Central Leaders: తొక్కిసలాట ఘటనపై నేతల దిగ్భ్రాంతి
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:15 AM
శ్రీకాకుళంలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై పలువురు నేతలు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల విచారం
మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేలు
భోపాల్ పర్యటన రద్దు చేసుకొని ఏపీకి కేంద్ర మంత్రి రామ్మోహన్
న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై పలువురు నేతలు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జ్యోతిరాదిత్య సింధియా, రామ్మోహన్‌నాయడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎ్‌ఫ ద్వారా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి రూ.50 వేలను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాగా, తొక్కిసలాట ఘటన గురించి తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తన భోపాల్ పర్యటనను రద్దు చేసుకొని రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. క్షతగాత్రులకు తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.