Nadendla Manohar: తుఫాన్ వేళ..కల్లాల్లోనే ధాన్యం
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:32 AM
ఓ వైపు తుఫాన్ ముంచుకొస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో పండించిన ధాన్యం కల్లాల్లోనే ఉంది. తుఫాన్ సమయంలో గోతాల్లేక, ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచలేక, ధాన్యం రాశుల్ని ఇళ్లకు తరలించలేక రైతులు సతమతమవుతున్నారు.
కృష్ణా, గోదావరి డెల్టాలో గోనె సంచుల కొరత
ఖరీఫ్‌లో 6.70 కోట్ల సంచులు సిద్ధం చేస్తున్నామన్న ప్రభుత్వం
సగం కూడా సరఫరా కాని వైనం
ధాన్యం తడుస్తుందేమోనని రైతన్నల ఆందోళన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఓ వైపు తుఫాన్ ముంచుకొస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో పండించిన ధాన్యం కల్లాల్లోనే ఉంది. తుఫాన్ సమయంలో గోతాల్లేక, ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచలేక, ధాన్యం రాశుల్ని ఇళ్లకు తరలించలేక రైతులు సతమతమవుతున్నారు. ధాన్యం తడిసిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో పండించిన ధాన్యాన్ని నింపే గోనెసంచుల (గన్నీ బ్యాగులు)కు డిమాండ్ వచ్చింది. నూర్చిన, ఆరబోసిన ధాన్యం నింపడానికి గోనె సంచులు తగినన్ని అందుబాటులో లేక చాలా గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌లో పండించిన వరిని కోసి, కుప్పలేసి, నూర్చిన ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబోశారు. బస్తాలకు ఎత్తడానికి గోనె సంచులు సకాలంలో ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 17 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా, 113 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రజాపంపిణీ, ఇతర అవసరాలకు ఈ సీజన్‌లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ధాన్యం సేకరణకు 6.32 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని, అయినా 6.70 కోట్ల సంచులు సిద్ధం చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించారు. కానీ ఇందులో సగం కూడా రైతులకు సరఫరా కాలేదని సమాచారం. ధాన్యం రైతులకు గోనె సంచులు సరఫరా చేయడానికి జిల్లాల వారీగా పౌరసరఫరాల సంస్థ టెండర్లు పిలిచినా.. తగినన్ని సరఫరా కావడం లేదని తెలుస్తోంది. పాత గోనె సంచులు చిరిగిపోవడం, కొత్తవి కుట్టించి తెప్పించడం కష్టంగా మారుతున్నందున సీజన్‌కు ముందే గోనె సంచుల్ని సేకరించి, రైతులకు సరఫరా చేయడంపై పౌరసరఫరాల సంస్థ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో గోనె సంచుల విషయంలో గందరగోళం ఏర్పడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వరి కోతలు సగానికిపైగా పూర్తయ్యాయి. కొందరు రైతులు వరి కుప్పలు వేయగా, మరికొందరు కల్లాల్లో నూర్చి, ఖాళీ జాగాల్లో ఆరబోస్తున్నారు. ధాన్యం ఆరితేనే నాణ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు తుఫాన్ ముప్పు ఉండటంతో ఆరిన ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపాలని రైతులు ఆదుర్దా పడుతున్నారు. దీంతో గోనె సంచుల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదిస్తున్నారు. ‘ఇంకా రాలేదు.. కొద్దిగానే ఉన్నాయి.. ఉన్నవి కూడా ముందుగా ధాన్యం లోడెత్తే వాళ్లకే ఇస్తాం’ అని అంటున్నారని కొందరు రైతులు చెప్తున్నారు. కృష్ణా జిల్లా అయినంపూడి రైతు సేవా కేంద్రానికి తక్షణం 8 వేల గన్నీ బ్యాగులు అవసరం కాగా... గోతాలేవీ లేవంటున్నారని అక్కడి రైతులు వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు పెద్ద సం ఖ్యలో గోనెసంచులు కావాలంటే బయట దొరికే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు.
మొత్తం ధాన్యం కొంటాం
51 లక్షల టన్నుల సేకరణకు అంచనా
బాపట్ల జిల్లా చెరుకుపల్లి రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
రేపల్ల్లె, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్నదాతల నుంచి పంట మొత్తం కొనుగోలు చేసేలా 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అంచనాలు రూపొందించినట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ‘‘ఇప్పటికే 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లోకి 2,300 కోట్ల నగదును జమ చేశాం. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మూడు, నాలుగు నెలలకుకూడా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేవాళ్లు కాదు. కూటమిప్రభుత్వం వచ్చాక కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతోంది. రైతుల నుంచి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దు. తేమశాతం తక్కువగా ఉందని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.’’ అని మంత్రి స్పష్టం చేశారు.