Alluri District: ఈ రాయి కూడా వింతేనోయి
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:50 AM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ కొండపై ఉన్న రాయి విశేషంగా ఆకట్టుకుంటోంది.
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం గొందూరు వద్ద భీముడి రాయి
పాడేరు, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ కొండపై ఉన్న రాయి విశేషంగా ఆకట్టుకుంటోంది. హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ గొందూరు గ్రామానికి సమీపంలో ఈ రాయి ఉంది. కొండపైన ప్రత్యేకంగా పెట్టినట్టు కనిపించే ఈ రాయి... తమిళనాడు మహాబలిపురంలోని ‘కృష్ణుడి వెన్న బంతి’ని పోలి ఉండడం విశేషం. ఈ రాయి చుట్టూ అనేక గిరిజన విశ్వాసాలు అల్లుకొని ఉన్నాయి. వారు ఆ ప్రాంతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. చెప్పులు దూరంగా విడిచి మాత్రమే అక్కడకు వెళతారు. దానిపై స్థానికులు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ‘ఈ రాయిని మేం భీముడు రాయిగా పిలుస్తాం. ఆ కాలంలో ఒక వరాహాన్ని వెతుక్కుంటూ ఇటుగా వచ్చిన ఆయన ఈ రాయిని కొండపై పెట్టి, దానిపైకెక్కి వరాహాన్ని వెతికాడని మా పూర్వీకులు చెప్పారు. అందుకే ఈ రాయికి సమీపంలో ఉన్న గిరిజన పల్లెకు పందిమెట్ట అనే పేరు వచ్చింది’ అని తెలిపారు.