SFI National President: జాతీయ నూతన విద్యావిధానం విషతుల్యం
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:01 AM
జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఆదర్శ ఎం.సాజి స్పష్టం చేశారు.
ఎస్‌ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఆదర్శ ఎం.సాజి
తిరుపతి(విద్య), డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఆదర్శ ఎం.సాజి స్పష్టం చేశారు. శనివారం తిరుపతిలో ఎస్‌ఎ్‌ఫఐ 25వ రాష్ట్ర మహాసభల రెండోరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌ఈపీ-2020ని జాతీయ బహిష్కరణ విధానంగా అభివర్ణిస్తూ దీనికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమాలను కొనసాగిస్తామని ప్రకటించారు. జాతీయ విద్యావిధానం ద్వారా కేంద్రం విద్యా వ్యవస్థను వ్యాపారీకరణ, కేంద్రీకరణ, మతాంతీకరణ చేస్తోందని ఆరోపించారు. విషతుల్యమైన ఈ విద్యావిధానం వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా 89వేల ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని, నాలుగేళ్లలో 65లక్షల మందికి పైగా విద్యార్థులు చదువులు మానేశారని వివరించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 12 వేలకుపైగా పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని చెప్పారు. సిలబస్ మార్పు పేరుతో వాస్తవ చరిత్రను వక్రీకరిస్తూ, కల్పిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చొప్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని మహాసభ తీర్మానించిందని వెల్లడించారు.