Public Complaints: వైసీపీ హయాంలో అక్రమ కేసులతో వేధించారు
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:02 AM
వైసీపీ పాలనలో అక్రమ కేసులతో వేధించారని, తమ భూములను కబ్జా చేశారని పలువురు బాధితులు మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు.
భూములు కబ్జా చేశారు.. లోకేశ్‌కు ఫిర్యాదులు
72వ రోజు ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ
మంగళగిరి/అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో అక్రమ కేసులతో వేధించారని, తమ భూములను కబ్జా చేశారని పలువురు బాధితులు మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 72వ రోజు ప్రజాదర్బార్‌ను ఆయన నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై తమ సమస్యలు విన్నవించారు. టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనపై అక్రమంగా హత్య కేసు బనాయించారని సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం శిరిగారిపల్లికి చెందిన కే రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయానని, ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వంశపారంపర్యంగా తమకు సంక్రమించిన 4.86 ఎకరాల వ్యవసాయ భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారని కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన కస్తూరి రామన్న ఫిర్యాదు చేశారు. విచారించి తమ భూమిని తిరిగి అప్పగించాలని విన్నవించారు. పలు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఒంగోలుకు చెందిన మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ రియల్టర్స్ సంస్థ బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా పెరవలికి చెందిన ఎం.రంగస్వామి కోరారు. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చిన లోకేశ్ సాయంత్రం 6 వరకు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలిచ్చారు.