Water Resources Dept: నల్లమలసాగర్‌పై ముందడుగు
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:42 AM
పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకంపై మరో ముందడుగు పడింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు ఆసక్తిగల సంస్థలను...
డీపీఆర్ తయారీకి టెండర్ల ఆహ్వానం
11లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశం
జనవరి నెలాఖరుకల్లా టెండర్లు ఖరారు
మార్చి నెలాఖరులోపు టీఏసీ ఆమోదం
ఏప్రిల్ చివరిలోగా కేంద్ర జలశక్తి,అటవీ పర్యావరణ శాఖల అనుమతి
లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం
3 దశల్లో 58,700 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం
ఇబ్రహీంపట్నం వద్ద అక్విడెక్టు ద్వారా కాకుండా
బుడమేరు కాలువ గుండా కృష్ణాలోకి ఎత్తిపోత!
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకంపై మరో ముందడుగు పడింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తూ సోమవారం గుంటూరు జల వనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ టెండర్లు పిలిచారు. ఇందులో డీపీఆర్ తయారీకి రూ.9.10 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ధరావతు కింద రూ.7,68,334 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీలోపు బిడ్లు సమర్పించాలి. పోలవరం-బనకచర్ల అనుసంధానం స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన ప్రక్రియను రూ.58,700 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి బిడ్లను ఖరారు చేస్తారు. తయారుచేసిన డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం పరిశీలన, ఆమోదానికి పంపి.. మార్చి నెలాఖరులోగా దాని పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం పొందాలని.. ఏప్రిల్ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి, అటవీ పర్యావరణ శాఖల ఆమోదం కూడా తీసుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పోలవరం కుడి కాలువ నుంచి 175.40 కిలోమీటర్ల అటవీయేతర భూముల ద్వారా ఇప్పటికే నిర్మించిన ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ జలాలను గోదావరి ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం వద్ద అక్విడెక్టును నిర్మించి నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎత్తిపోయాలని మొదట భావించారు.
ఇలా అక్విడెక్టును నిర్మిస్తే రూ.1,500 కోట్లు అదనపు వ్యయమవుతుందన్న ఉద్దేశంతో.. అక్విడెక్టు ద్వారా కాకుండా బుడమేరు కాలువ ద్వారా పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలోకి పంపితే గోదావరి ట్రైబ్యునల్ ఆదేశాలు వర్తించే ఆస్కారం లేదని నిపుణులు సూచించారు. దీంతో.. అక్విడెక్టును నిర్మించకుండానే కృష్ణా నదిలోకి రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించాలని నిర్ణయించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూసీ, మన్నేరు బేసిన్ల పరిధిలో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరివ్వడమే గాక.. వెలిగొండ, గుండ్లకమ్మ, ఇతర చిన్న ప్రాజెక్టుల పరిధిలోని 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని.. 60 లక్షల మందికి తాగునీటి సరఫరా, పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు సరఫరా ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. ప్రాజెక్టు తొలిదశను రూ.13800 కోట్లు, రెండోదశను రూ.35750 కోట్లతోనూ.. మూడో దశను 9150 కోట్లతోనూ మొత్తంగా రూ.58,700 కోట్లతో పూర్తి చేయాలని జల వనరుల శాఖ అంచనా వేసింది.
తెలంగాణకు నష్టం ఉండదు: నిపుణులు
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం కోసం తయారు చేసిన హైడ్రాలజీ రిపోర్టును, ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్)ను కూడా రాష్ట్రప్రభుత్వం ఇదివరకే జల సంఘానికి పంపింది. దీనిపై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విరమించుకుని.. నల్లమలసాగర్ వరకే వరద నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించింది. తాజా స్కీంతో తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ ఉండదని నిపుణులు చెబుతున్నారు. దిగువ రాష్ట్రమైన ఏపీ వాడుకునే వరద జలాలతో ఎగువనున్న ఈ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి ఏటా 3,000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని.. ఈ ఏడాది ఇప్పటికే 4,500 టీఎంసీలు కడలిపాలయ్యాయని గుర్తుచేస్తున్నారు. వరద సమయంలోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున నల్లమలసాగర్‌కు తరలిస్తారని చెబుతున్నారు.