రైతులపై జగన్ మొసలి కన్నీరు: నాదెండ్ల
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:25 AM
తన ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచి.. వారి శ్రమను నిలువునా దోచుకున్న జగన్.. ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిపోతోందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని....
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): తన ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచి.. వారి శ్రమను నిలువునా దోచుకున్న జగన్.. ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిపోతోందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుకు ఏ కష్టమొచ్చినా పవన్ కల్యాణ్ ముందుంటారని, అలాంటి పవన్‌ను విమర్శించే స్థాయి, అర్హత జగన్‌కు లేవని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైతులకు కులం, మతం అంటగడుతున్న ఆయనకు ఇంగితం లేదన్నారు. గురువారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ 75 కిలోల ధాన్యం బస్తాకు రూ.1450 నుంచి 1650 మద్దతు ధర చెల్లించగా.. కూటమి ప్రభుత్వం 1,792 చెల్లిస్తోంది. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా 5.20 లక్షల టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేసి చేతులెత్తేసింది. ఆ ధాన్యానికి చెల్లించాల్సిన రూ.1674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోతే.. మా ప్రభుత్వమే చెల్లించింది. ఆయన హయాంలో మద్దతు ధర చెల్లించకుండా నెలల తరబడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే.. ఇప్పుడు 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం’ అని చెప్పారు.