Former Chief Justice N. V. Ramana: నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:48 AM
మీ అందరికీ తెలుసు.. నా కుటుంబాన్ని ఎలా లక్ష్యంగా చేసుకున్నారో.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించారు.
నాపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించారు
న్యాయమూర్తుల కుటుంబాలపైనా రాజకీయ కుట్రలు
అమరావతి రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం
వీఐటీ ఐదేళ్లు పోరాడి అమరావతిలో సంస్థను నిలబెట్టింది
వీఐటీ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్‌వీ రమణ
తుళ్లూరు/తాడికొండ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ అందరికీ తెలుసు.. నా కుటుంబాన్ని ఎలా లక్ష్యంగా చేసుకున్నారో.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించారు. రాజ్యాంగ సూత్రాలను సమర్థించిన న్యాయవ్యవస్థ సభ్యులు బదిలీలు, ఒత్తిడిని ఎదుర్కొన్నారు. న్యాయమూర్తుల కుటుంబాలు రాజకీయ కుట్రలకు లక్ష్యంగా మారాయి. దక్షిణ భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటం. అధికారం మారినప్పుడల్లా విధానాలకు అంతరాయం కలిగించడం తప్పు. అది అభివృద్ధిని కుంగదీస్తుంది. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది’’ అని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. శనివారం రాజధాని అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్‌వీ రమణ పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రభుత్వాలు మారవచ్చు. కానీ కోర్టులు, చట్టపాలన స్థిరత్వానికి నిలువెత్తు నిదర్శనం. ప్రజాస్వామ్యం నిజమైన శక్తి పాలకులలో లేదు. పౌరుల నైతిక దృఢత్వంలో ఉంది. ఐదేళ్లు పోరాడి వివిధ సవాళ్లను ఎదుర్కొని ఇక్కడ సంస్థను నిలబెట్టిన వీఐటీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. వీఐటీ వంటి అనేక సంస్థలు క్లిష్ట సమయంలో నిలదొక్కుకున్నాయి. వీఐటీ సంస్థను స్థాపించినందుకు తెలుగు ప్రజల తరఫున యాజమాన్యానికి ధన్యవాదాలు’’ అని అన్నారు.
విధ్వంసక విధానాలకు అమరావతి ఉదాహరణ
‘‘అమరావతి అనుభవించిన గాయం విధ్వంసక విధానాలకు సజీవ ఉదాహరణ.. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, రాజధాని కోసం రైతులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. మహాకవి శ్రీశ్రీ రచించిన ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అనే కవితకు అమరావతి రైతుల త్యాగాలు ప్రతీక. రైతుల పోరాటాల ఆధారంగానే రాజధాని మనుగడ ఉన్నది. రైతులు ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు ఐదేళ్లు పోరాటాన్ని కొనసాగించారు. రైతుల సహనం, క్రమశిక్షణ, ఓర్పుతోనే రాజధాని సాధ్యమైంది. రైతుల పోరాటం నుంచి నేను చాలా ప్రేరణ పొందాను. న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకాన్ని ఉంచిన రైతులకు ధన్యవాదాలు. వీధుల నుంచి కోర్టు వరకు ఉద్యమం ఊపందుకోవడంలో దేశ పౌరులు, న్యాయవాదులు అందించిన సహకారాన్ని గుర్తుంచుకోవాలి. పాలనలో ప్రతీకారానికి అధికార వ్యవస్థను ఉపయోగించకూడదని నేనిచ్చిన ఒక తీర్పులో హెచ్చరించాను’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.
సోషల్ మీడియాకు బానిసలైతే ఇబ్బందులు
‘‘రాజకీయాల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ యువత చురుగ్గా పాల్గొనాలి. లేకపోతే దేశాన్ని నిజాయతీ లేని, స్వార్థపరులైన పాలకులు పాలిస్తారు. యువత చేతుల్లోనే భవిష్యత్ ఉంది. కొత్త సందేశాలు, ఈ-మెయిల్‌లు, వార్తలు, నోటిఫికేషన్లు, లైక్‌ల కోసం ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఫోన్లు చూసుకోవడానికి పరిమితమవుతున్నారు. సోషల్ మీడియాకు బానిసలైన వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. నిజమైన సృజనాత్మకత కేంద్రీకృత మనస్సు నుంచి వస్తుంది. మనసుకు కొంత విశ్రాంతి లభించేలా స్ర్కీన్‌లను మితంగా ఉపయోగించాలి’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ సూచించారు. అనంతరం పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీలు, గోల్డ్‌మెడల్స్ సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఐటీ వ్యవస్థాపకుడు-చాన్సలర్ డాక్టర్ జీ విశ్వనాథన్, బెంగళూరు శ్యామ్సంగ్ ఎలక్ర్టానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్‌వర్మ, వీఐటీ వైస్ ప్రెసిడెంట్‌లు శంకర్ విశ్వనాథన్, డాక్టర్ జీవీసెల్వం, వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్‌వీకోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్‌చంద్ర ముదిగంటి, డీన్ డాక్టర్ ఎన్ మధుసూదనరావు, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖాదీర్‌పాషా పాల్గొన్నారు.