Share News

గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:13 AM

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మకమైన జాతీయ పంచాయతీ అవార్డు -2025 లభించింది. ఆత్మ నిర్భర్‌ పంచాయతీ ప్రత్యేక అవార్డుల కేటగిరిలో 2025 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఆదివారం ప్రటించిన అవార్డుల జాబితాలో గొల్లపూడి పంచాయతీకి మూడో స్థానం దక్కింది.

గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు

ఆత్మ నిర్భర్‌ పంచాయతీ ప్రత్యేక అవార్డుల కేటగిరిలో ఎంపిక

సొంత వనరులతో గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు పురస్కారం

24న జాతీయ పంచాయతీరాజ్‌ దివస్‌ రోజున బిహార్‌లో ప్రదానం

గొల్లపూడి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మకమైన జాతీయ పంచాయతీ అవార్డు -2025 లభించింది. ఆత్మ నిర్భర్‌ పంచాయతీ ప్రత్యేక అవార్డుల కేటగిరిలో 2025 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఆదివారం ప్రటించిన అవార్డుల జాబితాలో గొల్లపూడి పంచాయతీకి మూడో స్థానం దక్కింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సొంత ఆదాయ వనరులతో అభివృద్ధి చేపట్టిన పంచాయతీల కేటగిరిలో ఆత్మ నిర్భర్‌ కింద గొల్లపూడికి అవార్డు దక్కడం విశేషం. ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దివస్‌ రోజున బిహార్‌లోని మధుబానిలో అవార్డులు పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ వ్యాప్తంగా పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రత్యేకాధికారుల శ్రమ ఫలితమే!

విజయవాడ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న గొల్లపూడి పంచాయతీని జనాభా ప్రాతిపదికన గొల్లపూడి, జక్కంపూడి, రామరాజ్‌నగర్‌ అని మూడు పంచాయతీలుగా విభజించాలని గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులే కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో రాష్ట్రంలో 2021 ఏప్రిల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గొల్లపూడి పంచాయతీని విభజించే అంశం కోర్డులో ఉన్న కారణంగా గొల్లపూడి పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో గొల్లపూడి ఉంది. ఏ పంచాయతీకి అయినా సర్పంచ్‌ల పాలనలో ఇప్పటి వరకు అవార్డులు రావడం చూసి ఉంటారు. అయితే ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీకి అవార్డు దక్కడం ఇదే ప్రప్రథమంగా చెప్పవచ్చు. ప్రత్యేకాధికారుల పాలనలో అంత అవినీతి జరిగిందని.. ఇంత అవినీతి జరిగిందని అనేక పంచాయతీల్లో నిధుల గోల్‌మాల్‌ గురించి వింటుంటాం. అయితే అందుకు పూర్తి భిన్నంగా నిజాయతీ గల అధికారుల శ్రమ ఫలితంగా గొల్లపూడికి దేశంలోనే అవార్డు రావడంతో స్థానికులతో పాటు పంచాయతీకి ప్రత్యేకాధికారులుగా పని చేసిన అధికారులు, ప్రజా ప్రతినిఽధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొల్లపూడి పంచాయతీలో అపార్ట్‌మెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌, హౌస్‌ ట్యాక్స్‌, స్టాంప్‌ డ్యూటీ ఇతర ట్యాక్స్‌ల ద్వారా ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ప్రజల్లో చైతన్యం కలిగించి సొంత ఆదాయ వనరులను సృష్టించుకొని ఆ నిధులతో పంచాయతీని అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నడిపినందుకు గాను గొల్లపూడి పంచాయతీకి అవార్డు దక్కింది.

Updated Date - Apr 21 , 2025 | 01:14 AM