నానీలూ.. ఖబడ్దార్!
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:51 AM
‘‘నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఒళ్లు జాగ్రత్త.. మీరు నరుకుతామంటే మేము గాజులు తొడుక్కోలేదు.. రప్పా.. రప్పా అని ఎవరిని నరుకుతారు? కన్ను కొడితే చీకట్లో ఎవరిని నరుకుతారు?.. మీ దగ్గరికే వస్తున్నాం .. ఎవరిని నరుకుతారో నరకండి.. బస్తీమే సవాల్.. నానీలూ.. ఖబడ్దార్’’ అంటూ గుడివాడ టీడీపీ శ్రేణులు వైసీపీ ఉన్మాదపు నాయకులపై తిరుగుబాటు చేశారు. గత కొద్ది రోజులుగా టీడీపీ వాళ్లను చంపెయ్యండంటూ కార్యకర్తలను రెచ్చగొడుతున్న మాజీ మంత్రి పేర్ని నానికి దేహశుద్ధి చేయాలని నిర్ణయించారు. విషయం పసిగట్టిన కొడాలి నాని సమావేశానికి డుమ్మా కొట్టారు. పేర్ని నాని మచిలీపట్నం నుంచి నేనొస్తున్నానంటూ.. రెచ్చిపోగా, పోలీసులు ముందస్తుగా ఆయనను గృహ నిర్బంధం చేయటంతో టీడీపీ శ్రేణుల ఆగ్రహాన్ని తప్పించుకున్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టిన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల పేర్నిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
- గుడివాడలో పెల్లుబికిన టీడీపీ శ్రేణుల ఆగ్రహం
- నరుకుడు వ్యాఖ్యలు చేసిన పేర్ని నానికి దేహశుద్ధి చేయాలని నిర్ణయం
- సమావేశానికి వస్తున్నట్టు తెలిసి కే కన్వన్షన్ దగ్గర చుట్టుముట్టిన టీడీపీ శ్రేణులు
- సమావేశానికి డుమ్మా కొట్టి టీడీపీ శ్రేణుల ఆగ్రహాన్ని తప్పించుకున్న కొడాలి నాని
- నేనొస్తున్నా అంటూ బందరులో పేర్ని నాని రెచ్చిపోగా.. పోలీసుల గృహనిర్బంధం
- మచిలీపట్నం, అవనిగడ్డలో పేర్నిపై పోలీసులకు ఫిర్యాదు
‘‘నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఒళ్లు జాగ్రత్త.. మీరు నరుకుతామంటే మేము గాజులు తొడుక్కోలేదు.. రప్పా.. రప్పా అని ఎవరిని నరుకుతారు? కన్ను కొడితే చీకట్లో ఎవరిని నరుకుతారు?.. మీ దగ్గరికే వస్తున్నాం .. ఎవరిని నరుకుతారో నరకండి.. బస్తీమే సవాల్.. నానీలూ.. ఖబడ్దార్’’ అంటూ గుడివాడ టీడీపీ శ్రేణులు వైసీపీ ఉన్మాదపు నాయకులపై తిరుగుబాటు చేశారు. గత కొద్ది రోజులుగా టీడీపీ వాళ్లను చంపెయ్యండంటూ కార్యకర్తలను రెచ్చగొడుతున్న మాజీ మంత్రి పేర్ని నానికి దేహశుద్ధి చేయాలని నిర్ణయించారు. విషయం పసిగట్టిన కొడాలి నాని సమావేశానికి డుమ్మా కొట్టారు. పేర్ని నాని మచిలీపట్నం నుంచి నేనొస్తున్నానంటూ.. రెచ్చిపోగా, పోలీసులు ముందస్తుగా ఆయనను గృహ నిర్బంధం చేయటంతో టీడీపీ శ్రేణుల ఆగ్రహాన్ని తప్పించుకున్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టిన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల పేర్నిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గుడివాడ/మచిలీపట్నం):
గుడివాడలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం నిర్వహించారు. పేర్ని నాని ఉన్మాదపు వ్యాఖ్యలు పత్రికల్లో ప్రచురితం కావటంతో కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా పలు నియోజకవర్గాల్లో ఉన్మాదులను రెచ్చగొడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న గుడివాడ నియోజకవర్గంలో కూడా సమావేశం పెడుతున్నారని, ఇక్కడికి వచ్చే నానీలను అడ్డుకుని తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే వెనిగండ్లపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు పేర్ని నానిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. దీంతో వెనిగండ్ల రాము వైసీపీ నేతల సమావేశాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు. దీంతో కార్యకర్తలంతా రెట్టించిన ఉత్సాహంతో మధ్యాహ్నం నుంచే కే కన్వెన్షన్ ప్రాంతాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. వైసీపీ ఫ్లెక్సీలను చించివేశారు. ఇద్దరి కార్యక్రమాలు ఒకే చోట ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ శ్రేణులు, వైసీపీ సమావేశం వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బ్యారికేడ్లు పెట్టడంతో టీడీపీ శ్రేణులు, పోలీసుల నడుమ మాటల యుద్ధమే జరిగింది. సాయంత్రం వరకు టీడీపీ శ్రేణులు అక్కడి నుంచి కదలలేదు.
