Car Theft Case: పేట ముఠాలో నలుగురు అరెస్టు
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:51 AM
పల్నాడు జిల్లాలో సంచలనం కలిగించిన నరసరావుపేట కార్ల చోరీ గ్యాంగులో నలుగురిని అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు తెలిపారు.
పరారీలో ఇద్దరు.. 20 కార్లు స్వాధీనం: ఎస్పీ
కేసు విచారణను నీరుగారుస్తున్న పోలీసులు!
నరసరావుపేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో సంచలనం కలిగించిన నరసరావుపేట కార్ల చోరీ గ్యాంగులో నలుగురిని అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు తెలిపారు. డీఎస్పీ హనుమంతరావు, సీఐ సుబ్బారావుతో కలసి ఆయన సోమవారం మీడియాకు ఈ ముఠా ఆగడాలను వివరించారు. మీడియా సమావేశం తరువాత పోలీసులు ఈ కేసు విచారణను నీరుగారుస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితుడు పుల్లంశెట్టి భానుప్రకాశ్(నరసింగపాడు)తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు చూపించిన పోలీసులు ముఠాలో ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని, మొత్తం 20 కార్లను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. తక్కువ ధరకు వస్తుండండంతో కొందరు పోలీసు అధికారులు కార్లు కొన్నమాట నిజమేనంటూ ఎస్పీ అంగీకరించారు. అయితే స్వాధీనం చేసుకున్న వాహనాలను ఎవరి నుంచి రికవరీ చేశారు? ఏఎ్‌సఐ శ్రీనివాసరావును ఎందుకు సస్పెండ్ చేశారు? నకిలీ నంబరు ప్లేట్లతో ఉన్న కార్లను కొనుగోలు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే లేదు. దీంతో పోలీసులు ఈ కేసు విచారణను మమ అనిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.