15 ఏళ్లు కూటమే విడాకులు ఉండవ్: లోకేశ్
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:15 AM
ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘గుజరాత్, ఒడిసాలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కాదు..
మిస్ ఫైర్‌లు.. క్రాస్ ఫైర్‌లూ ఉండవు
ఆంధ్రులు గర్వపడేలా అభివృద్ధి
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ.. ఇదే మా నినాదం
విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రవాసాంధ్రులు మా గుండెల్లో ఉంటారు
మీరు ఎన్‌ఆర్‌ఐలు కాదు.. ఎంఆర్‌ఐలు
అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడూ ఏపీవైపే
డాలస్ ప్రవాసాంధ్రుల భేటీలో లోకేశ్
చంద్రబాబు వయసు 75 ఏళ్లు.. ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారు. ఆయన స్పీడ్‌ను ఇంకా అందుకోలేకపోతున్నాను. ఏదో ఒకరోజు ఆయన వేగానికి దరిదాపుల్లోకి వస్తానని భావిస్తున్నా.
వైసీపీ వేధింపులను చూసి ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అప్పట్లో నా భార్య బ్రాహ్మణి నన్నడిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరంతా అండగా నిలిచారు. ఈ రోజు డల్లాస్ వేదికపై నిల్చొని మాట్లాడుతున్నానంటే అది ఆనాడు మీరు అండగా నిలవడం వల్లే.
- ప్రవాసాంధ్రులతో లోకేశ్
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘గుజరాత్, ఒడిసాలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కాదు.. పది కాదు.. పదిహేనేళ్లు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉండడం ఖాయం. ఆంధ్రులు గర్వపడే విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తాం. విడాకులు ఉండవు.. మిస్‌ఫైర్‌లు ఉండవు.. క్రాస్ ఫైర్‌లు ఉండవు’ అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం డాల్‌సలోని కర్టిస్ కల్ వెల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీహరిహర పీఠం వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు.
అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నాయని.. ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని తెలిపారు. ‘ఈరోజు స్పీడ్‌కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. అన్ని రంగాల్లో వేగంగా ముందుకెళ్తోంది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ.. ఇదే మా నినాదం.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మేం తిరగని దేశాలు లేవు. 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగాం. తద్వారా 16లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది’ అని వివరించారు. ఇంకా ఏమన్నారంటే..

బాబు ముందుచూపున్న నేత..
చంద్రబాబు ఐటీని పరిచయం చేశాక హైదరాబాద్ రూపుమారిపోయింది. ఈరోజు బెంగళూరుకు పోటీ ఇస్తోంది. గతంలో ఐటీ.. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ. చంద్రబాబు ముందుచూపు ఉన్న నాయకుడు. తెలుగుజాతికి అది అదృష్టం. ఏ దేశానికి వెళ్లినా.. ఏ కంపెనీకి వెళ్లినా సాదర స్వాగతం పలుకుతున్నారంటే కారణం చంద్రబాబు. కార్యకర్తలే టీడీపీ బలం. వారి త్యాగాలను గుర్తు పెట్టుకుంటాం. మెడపై కత్తిపెట్టినా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య.. స్థానిక ఎన్నికల్లో పుంగనూరులో మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. రక్తం కారుతున్నా చివరి ఓటు వేసే వరకు బూత్‌లో నిలబడిన మంజులారెడ్డికే లోకేశ్ అండ. జై తెలుగుదేశం అన్నందుకు విజయవాడలో గాంధీ కంటిచూపు పోగొట్టుకున్నారు. అధికార గర్వంతో వై నాట్ 175 అన్నారు. ప్రజలు వై నాట్ 11 అన్నారు. చివరకు ఆ పార్టీని భూస్థాపితం చేశారు.
స్వరాష్ట్రంపై మీకు ప్రేమ..
అందరూ మిమ్మల్ని ఎన్‌ఆర్‌ఐలు అంటారు. కానీ మీరు ఎంఆర్‌ఐలు.. మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడూ ఏపీ వైపే చూస్తుంది. మీ ఊరి వైపు ఉంటుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు పెద్దఎత్తున బయటకు వచ్చారు. సొంత రాష్ట్రంపై ప్రేమ ఉంది కాబట్టే.. ఎన్నికలకు 6నెలలు, ఏడాది ముందు వచ్చి ఏ పదవీ.. డబ్బు ఆశించకుండా మాకు అండగా నిలిచారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా 94 శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఈ రికార్డులు తిరగరాస్తాం.
రెడ్‌బుక్ తన పని తాను చేసుకుపోతుంది
రెడ్‌బుక్ తన పని తాను చేసుకుంటూపోతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్ష సాధింపులకూ పాల్పడడం లేదు. నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టను. మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. అయితే వారు అవమానించారని మనం అవమానించకూడదు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.
పేరుపేరునా ధన్యవాదాలు..
సమావేశానికి హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు లోకేశ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తాను అమెరికాలో నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశానని, రెండేళ్లు వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంకులో పనిచేశానని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేశానని.. సుమారు 9ఏళ్లు ఇక్కడ ఉన్నానని, కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి డాలస్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ ఈ కార్యక్రమం వరకు తనకు ఘనస్వాగతం పలకడం మరచిపోలేనని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే యువగళం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఈ సమావేశాన్ని చూసిన తర్వాత టీమ్ 11కి నిద్రపట్టదని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎస్ఏ కో-ఆర్డినేటర్ కోమటి జయరాం, టెక్సాస్‌లోని గార్లాండ్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది పరీక్షా సమయం..
అమెరికాలో ఉన్న అందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చదువుకుని మంచి ఉద్యోగాల కోసం ఇంత దూరం వచ్చారు. ఒక్కో కుటుంబానికి దేవుడు ఒక్కో పరీక్ష పెడతాడు. చిన్న ఎదురుదెబ్బ తగిలిందని బాధపడడం, ఆత్మహత్యలకు పాల్పడడం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. వారి గురించి కూడా ఆలోచించాలి. మీరు కేవలం జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ క్రియేటర్స్‌గా తయారుకావాలి. 2019లో నేను మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాను. కానీ అధైర్యపడలేదు. కసితో పనిచేసి 91 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాను. 1960 నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు అమెరికాకు వచ్చారు. అద్భుతంగా రాణించారు. మన గౌరవాన్ని పెంచారు. ఇప్పుడు ఆ బాధ్యత మన భుజాలపై ఉంది. ప్రతిపక్షంలో ఉండగా మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టమొచ్చినా ఏపీఎన్‌ఆర్‌టీ మీకు అండగా నిలుస్తుంది.