Tribal Tradition: ఒకరికొకరు తోడుగా..వెట్టి
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:23 AM
వెట్టి.. అంటే సహజంగా మనకు గుర్తొచ్చేది వెట్టి చాకిరీనే. అయితే ఆదివాసీల సంప్రదాయంలో మా త్రం దీనికి పరస్పర సహకారం అని అర్థం. ఏదైనా ఒక కుటుంబానికి చెందిన వ్యవసాయం, ఇంటి నిర్మాణం...
ఇదీ గిరిజనుల ఆచారం
(చింతూరు-ఆంధ్రజ్యోతి)
వెట్టి.. అంటే సహజంగా మనకు గుర్తొచ్చేది వెట్టి చాకిరీనే. అయితే ఆదివాసీల సంప్రదాయంలో మా త్రం దీనికి పరస్పర సహకారం అని అర్థం. ఏదైనా ఒక కుటుంబానికి చెందిన వ్యవసాయం, ఇంటి నిర్మాణం వంటి పనుల్లో ఊరంతా కలసికట్టుగా పని చేయడాన్నే వెట్టిగా ఆదివాసీలు పిలుచుకుంటారు. ఈ పనులకు నగదు చెల్లింపులకు బదులు విందు లేదా మాంసం పంపిణీ మాత్రమే ఉంటా యి. ఆర్థిక వనరులు అంతగా లేని ఆదివాసీ కుటుంబాలు తమ వ్యవసాయ పనులు లేదా గృహ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయడానికి ‘వెట్టి’ని ఆశ్రయిస్తుంటారు. దీనికోసం గ్రామపెద్దను సంప్రదించి తన పనిని గ్రామస్థులతో పూర్తి చేయిస్తే, తాను పెంచుకుంటు న్న మేకనో, కోడినో కోసి వాటాలు పంచుతామని, విందు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటుంటారు. గ్రామపెద్ద ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసి ముందుగా నిర్ణయించిన రోజున తమ సొంత పనులు మానుకొని ఆ కుటుంబం కోరిన పనిని పూర్తి చేస్తారు. ఒకవైపు పని సాగుతుండగా మరోవైపు కొందరు వ్యక్తులు వేటను కోసి వాటాలు సిద్ధం చేస్తారు. వాటిని తాటాకు దొప్పల్లో మూటకట్టి వెట్టిలో పాల్గొన్నవారిలో కుటుంబానికో దొప్ప చొప్పున అందిస్తారు. కొంత మాంసాన్ని వండి, విప్పసారా, తాటికల్లు తదితర సంప్రదాయ మత్తు పానీయాలతో చిన్నపాటి విందు కూడా ఆ యజమాని ఏర్పాటు చేస్తాడు. ఆకు దొప్పల్లో ఉంచిన అన్నం, వేట మాంసాన్ని వెట్టి పనుల్లో పాల్గొన్న వారంతా పంచుకుంటుంటారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని విలీన మండలాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.