Share News

INSWARB Director N. Kalidasu: నానో కాంక్రీట్‌తో అణు రియాక్టర్ల నిర్మాణం

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:14 AM

అణు రియాక్టర్ల నిర్మాణాలలో ఏర్పడే పగుళ్లను నానో కాంక్రీట్‌తో తగ్గించవచ్చని, దీనికి ఫ్లైయాష్‌ ఉపయోగపడుతుందని ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సాలిడ్‌ వేస్ట్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎకలాజికల్‌ బ్యాలెన్స్‌...

INSWARB Director N. Kalidasu: నానో కాంక్రీట్‌తో అణు రియాక్టర్ల నిర్మాణం

  • రేడియేషన్‌ను నిరోధించేందుకు అవకాశం

  • బార్క్‌తో కలిసి పరిశోధనలకు అంగీకారం

  • ‘ఇన్‌స్వారెబ్‌’ డైరెక్టర్‌ ఎన్‌.కాళిదాసు

విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అణు రియాక్టర్ల నిర్మాణాలలో ఏర్పడే పగుళ్లను నానో కాంక్రీట్‌తో తగ్గించవచ్చని, దీనికి ఫ్లైయాష్‌ ఉపయోగపడుతుందని ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సాలిడ్‌ వేస్ట్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎకలాజికల్‌ బ్యాలెన్స్‌ (ఇన్‌స్వారెబ్‌) వ్యవస్థాపక డైరెక్టర్‌ ఎన్‌.కాళిదాసు వెల్లడించారు. విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో... ఈ పరిశోధనలు నిర్వహించిన తన భార్య భానుమతితో కలిసి ఆయన మాట్లాడారు. రియాక్టర్‌ ప్లాంట్ల నిర్మాణంలో పిక్క, ఇసుకతో కూడిన సిమెంట్‌ కాంక్రీట్‌ను ఉపయోగిస్తున్నారని, రేడియేషన్‌ వల్ల కాంక్రీట్‌లో క్రిస్టలైన్‌ అనే పదార్థం ఎమార్ఫస్‌గా మారి దాని పరిమాణం పెరుగుతుందని, అందుకే పగుళ్లు వస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధనల్లో వెల్లడైందన్నారు. 35 ఏళ్లుగా పవర్‌ ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లైయాష్‌పై పరిశోధనలు చేస్తున్న భానుమతి.. ఎమార్ఫస్‌తో కూడిన ఫ్లైయాష్‌ను సిమెంట్‌తో కలిపితే కాంక్రీట్‌ బలం, మన్నిక పెరుగుతాయని గుర్తించారన్నారు. దేశంలో విస్తృతంగా అణు రియాక్టర్ల తయారీకి అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలను కేంద్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు తెలియజేయగా, బాబా అణుశక్తి పరిశోధన సంస్థ (బార్క్‌)తో కలిసి పనిచేయాలని వారు సూచించారని చెప్పారు. దీనిపై బార్క్‌తో కలిసి పరిశోధనలు చేయడానికి ప్రతిపాదించామన్నారు. ఇప్పటివరకూ రియాక్టర్లలో షీల్ట్‌ వాల్‌ను కాంక్రీట్‌తో నిర్మిస్తున్నారని, దానికి బదులుగా నానో కాంక్రీట్‌ టెక్నాలజీని వినియోగిస్తే రేడియేషన్‌ను నిరోధించవచ్చని భానుమతి పరిశోధనల్లో నిర్ధారణ అయిందని కాళిదాసు చెప్పారు.

Updated Date - Dec 16 , 2025 | 03:14 AM