదా రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విదేశాల్లో చదివిన వైద్య విద్యార్థుల పాస్‌పోర్టుల్లో పేర్కొన్న వివరాల మేరకు అదనంగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో వైద్య విద్యా సంస్థలు జారీ చేసే కాంపెన్సేషన్‌ స్టడీ సర్టిఫికెట్లలో ఆన్‌లైన్‌ విద్యతో పాటు ఆఫ్‌లైన్‌ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ఖచ్చితంగా పొందుపరచాలని ఎన్‌ఎంసీ పేర్కొంది. ఆ పత్రాల్లో ఉన్న వివరాల ఆధారంగా క్లినికల్‌ కోర్సులను ఎంతకాలం అభ్యసించారో వివరంగా తెలపాలని సూచించింది.


అదనపు సమయం కోరుతూ..

ఎన్‌ఎంసీ జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను పాటించకుండా హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌(ఏపీఎంసీ) చర్యలు తీసుకుంటే ఇంటర్న్‌షిప్‌ విషయంలో ఏకపక్షంగా నియమాలను సడలించినట్లు అవుతుంది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తే ఎన్‌ఎంసీ రూపొందించిన నియమాల స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతుంది. ఈ కారణంగా గత నెలలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమగ్రంగా పరిశీలించి తగుచర్య చేపట్టడానికి అదనపు సమయాన్ని కోరుతూ కోర్టులో రివ్యూ పిటిషిన్‌ వేయాలని ఏపీఎంసీకి ఎన్‌ఎంసీ సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును అమలు చేయడానికి అదనపు సమయాన్ని కోరడంతో పాటు, ఇంటర్న్‌షిప్‌ విషయంలో రెండు తీర్పులకు సంబంధించి స్పష్టత కోరుతూ ఏపీఎంసీ గురువారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్‌ఎంసీ నిబంధనలు, లేఖలో ప్రస్తావించిన అంశాలనుకోర్టు ముందు ఉంచనుంది.

Updated Date - Aug 09 , 2025 | 05:27 AM