Share News

Nara Lokesh: ఇక ఏటా డీఎస్సీ..

ABN , Publish Date - Jun 07 , 2025 | 02:35 AM

డీఎస్సీ పరీక్షలను ఇకపై ఏటా నిర్వహిస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లలో ‘ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌’ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Nara Lokesh: ఇక ఏటా డీఎస్సీ..
Minister Nara Lokesh

  • టీచర్‌ పోస్టుల భర్తీతో విద్యా ప్రమాణాలు మెరుగు

  • నూరుశాతం అక్షరాస్యతకు ‘అక్షర ఆంధ్ర’ ప్రాజెక్టు

  • నాలుగేళ్లలో ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ సాధనే లక్ష్యం

  • వర్సిటీలకు ఏకీకృత చట్టం: మంత్రి లోకేశ్‌ ఆదేశం

  • యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం: లోకేశ్‌

అమరావతి/మంగళగిరి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ పరీక్షలను ఇకపై ఏటా నిర్వహిస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లలో ‘ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌’ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యాశాఖపై శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ చేపట్టామని చెప్పారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు కూడా ప్రారంభించామని, 27 వేల మంది స్కూల్‌ అసిస్టెంట్లను బదిలీల చట్టంతో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా బదిలీ చేశామని తెలిపారు. 4వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని గుర్తుచేశారు. నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ‘అక్షర ఆంధ్ర’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 15-59 ఏళ్లవారిలో 81లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. వయోజన విద్యలో దేశంలో ఏపీ అట్టడుగున ఉందని, దీన్ని మిషన్‌ మోడ్‌లో చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది 3.95 లక్షల మందికి అక్ష్యరాస్యత పరీక్షలు నిర్వహించగా, 3.53 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.

వయోజన విద్య విభాగంలో 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకొని భర్తీ చేయాలని మంత్రి సూచించారు. రాబోయే మూడేళ్లలో అక్షరాస్యతలో టాప్‌-3లో ఏపీ ఉండాలని స్పష్టం చేశారు. అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని, ‘నైపుణ్యం’ యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్‌లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్థ్య పరీక్షలు, సర్టిఫికేషన్‌, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలతో అనుసంధానం తదితర వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సెక్టార్ల వారీగా ఉద్యోగాలు, జాబ్‌మేళాలు కూడా అప్‌డేట్‌ చేయాలని పేర్కొన్నారు. రాష్ర్టానికి మంజూరైన 125 ఆటిజం కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించడంతో పాటు వాటిలో నిపుణులను నియమించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్సిటీలకు ఏకీకృత చట్టం తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐఎ్‌సబీ, ట్రిపుల్‌ ఐటీ, ఇఫ్లూ, సౌత్‌ ఏషియన్‌ యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌-రీసెర్చ్‌ ఏర్పాటుపై చర్చించారు.


స్టెమ్‌ ల్యాబ్‌ కిట్ల పరిశీలన..

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను లోకేశ్‌ పరిశీలించారు. రాష్ట్రంలో 222 పీఎంశ్రీ పాఠశాలలకు స్టెమ్‌ ల్యాబ్‌ కిట్లు ఇవ్వనున్నారు. ఒక్కో కిట్‌లో 335 వస్తువులు ఉంటాయి. రీసెర్చ్‌, కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌గా రూపొందించిన ఈ వస్తువులు విద్యార్థులకు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం అంశాల్లో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి దోహదపడనున్నాయి. వీటితోపాటు స్కూళ్లకు అందించే లైబ్రరీ పుస్తకాలు, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి రూపొందించిన జాదు పిటారా కిట్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రింట్‌ రిచ్‌ మెటీరియల్స్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ హ్యాండ్‌ మేడ్‌ మెటీరియల్స్‌ను కూడా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా రామవరప్పాడు ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎం.మస్తాన్‌రావు, విజయవాడ పటమట ఎంపీయూపీ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఓ.నిహారిక గీసిన డ్రాయింగ్స్‌ను లోకేశ్‌కు అధికారులు బహూకరించారు.

విద్యార్థులకు ‘షైనింగ్‌ స్టార్‌’..

పదో తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘షైనింగ్‌ స్టార్‌’ అవార్డుతో సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రస్థాయి టాపర్లను ఇప్పటికే మంత్రి లోకేశ్‌ సన్మానించగా జిల్లా, మండల స్థాయిల్లోనూ ఈ అవార్డులు ఇవ్వనున్నారు. దీనిపైపాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతిలో కనీసం 500 (83.33%) మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. ప్రతి మండలంలో ఓసీ, బీసీల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్లో జిల్లా యూనిట్‌గా 70శాతం మార్కులు దాటిన ముగ్గురికి ఈ అవార్డులు ఇస్తారు. పదో తరగతిలో ప్రభుత్వ పరీక్షల విభాగం, ఇంటర్‌లో ఇంటర్‌ బోర్డు టాపర్లను ఎంపిక చేస్తాయి. ఒక్కో విద్యార్థికి రూ.20వేలు నగదు, సర్టిఫికెట్‌, మెడల్‌ అందజేస్తారు. ఈ నెల 9న 26 జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రుల ఆధ్వర్యంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పదో తరగతిలో 4,169 మంది, ఇంటర్‌లో 919 మందికి అవార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

Updated Date - Jun 07 , 2025 | 08:01 AM