Share News

జాతీయ రహదారులు రక్తసిక్తం

ABN , Publish Date - May 11 , 2025 | 01:18 AM

జిల్లాలో జాతీయ రహదారులు శనివారం రక్తసిక్తమయ్యాయి. విజయవాడ- హనుమాన్‌ జంక్షన్‌ రోడ్డులో వీరవల్లి వద్ద, విజయవాడ- మచిలీపట్నం రోడ్డులో తరకటూరు వద్ద జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. దుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన కుటుంబంలో బావ బావమరిది ఇద్దరూ చనిపోయారు. బావమరిదికి పది రోజుల కిందటే వివాహం కావడం, అతని భార్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆయా కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా, మచిలీపట్నంలో జరిగే సమావేశానికి బయలుదేరిన ఆరుగురు ఆశా వర్కర్లలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆశావర్కర్లు భారీగా బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. హనుమాన్‌ జంక్షన్‌, తాడంకి, గోపువానిపాలెం గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

జాతీయ రహదారులు రక్తసిక్తం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి.. పది మందికి గాయాలు

జిల్లాలో జాతీయ రహదారులు శనివారం రక్తసిక్తమయ్యాయి. విజయవాడ- హనుమాన్‌ జంక్షన్‌ రోడ్డులో వీరవల్లి వద్ద, విజయవాడ- మచిలీపట్నం రోడ్డులో తరకటూరు వద్ద జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. దుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన కుటుంబంలో బావ బావమరిది ఇద్దరూ చనిపోయారు. బావమరిదికి పది రోజుల కిందటే వివాహం కావడం, అతని భార్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆయా కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా, మచిలీపట్నంలో జరిగే సమావేశానికి బయలుదేరిన ఆరుగురు ఆశా వర్కర్లలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆశావర్కర్లు భారీగా బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. హనుమాన్‌ జంక్షన్‌, తాడంకి, గోపువానిపాలెం గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

కొత్త జీవితంలో విషాదం

విజయవాడ/హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌/ హనుమాన్‌జంక్షన్‌ మే 9(ఆంధ్రజ్యోతి): పది రోజుల క్రితం పెళ్లిపీటలు ఎక్కారు. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటున్నారు. దాంపత్య జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. రెండు కుటుంబాల మధ్య పెళ్లినాటి ఆనందోత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. వధువు మెడలో వరుడు వేసిన మూడు ముళ్లను రోడ్డు ప్రమాదం తెంచేసింది. ఆనందంలో ఉన్న కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో కన్నీళ్లు తెప్పించింది. హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మూడెడ్ల ధీరజ్‌(37) హైదరాబాద్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి గత నెల 30న కాకినాడ జిల్లా తునికి చెందిన రమ్యరూపతో వివాహమైంది. ఇటీవలే హనుమాన్‌జంక్షన్‌లో వివాహ రిసెప్షన్‌ వేడుక ఘనంగా నిర్వహించుకున్నారు. తుని వెళ్లి వచ్చిన నూతన వధూవరులు తోబుట్టువులతో కలిసి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరవల్లికి చెందిన చీరా నవీన్‌(36) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి. ధీరజ్‌కు బావ. వారితో పాటు ధీరజ్‌ తోబుట్టువు అలేఖ్య, నవీన్‌ భార్య లక్ష్మీ ప్రవల్లిక, ముగ్గురు చిన్నారులు కారులో అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. జాతీయ రహదారిపైకి వచ్చిన గంటలోనే మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చింది. విజయవాడకు చెందిన ఆన్‌లైన్‌ వీడియోగ్రాఫర్‌ కోసూరి శ్రీనివాసరావు ఆన్‌లైన్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. హనుమాన్‌ జంక్షన్‌లో జరిగే కార్యక్రమంలో ఫొటోలు తీయడానికి వెళ్తున్నాడు. తన వెంట సహాయకుడు శ్రీనును తీసుకెళ్తున్నాడు. సరిగ్గా వీరవల్లి జాతీయ రహదారిపైకి వచ్చే సరికి జంక్షన్‌ వైపు వెళ్లే రహదారిపై ఉండాల్సిన వీరి కారు డివైడర్‌ దాటి విజయవాడ వైపు వెళ్తున్న ధీరజ్‌ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు చిధ్రమయ్యాయి. ధీరజ్‌ కారులో ఉన్న వాళ్లంతా గాయాలపాలయ్యారు. వారిని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ధీరజ్‌, నవీన్‌ మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ధీరజ భార్య రమ్యరూప పరిస్థితి విషమంగా ఉంది. నవీన్‌ సతీమణి ప్రవల్లిక, పిల్లలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాసరావు, సహాయకుడు శ్రీనుకు గాయాలయ్యాయి. రెండు కారులు వేగంగా ఢీ కొనడంతో ఒక్కసారిగా జాతీయ రహదారిపై భారీ శబ్దం వచ్చింది. కేసును వీరవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధీరజ్‌ తండ్రి మూడెడ్ల వెంకట్రావు చిట్‌ఫండ్‌ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తూ కుమారుడిని చార్టెడ్‌ అకౌంటెంట్‌గా తీర్చిదిద్దారు. కొడుకుపై ఎన్నో ఆశలు పెంచుకున్న వెంకట్రావు కుమారుడు, అల్లుడు ప్రమాదంలో చనిపోవడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

సమావేశానికి వెళ్తూ అనంతలోకాలకు..

గూడూరు/పమిడిముక్కల, మే10 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో జరిగే సమావేశానికి బయలుదేరిన ఆశావర్కర్లలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన ఘటన మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై తరకటూరు వద్ద శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కపిలేశ్వరపురం మండలం గోపువానిపాలెం గ్రామానికి చెందిన తాడేపల్లి విజయలక్ష్మి(45), కపిలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కు చెందిన ఊటుకూరి దుర్గ(40), శ్రీవాణి, నిర్మల, జ్యోతి, మాగంటి సుజాత మంటాడలో ఆటో ఎక్కి మచిలీపట్నంలో జరిగే సమావేశానికి బయలుదేరారు. తరకటూరు వచ్చే సరికి విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు వెనుక నుంచి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో దుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. విజయలక్ష్మి (45) ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. శ్రీవాణి, నిర్మల, జ్యోతి, సుజాత, ఆటో డ్రైవర్‌ మనోజ్‌లకు గాయాలయ్యాయి. వీరిని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పెడన సీఐ కె.నాగేంద్రప్రసాద్‌, ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తోటి ఆశా వర్కర్లు వందలాదిగా ఆస్పత్రికి తరలివచ్చి గొల్లు మన్నారు.

పలువురు సంతాపం...

కాగా, రోడ్డు ప్రమాదం సమాచారం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ బండి రామకృష్ణ, డీఎంహెచ్‌వో శర్మిష్ట సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తాడంకి, గోపువాని పాలెంలో విషాదచాయలు

రోడ్డు ప్రమాదంలో తాడంకి, గోపువానిపాలేనికి చెందిన ఆశావర్కర్లు ఊటుకూరి దుర్గ, తాడేపల్లి విజయలక్ష్మి మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద చాయలు నెలకొన్నాయి. ప్రమాద వార్త తెలియగానే తాడంకి టీడీపీ నాయకుడు జక్కా శ్రీనివాసరావు, సర్పంచ్‌ ధనలక్ష్మి, మస్తాన్‌రావు మచిలీపట్నం వెళ్లి మృతులకు నివాళులర్పించారు.

Updated Date - May 11 , 2025 | 01:18 AM