Golden Peacock Award: ఇది సేవకు దక్కిన గుర్తింపు
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:39 AM
ఎన్టీఆర్ ట్రస్టు తరఫున సంజీవని ఉచిత హెల్త్ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఎన్నో కార్యక్రమాలు: భువనేశ్వరి
సంజీవని ఉచిత హెల్త్ క్లినిక్స్, మొబైల్ ఆరోగ్య శిబిరాలు
మహిళా సాధికారతకు కృషిచేస్తున్నాం
ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వెల్లడి
లండన్‌లో ఐవోడీ సంస్థ నుంచి డిస్టింగ్వ్‌ష్డ్ ఫెలోషిప్ అవార్డు స్వీకరణ
గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా..
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ ట్రస్టు తరఫున సంజీవని ఉచిత హెల్త్ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మంగళవారం అర్ధరాత్రి లండన్‌లో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ నుంచి డిస్టింగ్వ్‌ష్డ్ ఫెలోషిప్ అవార్డు, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో ఆ సంస్థకు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో ప్రకటించిన గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్న తర్వాత ఆమె ప్రసంగించారు. తనకు వచ్చిన అవార్డు.. సేవకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. మహిళా సాధికారిత కోసం పనిచేస్తున్నామని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు వారి సామర్థ్యాలు పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలుస్తున్నామని, వారి జీవితం సాధారణ స్థితికి చేరుకునే వరకు చేయూతనిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నామన్నారు. ‘ప్రజల జీవన విధానంలో మార్పుచేర్పులకు సంబంధించిన అంశాల్లోనూ సలహాలు అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేస్తున్నాం. అందరికీ సమాన అవకాశాలు లభించాలన్న ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్నాం’ అని వివరించారు.
భువనేశ్వరికి గవర్నర్, లోకేశ్ అభినందనలు
భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్వ్‌ష్డ్ ఫెలోషిప్ అవార్డు పొందడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తనతల్లి భువనేశ్వరి ప్రపంచవేదికపై అవార్డులతో సత్కారం పొందడం తనకెంతో గర్వకారణమని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘అమ్మా.. నీవు మన కుటుంబానికి స్ఫూర్తిదాయకంగా నిలిచావు. ఎన్టీఆర్ ట్రస్టు, హెరిటేజ్ ఫుడ్స్‌కు మంచి నాయకత్వం, సుపరిపాలన అందించడం ద్వారా వాటి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. అదే ఇప్పుడు మీకు ప్రపంచవేదికపై గౌరవాన్ని తెచ్చిపెట్టింది’ అన్నారు.