Share News

Minister Lokesh: నాన్నే నా తొలి గురువు

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:41 AM

నాకు తొలి గురువు మా నాన్న చంద్రబాబు గారే. నేను స్టాన్‌ఫోర్డ్‌ వరకూ వెళ్లి చదివి, నేడు మంత్రిని అయ్యానంటే నాకు చదువు చెప్పిన టీచర్లే కారణం అని మంత్రి లోకేశ్‌ అన్నారు.

Minister Lokesh: నాన్నే నా తొలి గురువు

  • స్కూల్‌లో మాది రౌడీ బ్యాచ్‌... బ్యాక్‌ బెంచ్‌ విద్యార్థిని

  • ఆ ఉపాధ్యాయుల వల్లే క్రమశిక్షణ అలవడింది: లోకేశ్‌

‘‘సీఎం చంద్రబాబుతో పనిచేయడం అంత తేలిక కాదు. మంత్రిగా ఒకరోజు సెలవు కావాలని అడిగితే ఎందుకని అడిగారు. మా అబ్బాయి దేవాన్ష్‌ స్కూల్‌లో పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌కు వెళ్లాలని చెప్పా. ఆతర్వాత అన్ని పాఠశాలల్లో మెగా పీటీఎంలు నిర్వహించాం.’’

- లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘‘నాకు తొలి గురువు మా నాన్న చంద్రబాబు గారే. నేను స్టాన్‌ఫోర్డ్‌ వరకూ వెళ్లి చదివి, నేడు మంత్రిని అయ్యానంటే నాకు చదువు చెప్పిన టీచర్లే కారణం’’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్కూల్‌లో మాది రౌడీ బ్యాచ్‌. నేను బ్యాక్‌ బెంచ్‌ విద్యార్థిని. నన్ను తీర్చిదిద్దింది మా టీచర్‌ మంజుల, ప్రిన్సిపాల్‌ రమాదేవి. ఆ తర్వాత పి.నారాయణ (ప్రస్తుత మంత్రి). యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్‌ రాజిరెడ్డి. ఈ నలుగురి వల్లే ఉన్నత విద్యను అభ్యసించగలిగాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని నేను ఇచ్చిన పిలుపునకు టీచర్లు అద్భుతంగా స్పందించారు. కొన్ని పాఠశాలల్లో ‘నో అడ్మిషన్‌’ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌ ’’ అని లోకేశ్‌ తెలిపారు. ‘డీఎస్సీ అంటే చంద్రబాబు... చంద్రబాబు అంటే డీఎస్సీ’ అని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రభుత్వంలో మొదటి ఏడాది సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చాం. ఇకపై ఫలితాలు రాబట్టాలనేది లక్ష్యం. గతప్రభుత్వంలో టీచర్లను వైన్‌షాపుల ముందు కాపలాపెట్టారు. ఈప్రభుత్వంలో టీచర్లకు ఇబ్బందులు తప్పించాం.’’ అని లోకేశ్‌ కోరారు.


నారాయణ సార్‌... ఎంతో నేర్పించారు: విద్యార్థి దశలో తనకు మంత్రి పి.నారాయణ ఎంతో నేర్పించారని లోకేశ్‌ అన్నారు. ‘‘అప్పట్లో ఫండమెటల్‌గా నేను వీక్‌గా ఉన్నానని నారాయణ సార్‌ను పిలిపించి... మావాడు కొంచెం వీక్‌గా ఉన్నాడు అని బ్రిడ్జి కోర్సు నేర్పించారు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్‌- టీచర్స్‌ మీటింగ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ఒకేరోజు 50లక్షల మందికిపైగా టీచర్లు, తల్లిదండ్రులతో నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గిన్నిస్‌ రికార్డుల ప్రతినిధి ఈ గుర్తింపు పత్రాన్ని చంద్రబాబుకు అందజేశారు.’’ అని లోకేశ్‌ తెలిపారు.

Updated Date - Sep 06 , 2025 | 05:42 AM