Nadendla Manohar: ఖరీఫ్ ధాన్యంసేకరణ లక్ష్యం 50 లక్షల టన్నులు
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:34 AM
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 50లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గతేడాది కంటే 14 లక్షల టన్నులు అదనంగా సేకరణ
48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ములు
రైతుల అభిప్రాయాల సేకరణకు క్యూఆర్ కోడ్‌లు
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
కాకినాడ(కలెక్టరేట్), సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 50లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణపై కాకినాడ కలెక్టరేట్‌లో శుక్రవా రం కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల అధికారులు, మిల్లర్లు, రైతులు, పీఏసీఎస్ ప్రతినిధులతో ఆయ న సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గతేఏడాది ఖరీ్‌ఫలో 35.94 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. నిరుటి కంటే 14లక్షల టన్నుల ధాన్యం అదనంగా సేకరించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది దిగుబడులు అధికంగా ఉంటాయన్న అంచనాలతో భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నామని చెప్పారు. ధాన్యం సేకరణ నిమిత్తం రైతులకు రూ.11,850 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సేకరించిన 24 గంటల నుంచి 48 గంటల్లోపు ధాన్యం సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామ ని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను పూర్తి గా విస్మరించిందని ఆరోపించారు. ధాన్యం బకాయి లు రూ.1,674 కోట్లు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభు త్వం తొలి విడతలో రూ.వెయ్యి కోట్లు, రెండో విడత లో రూ.674 కోట్లు రైతులకు చెల్లించి ఆదుకుందని గుర్తుచేశారు. రైతులు పంటలు పండించిన వెంటనే కల్లాల్లోనే పంట కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో, రైస్‌మిల్లుల్లో ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రైతులు తమ సమస్యలను పంపిస్తే తక్షణం పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ ఏడాది క్వింటా ఎ-గ్రేడ్ రకం రూ.2,389, సాధారణ రకం రూ.2,369 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. రేషన్ మాఫియాపై త్వరలో సిట్ దర్యాప్తు ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో 80శాతం స్మార్ట్ రైస్‌కార్డుల పంపిణీ జరిగిందని, 96.5 శాతం కార్డుదారులకు ఈకేవైసీ పూర్తయిందని వివరించారు. దీపం పథకంలో ఇప్పటివరకు ఏపీలో 2.42 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు ఇచ్చామని అన్నారు. మూడో విడతలో లబ్ధిదారులకు సబ్సిడీ సొమ్ములు జమ కానివారు టోల్‌ఫ్రీ నం. 1967కు ఫిర్యాదు చేయాలని సూచించారు.