Child Abuse Case: మా కుటుంబాన్ని వైసీపీ నేతలు ట్రోల్ చేశారు
ABN , Publish Date - Oct 25 , 2025 | 06:37 AM
కాకినాడ జిల్లా తుని బాలిక అత్యాచారం ఘటనలో నిందితుడు నారాయణరావు కోడలు నాగలక్ష్మి వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
పార్టీ పెద్దల వద్ద డబ్బు తీసుకుని ఆందోళనకు దిగారు
ఆ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
తుని అత్యాచార నిందితుడి కోడలు నాగలక్ష్మి
తుని రూరల్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని బాలిక అత్యాచారం ఘటనలో నిందితుడు నారాయణరావు కోడలు నాగలక్ష్మి వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పెద్దల వద్ద ఆ పార్టీ నేతలు కొందరు డబ్బు తీసుకుని ఆందోళనకు దిగారని, రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం తునిలో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ మామ తప్పు చేస్తే.. వైసీపీ నాయకులు తమ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టి ట్రోల్ చేసి మానసిక క్షోభకు గురి చేశారన్నారు. బాలిక కోసం ధర్నా చేసిన కొందరు దళిత నేతలు..మాలమహానాడు నాయకుడైన తమ మామ చనిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తమ మామకు తగిన శాస్తి జరిగిందని, ఆడపిల్లల విషయంలో ఏ మగాడు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠినం గా వ్యవహరించాలని మంత్రి లోకేశ్‌ను నాగలక్ష్మి కోరారు.