నమో.. అమరావతి!
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:51 AM
రాజధాని అమరావతిలో మే 2న జరిగే రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన సభ ఏర్పాట్లు 111 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చురుగ్గా సాగుతున్నాయి. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో నైరుతి దిక్కున ప్రధాని నరేంద్ర మోదీ రాక కోసం సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. ఇది 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
- మే 2న రాజధానిలో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన
- హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
- 111 ఎకరాల్లో చురుగ్గా సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లు
- 28 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం
- వీఐపీలకు నలువైపులా 83 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్‌లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రాజధాని అమరావతిలో మే 2న జరిగే రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన సభ ఏర్పాట్లు 111 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చురుగ్గా సాగుతున్నాయి. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో నైరుతి దిక్కున ప్రధాని నరేంద్ర మోదీ రాక కోసం సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. ఇది 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ప్రధాన వేదిక, సాంస్కృతిక వేదిక, గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. ఈ సభా ప్రాంగణానికి తూర్పు, పడమర, ఉత్తర దిక్కులలో పార్కింగ్ కోసం భూములను కేటాయించారు. మొత్తం తొమ్మిది పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం తూర్పు వైపు అంటే సచివాలయానికి దక్షిణ వైపు వస్తుంది. ఈ ప్రాంతంలో బస్సుల పార్కింగ్ కోసం 15 ఎకరాలను కేటాయించారు. దీని పక్కనే కార్ల కోసం 27 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు పార్కింగ్ స్థలాలకు మధ్యన రోడ్డు ఉంటుంది. సభా ప్రాంగణానికి పడమర దిక్కున వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం 10 ఎకరాలను కేటాయించారు. సభా ప్రాంగణానికి అభిముఖంగా అంటే ఉత్తర దిక్కున సచివాలయానికి నైరుతి, పశ్చిమ దిశలలో 32 ఎకరాలలో వీఐపీల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం తొమ్మిది పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేస్తుండగా.. 6, 7, 8, 9 పార్కింగ్ ప్లేస్‌లన్నీ కూడా సభా ప్రాంగణానికి సమీపంలో ఉంటాయి. మిగిలిన 1 నుంచి 5 పార్కింగ్ ప్లేస్‌లన్నీ కూడా సాధారణ జనాలకు కేటాయించారు. ఇవి సభా ప్రాంగణానికి దూరంగా ఉంటాయి. వీటిని ఇంకా ఖరారు చేయలేదు. సాధారణ ప్రజలంతా నడుచుకుంటూ సభా ప్రాంగణానికి రావాల్సి ఉంటుంది. మునిసిపల్ మంత్రి నారాయణ చెబుతున్న దాని ప్రకారం ఐదు లక్షల మంది వరకు సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. పార్కింగ్ బయటే ఇచ్చే అవకాశం ఉంది.
సభా ప్రాంగణానికి దగ్గరగా హెలీప్యాడ్
ప్రఽధానమంత్రి మోదీ దిగటానికి వీలుగా సచివాలయం వాయువ్య దిక్కున హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మూడు హెలీప్యాడ్లను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ప్రధాన మంత్రి, ఆయన భద్రతా సిబ్బంది, ఇతర ప్రముఖులు హెలీప్యాడ్‌లలోనే దిగనున్నారు.
హెలీప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డు షో
ప్రధాని మోదీ దిగే హెలీప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు మాత్రమే రోడ్డు షో నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రోడ్డు షోలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే పాల్గొంటారు.
జెట్ స్పీడ్‌తో సభా ప్రాంగణ పనులు
అమరావతిలో జెట్ స్పీడ్‌తో సభా ప్రాంగణంలో పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా మూడు వేదికల పనులు శరవేగంగా చేస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే మూడు గ్యాలరీల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఒక గ్యాలరీకి సంబంధించి పైకప్పు వేశారు. రెండింటికీ పైకప్పు పనులు మిగిలి ఉన్నాయి. వర్షం వచ్చిన తడవకుండా ఉండేలా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఏడీసీఎల్ అధికారులు అమరావతి ప్రాంతంలో వీఐపీలు రాకపోకలు సాగించే రోడ్లన్నింటినీ బాగు చేస్తున్నారు. కొత్తగా బీటీ లేయర్లు వేస్తున్నారు. రోడ్డు పక్కన మొక్కలు నాటుతున్నారు.