President Droupadi Murmu: దేశం కోసం.. అందరం
ABN , Publish Date - Nov 23 , 2025 | 04:14 AM
దేశమే ప్రథమం అనే స్ఫూర్తికి ఆధ్యాత్మిక సంస్థలూ సహకరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ మన లక్ష్యం: రాష్ట్రపతి ముర్ము
ధార్మిక, స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలూ సహకరించాలి
దేశ నిర్మాణం మనందరి సామూహిక బాధ్యత
విశ్వశాంతికి సత్యసాయి బోధనల స్ఫూర్తి
‘పంచ సూత్రాలు’ మానవాళికి పాఠాలు
ఆధ్యాత్మికతను సేవవైపు మళ్లించిన మహనీయుడు
శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు
పుట్టపర్తి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తికి ఆధ్యాత్మిక సంస్థలూ సహకరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చాలన్న లక్ష్య సాధనకు అన్ని ధార్మిక, స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణం ప్రజలందరి సామూహిక బాధ్యత అని... దేశాభివృద్ధికోసం ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాన్ని వినియోగించాలని సూచించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శనివారం జరిగిన సత్యసాయి శతజయంతి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. అంతకు ముందు సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. శాంతికి చిహ్నంగా శ్రీసత్యసాయి యూనివర్సల్ జ్యోతిని వెలిగించారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సత్యసాయి సేవలను స్మరించుకున్నారు. సత్యసాయి బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ సూత్రాలే మానవాళికి పాఠ్యాంశాలని ఆయన ప్రవచించారని గుర్తు చేశారు. అవే జీవిత పరమార్థాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. సత్యసాయి బోధించిన మానవ విలువలు అన్ని సంస్కృతులకు, అన్ని కాలాలకు సరిపోతాయని అన్నారు. ‘‘మానవ సేవే మాధవ సేవ అన్న సత్యసాయి బోధనలు స్ఫూర్తిదాయకం. మన సాధువులు, రుషులు వారి చర్యలు, మాటల ద్వారా సమాజానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులలో సత్యసాయిబాబాది ప్రత్యేక స్థానం. ఆధ్యాత్మికతను ప్రజా సంక్షేమం వైపు మళ్లించిన మహనీయుడు. వందలాది కరువు పీడిత గ్రామాలకు తాగునీటిని అందించడం బాబా దార్శనికతకు నిదర్శనం’’ అని రాష్ట్రపతి కొనియాడారు.
విద్యకు విలువలు తోడైతేనే సార్థకత
విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యతగల ఉచిత విద్యను శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు అందిస్తోందని ముర్ము గుర్తు చేశారు. విలువలు పెంపొందించినప్పడే ఆ విద్యకు సార్థకత ఉంటుందన్న భావన సత్యసాయి విద్యావిధానంలో ఉందని అన్నారు. ‘‘క్యారెక్టర్ ఈజ్ బెస్ట్ క్వాలిటీ. విద్యతోపాటు స్వభావ నిర్మాణం అత్యంత ముఖ్యం. ఇది సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అందిస్తున్న నాణ్యమైన, నిష్కామ విద్య’’ అని ముర్ము పేర్కొన్నారు. 1969లో ప్రత్యేక మహిళా క్యాంపస్ ప్రారంభించడం బాబాకు నారీ శక్తిపై ఉన్న దూరదృష్టిని తెలియజేస్తోందని కొనియాడారు. లవ్ ఆల్.. సర్వ్ ఆల్ అనే సత్యసాయి సందేశం విశ్వవ్యాప్తం, శాశ్వతం అని అన్నారు. రెండేళ్లుగా తాను సత్యసాయి మహా సమాధి దర్శనానికి వస్తున్నానని, ప్రశాంతి నిలయానికి వస్తే మానసిక ప్రశాంత చేకూరుతోందని అన్నారు.