Nara Lokesh: లీప్ తో మారనున్న పాఠశాలల రూపురేఖలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:47 AM
మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో లీప్ (LEAP) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు, ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్కూల్‌ను 50 రోజుల్లో అభివృద్ధి చేయాలని తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో మంగళగిరిలోనే మొదటి స్కూల్ అభివృద్ధి: మంత్రి లోకేశ్
కొనసాగిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
మంగళగిరి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): త్వరలో లీప్ (లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని, ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి స్కూల్‌ను మంగళగిరి నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయబోతున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. 50 రోజుల్లో పాఠశాల రూపురేఖలు మారిపోవాలని అధికారులకు సూచించానని పేర్కొన్నారు. మంగళగిరిలో శుక్రవారం కూడా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన 1,030 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేశ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో ప్రస్తుతం పేదలకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.వెయ్యి కోట్లు ఉంటుందన్నారు. తాము ఇస్తున్న పట్టాతో వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చని, రెండేళ్ల తర్వాత అమ్ముకునే హక్కు కూడా వస్తుందని తెలిపారు. సూపర్ సిక్స్‌లోని కొన్ని హామీలను మే నెలలో నిలబెట్టుకోబోతున్నామని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా చెప్పారు.