Farmer Education: రసాయన ఎరువులకు నానో తోడు
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:52 AM
రాష్ట్రంలో యూరియాకు అధిక డిమాండ్ ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నానో యూరియా వాడటం మంచిదని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పోషకాలు ఎక్కువ.. పర్యావరణానికి మేలు
రసాయన ఎరువులతో నష్టాలే ఎక్కువ
అధిక వాడకంతో మరిన్ని అనర్థాలు
నానో యూరియాలో 80-90శాతం పోషకాలు
రసాయన యూరియాలో 30-40 శాతమే
రసాయన యూరియా 75శాతం, నానో 25శాతం వాడుకోవడం మేలు
పంట ప్రాథమిక దశలో నానో వద్దు
ఆఖరి దశలో వాడితే ప్రయోజనం
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో యూరియాకు అధిక డిమాండ్ ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నానో యూరియా వాడటం మంచిదని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పంటల ప్రాథమిక దశలో 75 శాతం వరకూ రసాయన యూరియా వాడుకోవచ్చని, చివరి దశలో 25 శాతం వరకూ నానో యూరియా వాడుకోవాలని సలహా ఇస్తున్నారు. కాగా, పంటలకు రసాయన ఎరువులు వేస్తేనే దిగుబడులు వస్తాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. అందుకే రసాయన యూరియానే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పంట ఆరోగ్యం, నాణ్యమైన ఉత్పత్తికి పచ్చిరొట్ట, సేంద్రియ, జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయో నానో యూరియా కూడా అంతేనని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంటలకు పోషకాలు అందించడంలో రసాయన ఎరువులకు ధీటుగా నానో ఎరువులు పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అందుకే నానో సాంకేతికతతో తయారైన ద్రవ రూప యూరియా, డీఏపీని ప్రోత్సహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో నానో ఉత్పత్తులపై అంతగా ప్రచారం లేదు. వాటిని తమకు బలవంతంగా అంటగడుతున్నారని ఇటు డీలర్లు, అటు రైతులు వాపోతున్నారు.
రసాయన యూరియాతో నష్టాలు
సంప్రదాయ యూరియా వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పోషకాల సమతుల్యతకు, నీటి కాలుష్యానికి దారి తీస్తుంది. యూరియా నత్రజని వాయువుగా మారి వాతావరణంలోకి విడుదలై పర్యావరణానికి హాని చేస్తుందని చెప్తున్నారు. రసాయన యూరియా అధిక వాడకం వల్ల పొటాష్, పాస్పరస్ లభ్యతను తగ్గిస్తుంది. చిన్న మొక్కల ఎదుగుదలకు హాని చేస్తుంది. నత్రజనిని వేగంగా విడుదల చేసే సంప్రదాయ యూరియా కంటే.. నానో యూరియా బెటర్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నానోతో ప్రయోజనం
నానో యూరియా మొక్కలకు పోషకాలు సమర్థంగా అందిస్తుంది. అధిక దిగుబడికి దారి తీస్తుంది. పంటల్లో పోషక లోపాలను సరి చేస్తుంది. మెరుగైన ఆహార నాణ్యతకు దోహదం చేస్తుంది. రసాయన ఎరువుల వినియోగ అవసరాన్ని తగ్గిస్తుంది. తక్కువ కార్బన్ విడుదలతో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. అధిక రసాయన ఎరువుల వల్ల దెబ్బతినే నేల, గాలి, నీటి కాలుష్యాన్నీ తగ్గిస్తుందని చెబుతున్నారు. పంట పోషకాల సామర్ధ్యాన్ని పెంచి, మొక్కల ఎదుగుదలకు దోహదపడుతుంది. మట్టిపై రసాయన భారాన్ని తగ్గించి, వృధా కాకుండా ఉంటుంది. నానో ఎరువులు నిల్వ చేసుకోవడం, రవాణా చేయడం చాలా సులభం. నీరు, మట్టిలో కలుషితాన్ని తగ్గించి, పంట దిగుబడుల్లో మెరుగుదల కల్పిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. బస్తా యూరియా సబ్సిడీ పోను గరిష్ఠ చిల్లర ధర రూ.266.50. అర లీటర్ నానో యూరియా ధర రూ.225. ఇది 45కిలోల యూరియా బస్తాకు సమానం. 2-4 మిల్లీమీటర్ల నానో యూరియాను లీటర్ నీటిలో కలిపి ఎకరానికి రెండుసార్లు పిచికారి చేయొచ్చు. రసాయన యూరియాలో 30-40ు పోషకాలు ఉంటే నానో యూరియాలో 80-90ు ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
20-25శాతం నానో యూరియా వేయొచ్చు
పీవీ సత్యనారాయణ, రీసెర్చ్ డైరెక్టర్, రంగా అగ్రి వర్సిటీ
ప్రస్తుతం రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి వంటి పంటల్లో సిఫారసుకు మించి నత్రజని ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల చీడపీడలు పెరగడం, సాగు ఖర్చు పెరుగుతోంది. విచక్షణారహితంగా యూరియా వంటి రసాయన ఎరువు లు వాడకం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. నానో ఎరువులు కొద్ది మేర పని చేస్తున్నందున రైతులు 20-25 శాతం రసాయన ఎరువులు తగ్గించి, ఆమేరకు నానో యూరియా వాడితే మంచిది. రసాయన యూరియా 75ు, నానో యూరియా 25ు వేయొచ్చని రైతులకు సిఫారసు చేస్తున్నాం. పంట ప్రాథమిక దశలో కాకుండా.. ఆఖరి దశలో నానో యూరియా వాడితే కొంత ఫలితం ఉంటుంది.
అందుబాటులో నానో యూరియా
డిల్లీరావు, డైరెక్టర్, వ్యవసాయ శాఖ
సారవంతమైన నేలను కాపాడుకోడానికి నానో ఎరువుల వాడకం మంచిది. నానోలో పోషక విలువ సామర్ధ్యం ఎక్కువ. నేలకు, పంటకు మేలు చేస్తాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు నానో దోహదపడుతుంది. నానో సాంకేతికపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులను సూచించాం. నానోపై రైతుల్లో చైతన్యం రావాలి. గతేడాది రాష్ట్రంలో 3.5 లక్షల నానో యూనిట్లు వ్యవసాయానికి వినియోగించగా, ఈ ఏడాది 21 లక్షల నానో బాటిల్ యూనిట్ల వాడకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో నానో యూరియా 83వేల లీటర్లు అందుబాటులో ఉంది.