Guntur District: వరుస మరణాల మిస్టరీ ఏంటి
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:12 AM
ఆ గ్రామంలో అప్పటి వరకు ఆరోగ్యంగా, చలాకీగా ఉన్న వారు అంతుచిక్కని వ్యాధితో ఉన్నట్టుండి పడిపోతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులతో మొదలవుతున్న వ్యాధి చివరకు ప్రాణాలు తీసేస్తోంది.
గుంటూరు జిల్లా తురకపాలెంలో బెంబేలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి
ఇటీవల కాలంలో 30 మంది మృతి
జ్వరం, కీళ్ల నొప్పులతో మొదలు
వైద్యం చేసినా నిరుపయోగమే
కొత్త సూక్ష్మజీవి కారణమనే భయం
వివరాలు సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ
ల్యాబ్ పరీక్షలకు రోగుల రక్త నమూనాలు
గుంటూరు మెడికల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆ గ్రామంలో అప్పటి వరకు ఆరోగ్యంగా, చలాకీగా ఉన్న వారు అంతుచిక్కని వ్యాధితో ఉన్నట్టుండి పడిపోతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులతో మొదలవుతున్న వ్యాధి చివరకు ప్రాణాలు తీసేస్తోంది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ చిన్న గ్రామంలో ఇటీవల 30 మంది అర్ధంతరంగా మరణించారు. వ్యాధితో బాధపడుతున్నవారిని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం ఉండటం లేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయా? అని గ్రామస్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వరుస మరణాలతో వారు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ మరణాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఎపిడిమిక్ సెల్ ద్వారా శుక్ర, శనివారాల్లో గ్రామంలో సర్వే నిర్వహించారు. అది ఇంకా కొనసాగనుంది. ఎపిడిమిక్ బృందంతో పాటు గుంటూరు వైద్య కళాశాలకు చెందిన ఎస్‌పీఎం, మైక్రోబయాలజీ వైద్యనిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యుల బృందం తురకపాలెంలో పర్యటించారు. మృతి చెందిన 25 మంది వ్యక్తులను గుర్తించి వారి కుటుంబ సభ్యులతో మరణ కారణాలపై పలు ప్రశ్నలు అడిగి (వెర్బల్ అటాప్సీ) వివరాలు తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా వ్యాధి అనుమానిత కుటుంబ సభ్యుల నుంచి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. గ్రామంలో మంచినీటి నమూనాలను కూడా కోసం సేకరించి పరీక్షిస్తున్నారు.
దోమ కాటు వల్ల వస్తోందా?
దోమ కాటు వల్ల కొందరు ఈ వ్యాధి బారిన పడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు. దోమ కుట్టిన ప్రాంతంలో బొబ్బలు మాదిరిగా ఏర్పడ్డాయని తెలిపారు. అనంతరం వ్యాధిగ్రస్తులు మృతి చెందారు. మరికొందరికి చీప్ లిక్కర్ అలవాటు కూడా ఉందని తేలింది. దీని ప్రభావం ఏమైనా ఉందా అనేది నిర్ధారించాల్సి ఉంది. అయితే మరణాలకు వైర్‌స/బ్యాక్టీరియా జ్వరాలు కారణం కాదని వైద్య బృందాలు తమ ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. ఇప్పటి వరకు గుర్తించిన 25 మంది మృతుల్లో 10 మంది మహిళలు, 15 మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఆరుగురు 65 ఏళ్లు పైబడిన వారు ఉండగా, మిగిలిన 19 మంది 60 ఏళ్లలోపు వారే. ఈ మరణాలకు జీవనశైలి వ్యాధులే కారణమని కొందరు నిపుణుల అభిప్రాయం. అయితే అసలైన కారణాలు ఏమిటో నిగ్గు తేలాల్సి ఉంది. రెండు రోజుల్లో రక్తనమూనాలు, నీటి నమూనాల పరీక్ష ఫలితాలు వైద్య ఆరోగ్య శాఖకు అందుతాయని తెలిసింది.
ఎమ్మెల్యే రాకతో వెలుగులోకి..
ఇటీవల తురకపాలెంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆ గ్రామానికి వెళ్లారు. అప్పుడు ఈ మరణాల గురించి తెలిసింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 30 మంది చనిపోయినట్లు తెలియడంతో ఎమ్మెల్యే వెంటనే ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత తాత్కాలికంగా గ్రామంలో సర్వే చేసి మిన్నకుండిపోయారు. ఆ తర్వాత కూడా మరో మూడు మరణాలు సంభవించడంతో, స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని నేరుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ కలెక్టర్ నాగలక్ష్మిని వివరణ కోరింది. వెంటనే స్పందించిన కలెక్టర్.. ఈ మరణాలపై సమగ్ర నివేదిక అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.విజయలక్ష్మిని ఆదేశించారు. దీంతో వైద్యా ఆరోగ్య యంత్రాంగం చర్యల చేపట్టింది.
జ్వరాలు, కీళ్లనొప్పులతో చనిపోతున్నారు
తురకపాలెంలో గడిచిన కొంతకాలంగా 30 మందికి పైగా చనిపోయారు. అందరూ జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడ్డారు. నెల కిందట మా నాన్న శౌరీబాబు జ్వరం, కీళ్ల నొప్పుల బారిన పడ్డారు. గుంటూరులో ప్రైవేటు వైద్యశాలలో చేర్పిం చాం. కీళ్ల దగ్గర నీరు చేరిందని, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌గా మారిందని డాక్టర్లు తెలిపారు. అంతుబట్టని జబ్బుకు చికిత్స పొం దుతూ మానాన్న మృతి చెందారు. ప్రభు త్వం స్పందించి గ్రామంలో తగిన చర్యలు చేపట్టాలి.
- పౌలేష్, తురకపాలెం