Share News

Minister Sandhya Rani: అంగన్వాడీ కేంద్రాల్లోనూ ‘ముస్తాబు’

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:17 AM

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆలోచనతో.. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది.

Minister Sandhya Rani: అంగన్వాడీ కేంద్రాల్లోనూ ‘ముస్తాబు’

  • రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అమలు: మంత్రి సంధ్యారాణి

  • సీఎం ప్రశంస నేపథ్యంలో నిర్ణయం

పార్వతీపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆలోచనతో.. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. విద్యార్థుల్లో శుభ్రత పట్ల అవగాహన పెంచడం... బడికి చక్కగా తయారై రావడమే ఈ పథకం ఉద్దేశం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం క్యాబినెట్‌లో ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. శనివారం పార్వతీపురంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, బ్లాక్‌ కో-ఆర్డినేటర్లకు మంత్రి చేతులమీదుగా సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆలోచనతో.. ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో మంచి ఆరోగ్యంతో పాటు వారికి వ్యక్తిగత పరిశుభ్రత అలవాటవుతుందని తెలిపారు. కాగా, అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని, జీతాల సమస్యను పరిష్కరించాలని త్వరలోనే సీఎంను కోరుతామని చెప్పారు.

Updated Date - Dec 14 , 2025 | 04:18 AM