Share News

Limestone Lease: మైహోమ్‌ నుంచి ఏ హోమ్‌కు

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:38 AM

అవే భూములు! అవే సున్నపురాయి గనులు! కానీ... కంపెనీ మారింది! షరతులు మాయమయ్యాయి. సిమెంటు ఫ్యాక్టరీ పెట్టి, దానికోసమే సున్నపురాయి వాడాలంటూ ‘మైహోమ్‌’కు కేటాయించిన గనులను...

Limestone Lease: మైహోమ్‌ నుంచి ఏ హోమ్‌కు

  • 919 ఎకరాల సున్నపురాయి లీజు బదిలీ

  • 2016లో మైహోమ్‌ సంస్థకు కేటాయింపు

  • ‘క్యాప్టివ్‌’ కింద సిమెంట్‌ ఫ్యాక్టరీ పెట్టాలనే షరతు

  • గడువులు దాటినా ఏర్పాటుకాని ఫ్యాక్టరీ

  • ఇప్పుడు ‘రాధాంగ ఇండస్ట్రీస్‌’కు లీజులు బదిలీ

  • ఎన్సీఎల్టీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న మైహోమ్‌

  • మైహోమ్‌ హబ్‌లోనే ‘రాధాంగ’ చిరునామా

  • ‘క్యాప్టివ్‌’ పదం లేకుండానే ఉత్తర్వులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అవే భూములు! అవే సున్నపురాయి గనులు! కానీ... కంపెనీ మారింది! షరతులు మాయమయ్యాయి. సిమెంటు ఫ్యాక్టరీ పెట్టి, దానికోసమే సున్నపురాయి వాడాలంటూ ‘మైహోమ్‌’కు కేటాయించిన గనులను... ఇప్పుడు ‘రాధాంగ ఇండస్ట్రీస్‌’ అనే మరో కంపెనీకి బదిలీ చేశారు. అందులో... ‘క్యాప్టివ్‌’ అనే షరతూ లేదు. మరో విశేషమేమిటంటే... రాధాంగ ఇండస్ట్రీస్‌ చిరునామా కూడా ‘మైహోమ్‌ హబ్‌’లోనే ఉంది. అంటే... మైహోమ్‌ సంస్థకు షరతులతో కేటాయించిన సున్నపు రాయి గనులను అదే కంపెనీ ఏర్పాటు చేసుకున్న అనుబంధ సంస్థకు కేటాయించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే...ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో 919 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వాటి విలువ వేల కోట్లలోనే! రాష్ట్ర విభజన అనంతరం ఈ భూములను మైహోమ్‌ ఇండస్ట్రీస్‌కు కేటాయిస్తూ 2016 డిసెంబరు 12న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది... ‘క్యాప్టివ్‌’ మైనింగ్‌! అంటే... స్థానికంగా సిమెంట్‌ ప్లాంటును ఏర్పాటు చేసి, దానికోసం మాత్రమే సున్నపురాయిని ఉపయోగించుకోవాలి. మూడేళ్లలో అంటే 2019 డిసెంబరు నాటికి ఈ ప్లాంట్‌ను ప్రారంభించేలా గనుల శాఖతో మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ... గడువులోపు ఆ సంస్థ ప్లాంటు ఏర్పాటు చేయలేదు. దీంతో 2020 వరకు గడువును పొడిగించారు. అయినా ప్లాంటు ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో మరోసారి 2023 వరకు పొడిగింపు ఇచ్చారు. అయినా ఫలితం లేదు. మరోసారి... 2024 జూలై 7 వరకు ప్రభుత్వం గడువు నిర్దేశించింది. ఈలోగా సిమెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేయలని స్పష్టం చేసింది.


తెరపైకి మరో సంస్థ...

గనులశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సిమెంటు కంపెనీ ప్రారంభించాల్సిన మైహోమ్‌ సంస్థ... ‘రాధాంగ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను తెరపైకి తెచ్చింది. ‘‘మాకు ఇచ్చిన సున్నపురాయి లీజును రాధాంగ ఇండస్ట్రీ్‌సకు బదిలీ చేయండి’ అంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. అక్కడ... అందుకు అనుకూలంగా అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే గామాలపాడులోని 919 ఎకరాల సున్నపురాయి నిల్వలున్న భూముల లీజులను మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రాధాంగ ఇండస్ట్రీస్‌ పేరిట మార్చాలని, లీజు కాలపరిమితిని 2067గా నిర్ణయించాలని గనుల శాఖ డైరెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో 141 జారీ చేసింది.


ఏమిటీ చిత్రం?

‘క్యాప్టివ్‌’ అంటేనే షరతులకు లోబడి అని! దీని ప్రకారం మైహోమ్‌ తప్పనిసరిగా సిమెంట్‌ ఫ్యాక్టరీ పెట్టి, లీజుకు పొందిన సున్నపురాయిని దానికోసమే వాడాలి. అయితే... ఫ్యాక్టరీ పెట్టకపోగా, ఆ లీజులను మరో కంపెనీకి బదిలీ చేయాలని ఎన్సీఎల్టీని ఆశ్రయించడమే ఒక విచిత్రం! రాధాంగ ఇండస్ట్రీస్‌ 2023 మే 8న హైదరాబాద్‌ కేంద్రంగా రిజిస్టర్‌ అయింది. అంటే అది పుట్టి రెండేళ్లు! దాని చిరునామా కూడా మాదాపూర్‌ (హైదరాబాద్‌)లోని మైహోమ్‌ హబ్‌గానే చూపిస్తుండటం విశేషం. సిమెంట్‌ పరిశ్రమకు ‘బంగారం’తో సమానమైన సున్నపురాయి లీజులను మైహోమ్‌ ఎందుకు వదులుకుంది? ‘రాధాంగ ఇండస్ట్రీస్’కే ఇవ్వాలని ఎందుకు కోరింది? ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా లీజులు ఎలా బదిలీ చేసింది? ఇవన్నీ ప్రశ్నలే! రాధాంగ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‘క్లింకర్స్‌ అండ్‌ సిమెంట్‌’ తయారీలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. రెండేళ్ల కింద ఆవిర్భవించిన ఈ కంపెనీకి ఎక్కడ సిమెంటు తయారీ ప్లాంట్లు ఉన్నాయో తెలియదు! మైహోమ్‌కు దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో 919 ఎకరాల లీజును ‘క్యాప్టివ్‌’ ప్రాతిపదికన కేటాయించారు. కానీ... రాధాంగకు బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ‘క్యాప్టివ్‌’పై స్పష్టత లేకపోవడం గమనార్హం.

Updated Date - Jul 31 , 2025 | 03:42 AM