Nara Lokesh : విద్యా వ్యవస్థను నాశనం చేశారు
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:20 AM
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు.

విద్యార్థులకు 4వేల కోట్లకు పైగా బకాయిలు
ఇంటర్ పుస్తకంలో జగన్, లక్ష్మీపార్వతి సందేశాలు
విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెడతాం: లోకేశ్
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. దేశంలో ఏపీ మోడల్ విద్యా విధానాన్ని నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమన్నారు. విద్యా వ్యవస్థపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వంలో 12లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. జీవో 117 వల్ల ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,512కు చేరాయి. విద్యార్థుల డ్రాపౌట్ రేటు 12.5 శాతానికి పెరిగింది. 47వేల మంది బాలికలు విద్యకు దూరమయ్యారు. రాష్ట్రంలో పాఠశాల విద్య ఎంత దారుణంగా దిగజారిపోయిందో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, అసర్ నివేదికలు బహిర్గతం చేశాయి. పాఠశాలల్లో 45 రకాల యాప్‌లు పెట్టి గందరగోళం చేశారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారు. టాయిలెట్ల ఫొటోలు తీయించారు. నాడు-నేడు పనులను మధ్యలోనే వదిలేశారు. మొదటి దశ పనులు పూర్తి చేయడానికే ఇంకా రూ.880 కోట్లు కావాలి’ అని లోకేశ్ చెప్పారు. వైసీపీ హయాంలో బొమ్మల పిచ్చి ముదిరిపోయిందని చెబుతూ.. ‘విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, డిక్షనరీలు అన్నిటిపైనా జగన్ ఫొటోలు, పేర్లు రాసుకున్నారు. చివరికి పిల్లలకు ఇచ్చే గుడ్లపై వైఎ్‌సఆర్ పేరు రాశారు. చిక్కీలపై జగన్ ఫొటోలు వేసుకోవడం వారి బొమ్మల పిచ్చికి పరాకాష్ఠ. ఇంటర్మీడియట్ బోటనీ పుస్తకంలో జగన్, లక్ష్మీపార్వతి సందేశాలు పెట్టారు. మొత్తం ఎనిమిది పేజీలు సందేశాలకే కేటాయించారు. అవి తొలగిస్తే రూ.30లక్షలు మిగిలాయి. అందుకే ఈ ప్రభుత్వంలో రాజకీయ నేతల ఫొటోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. విద్యా కానుక, చిక్కీలు, గుడ్లలో రాబోయే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు మిగులుతాయి. పైగా గత ప్రభుత్వం పెట్టిన గుడ్లు, చిక్కీల బకాయిలు మేమే చెల్లించాం’ అని లోకేశ్ చెప్పారు.
సంస్కరణలు తీసుకొస్తున్నాం
‘జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. తరగతికి ఒక టీచర్‌ను ఇచ్చేలా మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం. కేజీ టూ పీజీ మొత్తం కరిక్యులమ్ మారుస్తాం. పిల్లల బ్యాగుల బరువు తగ్గించేందుకు సెమిష్టర్ల వారీగా పుస్తకాలు ముద్రిస్తున్నాం. ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నాం. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తాం.’ అని లోకేశ్ అన్నారు. పాఠశాలల్లో పెండింగ్ పనులను ఈ ఏప్రిల్‌లో ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నో బ్యాక్ డే ప్రవేశపెట్టిన మంత్రి లోకేశ్‌కు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు తెలిపారు. పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోళ్ల లలితకుమారి కోరారు. వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖకు ఏమీ చేయలేదని గౌతు శిరీషా ఆరోపించారు. పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పల్లె సింధూరరెడ్డి కోరారు.
అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మిస్తాం: సంధ్యారాణి
రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. అసెంబ్లీల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్, పల్లె సింధూరరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో 2014 -19 మధ్యలో 12,496 అంగన్‌వాడీ భవనాలను మంజూరు చేశామని, అందులో 6,161 భవనాలను పూర్తి చేశామని చెప్పారు.
త్రిభాషా విధానంపై రాజకీయం సరికాదు: లోకేశ్
త్రిభాషా విధానంపై రాజకీయం చేయడం సరికాదని మంత్రి లోకేశ్ అన్నారు. మాతృభాష పరిరక్షణపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేసిన సూచనలపై ఆయన స్పందించారు. ‘సరిహద్దు జిల్లాల్లో కన్నడ, ఒడియా, ఉర్దూ, తమిళం భాషలను నా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నేను దృష్టి పెట్టాలి. మాతృభాష అనేది చాలా కీలకం. అనవసరంగా పక్క రాష్ర్టాల్లో అపోహలు సృష్టిస్తున్నారు. కేంద్ర మంత్రిని కలిసినప్పుడు కూడా మాతృభాషను మర్చిపోవద్దని చాలా స్పష్టంగా చెప్పారు. త్రిభాషా విధానం తీసుకొచ్చారు. అందులో తప్పు లేదు. ఈరోజు పిల్లలు జర్మన్, జపనీస్ నేర్చుకోవాలనుకుంటున్న యుగంలో.. త్రిభాషా విధానంపై కావాలని రాజకీయం చేయడం సరికాద’న్నారు.
జగన్ దెబ్బకు అమర్‌రాజా వెళ్లిపోయింది
ప్రతి ఎమ్మెల్యే పెట్టుబడుల కోసం కృషి చేయాలి: లోకేశ్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దెబ్బకు రాష్ట్రానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్న అమర్‌రాజా బ్యాటరీస్ హైదరాబాద్‌కు తరలిపోవడం తనను చాలా బాధిస్తున్నదని మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారులను కష్టాలు పెట్టిందని, కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సతో ముందుకు వెళుతోందని చెప్పారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పరిశ్రమలు, ఐటీ రంగంలో పెట్టుబడులు రాబట్టేందుకు ఎమ్మెల్యేలంతా సహకరించాలని కోరారు. అసెంబ్లీ, మండలిలోని అధికార, ప్రతిపక్ష సభ్యులంతా పెట్టుబడులను ఆహ్వానించేందుకు కృషి చేయాలన్నారు. విశాఖపట్నం కేంద్రంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పారు. విశాఖలో ఏఐ ఆధారిత ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ వ్యాలీని విశాఖలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో పెట్టుబడులను రాబట్టేందుకు ప్రయత్నించాలన్నారు.
‘పిల్లల’ కోసం ఎమ్మెల్యేలతో కమిటీ
శారీరక, మేధో వైకల్యం ఉన్న పిల్లలకు ఎలాంటి విద్య అందించాలి అనే అంశం, భవిత సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేస్తామని లోకేశ్ తెలిపారు. సుందరపు విజయ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు ఉన్నాయని, 41,119 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలు వాటిలో రిజిష్టర్ అయ్యారని తెలిపారు. భవిత సెంటర్లలో ఆధునిక టెక్నాలజీని తీసుకురావాలని, స్పెషల్ పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడాలని విజయ్‌కుమార్ కోరారు.
అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం
పూర్వపు ఆంధ్రప్రదేశ్ ప్రాచీన పత్ర భాండాగారం రక్షణపై ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు లోకేశ్ బదులిస్తూ.. రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ఆర్కైవ్స్, ఓరియంటల్ లైబ్రరీ, జిల్లా గెజిట్స్‌కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సెంట్రల్ లైబ్రరీకి అమరావతిలో భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణను కోరగా, అంగీకరించారని చెప్పారు.