Share News

Nara Lokesh: ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:31 AM

ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్‌ అంబాసిడర్‌ ఉన్నారని, ఆ బ్రాండ్‌తోనే దేశంలోని అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్లు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు...

Nara Lokesh: ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే

  • పరిశ్రమలకు అగ్రతాంబూలం ఇస్తున్నాం

  • పెట్టుబడుల ఆకర్షణకు 99 పైసలకే భూమి

  • ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో ఇతర మార్కెట్లపై దృష్టి

  • త్రిభాషా విద్యా విధానానికే కట్టుబడి ఉంటాం

  • దేశాభివృద్ధికి అమరావతి లాంటి వంద నగరాల నిర్మాణం జరగాలి

  • కోవై ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేశ్‌

చెన్నై, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్‌ అంబాసిడర్‌ ఉన్నారని, ఆ బ్రాండ్‌తోనే దేశంలోని అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్లు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తమ రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉండడం వల్లే పెద్దఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. తమిళనాడులోని వాణిజ్య నగరం కోయంబత్తూరులో ‘అట్రాక్టింగ్‌ ఇన్వెస్ట్మెంట్ ఫర్‌ ద సన్‌రైజ్‌ స్టేట్‌’ అనే అంశంపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా సభకు సంధానకర్తగా వ్యవహరించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌.. యువనేతను పరిచయం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న లోకేశ్‌ రాజకీయ కుటుంబం నుంచే వచ్చినా.. స్వీయశక్తితో ఎదిగారంటూ ప్రశంసించారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో ప్రధానమైన ‘యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పన’ దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. టీసీఎస్‌ 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని.. ఆ సంస్థకు 99 పైసలకే భూమిని కేటాయిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను రప్పించడానికి తక్కువ ధరకు భూమి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వివరించారు.


ఆక్వాకు ప్రత్యామ్నాయ మార్కెట్‌

ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా మార్కెట్‌ను కాపాడుకునేందుకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇవ్వడమే కాకుండా రష్యా, చైనా, యూర్‌పలలో ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తామని లోకేశ్‌ చెప్పారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సవాలుగా తీసుకుంటామని చెప్పారు. స్టాన్‌పోర్డ్‌ చదువుతోపాటు యువగళం పాదయాత్ర సవాళ్లను ఎదుర్కొనే మార్గాలను నేర్పిందన్నారు. తీవ్రమైన నేరాలకు 30 రోజులపాటు జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రులు, మంత్రులను పదవీచ్యుతులను చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించనున్న చట్టసవరణ బిల్లు దుర్వినియోగం కాదనే తాము నమ్ముతున్నామన్నారు.


సీపీఆర్‌కే మా మద్దతు...: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కే టీడీపీ మద్దతు ఇస్తుందని లోకేశ్‌ స్పష్టం చేశారు. ‘‘మాది కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడుల ఆకర్షణలో ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడుతున్నాం. ఫార్చ్యూన్‌ 500 కంపెనీలతో పాటు ఇతర ప్రముఖ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. స్పేస్‌ సెక్టార్‌ అభివృద్ధికి ఇటీవల 200 ఎకరాల భూమిని కేటాయించాం. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థను కర్ణాటక తిరస్కరించాకే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.’’ అని అన్నారు. తమ ప్రభుత్వం త్రిభాషా విద్యా విధానానికే కట్టుబడి ఉంటుందని లోకేశ్‌ స్పష్టం చేశారు. కాగా, అమరావతి నిర్మాణానికి రైతుల అంగీకారంతోనే 35 వేల ఎకరాలు సమీకరించామని లోకేశ్‌ వెల్లడించారు. జనవరిలో అమరావతికి దేశంలోనే మొట్ట మొదటి 158 బిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ రాబోతోందని తెలిపారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా పాటుపడుతున్నామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. టీడీపీ చెన్నై అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను కలుసుకున్న లోకేశ్‌.. పార్టీ నేతలు, అభిమానుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


తప్పుచేస్తే ఎవరినీ క్షమించరు

‘భారత్‌ మల్టీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా ఆవిష్కృతమవుతున్న తరుణంలో పారదర్శకమైన రాజకీయాలు అవసరమని మేం బలంగా విశ్వసిస్తున్నాం. రాజకీయ నాయకులపై ఉన్న కేసులకు సంబంధించి ఏడాదిలోగా విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలిచ్చింది. దురదృష్టవశాత్తు అది అమలు కావడంలేదు. ఏపీలో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా జైలులో పెట్టాలని భావించడం లేదు. అదే సమయంలో తప్పుచేస్తే శిక్ష తప్పదు. ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మేం ప్రతీకార రాజకీయాలు చేయబోము. నేను తప్పు చేసినా చంద్రబాబు నన్ను జైలుకు పంపుతారు’ అని లోకేశ్‌ వెల్లడించారు.


ఏపీ ప్రయోజనాలే ముఖ్యం

తమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, వారిపట్ల తమకున్న నిబద్ధత వల్లే నాలుగు దశాబ్దాలపాటు వారి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకోగలిగామని లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే భిన్నమైందని, తరాలు మారినా తామంతా కలిసికట్టుగానే ముందుకు సాగుతామని చెప్పారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో 50 శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలేనని, 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారని తెలిపారు. అంకితభావం కలిగిన కొత్త తరాన్ని తాము రాజకీయాల్లోకి తెస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Sep 09 , 2025 | 05:34 AM