పేర్ని నాని వచ్చాడని కారుపై దాడి..
ఈలోపు కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక తన అధికారిక కారులో వైసీపీ సమావేశానికి వచ్చారు. దీంతో పేర్ని నాని వచ్చారేమోనని భావించిన టీడీపీ కార్యకర్తలు కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత కారులో హారిక ఉందని తెలుసుకుని వదిలేశారు. హారిక భర్త, వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము టీడీపీ కార్యకర్తలకు వేలు చూపిస్తూ మీ సంగతి చూస్తానంటూ హెచ్చరించటంతో .. టీడీపీ నాయకులు రాముపైకి దూసుకెళ్లారు. ఈ దశలో పోలీసులు అడ్డుకోవటంతో గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు సర్దిచెప్పి ఆమెను పంపించేసినా.. వెళ్లినట్టే వెళ్లి ఆమె మళ్లీ వచ్చారు. దీంతో మరింతగా ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. అగ్రనాయకులు ఎవరూ సమావేశానికి రాకపోవటంతో నిరాశ చెందిన నియోజకవర్గ నాయకులే బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. బయట టీడీపీ శ్రేణులు ముట్టడించాయని, తమ నాయకులకు బుద్ధి చెప్పటానికి వచ్చారన్న కసితో .. నాయకులదొక దారి అయితే తమదొక దారి అంటూ రెచ్చిపోయి ప్రసంగాలు చేశారు.
సమావేశానికి నాయకులంతా డుమ్మా!
స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కోర్టు ఉత్తర్వుల మేరకు సంతకాలు చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని అటు నుంచి అటే వెళ్లిపోయారు. సమావేశం జరిగే వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం. స్థానికంగానే ఉన్న ఆయన సమావేశానికి రాకపోవడం పట్ల వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశాయి. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు జిల్లా ముఖ్య నాయకులెవ్వరూ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురున్నాథం ఒక్కరే సమావేశానికి హాజరు కావడం విశేషం. కొందరు నాయకుల ప్రసంగాలు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా సాగాయి. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో గుడివాడలో భారీ బందోబస్తుగా ఏర్పాటు చేశారు.
వివాదాస్పదంగా మారిన కొడాలి నాని ఫ్లెక్సీ
స్థానిక నెహ్రూచౌక్ సెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. గత ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి చంద్రబాబు బూట్‌లను పాలిష్ చేస్తానని చేసిన వాగ్దానాన్ని కొడాలి నాని నేరవేర్చాలంటూ టీడీపీ నాయకులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పట్టణంలో పలుచోట్ల మాజీ మంత్రి నానిని ట్రోల్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి.
గుడివాడ సమావేశంలోనూ అదే ఉన్మాదం
- కొడాలి నాని బూట్లు నాకిస్తామంటూ హెచ్చరికలు
వైసీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కొందరు నాయకులు అదే ఉన్మాదం ప్రదర్శించారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. లింగవరంలోని కె-కన్వెన్షన్‌లో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ మాట్లాడుతూ నెహ్రూచౌక్ సెంటర్‌లో ఫ్ల్లెక్సీ పెట్టిన వ్యక్తి గతంలో నాని వెంట ఉన్నాడని, తర్వాత మాజీ ఎమ్మెల్యే రావి, నేడు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెంట తిరుగుతున్నాడని, వైసీపీ అధికారంలోకి రాగానే సదరు వ్యక్తితో మాజీ మంత్రి కొడాలి నాని బూట్లను నాకిస్తానని హెచ్చరించారు.
పేర్ని నానిపై పోలీసులకు ఫిర్యాదులు
మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నాయకులు శనివారం మచిలీపట్నంలోని రాబర్ట్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే వైసీపీ సమావేశాల్లో పాల్గొంటున్న పేర్ని నాని వైపీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా, హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని తెలిపారు. దీంతో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, విచారణ చేసి చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ‘‘రప్పా..రప్పా అంటూ వ్యాఖ్యలు చేయడంకాదని, చెప్పకుండా నరికేయాలని, చీకట్లో కన్నుకొడితే పని అయిపోయేలా ఉండాలని’’ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పేర్ని నాని వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. పేర్ని నాని వ్యాఖ్యలు తెలుగుదేశం, జనసేన నాయకులు, సానుభూతిపరులపై దాడులు చేయాలనే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షుడు లొగిశెట్టి వెంకటస్వామి, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, కుంచేనాని తదితరులు ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు. మాజీ మంత్రి పేర్నినాని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం తాలూకా పోలీస్‌స్టేషన్‌లోనూ టీడీపీ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పేర్నినానిపై ఫిర్యాదు చేశారు.