Share News

Mustabu Hygiene Program: రాష్ట్రమంతా ముస్తాబు

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:35 AM

ముఖ్యమంత్రి మెచ్చిన ముస్తాబు కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న...

Mustabu Hygiene Program: రాష్ట్రమంతా ముస్తాబు

  • నేటి నుంచి స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో అమలు

అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి మెచ్చిన ముస్తాబు కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టంచేశారు. కార్యక్రమం అమలుపై ప్రభుత్వం ఎస్‌వోపీ జారీచేసింది.

‘ముస్తాబు’ ఇలా..

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంచడం. నీటి సంబంధిత, చర్మ, అంటువ్యాధుల వ్యాప్తి నివారించడం. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచడం. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో శుభ్రత, ఆరోగ్యం, హుందాగా ఉండటం, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం.

ఏం చేయాలి?

ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫాం, బూట్లు ధరించాలి. గోర్లు కత్తిరించుకోవాలి. జుట్టు శుభ్రంగా, అందంగా ఉండేలా దువ్వుకోవాలి. ముఖం, చెవులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్‌కు వెళ్లొచ్చాక, భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రమైన నీరు తాగాలి. ప్రతి పాఠశాల, జూనియర్‌ కాలేజీల్లో ముస్తాబు కార్నర్‌ ఏర్పాటు చేసుకోవాలి. వీలైన చోట అద్దం ఏర్పాటుచేసి పిల్లలు శుభ్రంగా ఉన్నామా...లేదా అని చూసుకునే ఏర్పాటు చేయాలి. అలాగే సబ్బు లేదా హ్యాండ్‌ వాష్‌ అందుబాటులో ఉంచాలి. ప్రతి వారం పరిశుభ్రతకు సూచికలు ఏర్పాటుచేసి ‘ముస్తాబు స్టార్స్‌’ పేర్లు ప్రదర్శించాలి. విద్యార్థుల్లో కొందరు హైజిన్‌ లీడర్లుగా వ్యవహరిస్తారు. ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్లు, టీచర్లు, హాస్టల్‌ వార్డెన్లు ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. శనివారం కార్యక్రమం ప్రారంభించి 90 రోజుల తర్వాత అమలును సమీక్షించుకోవాలి.

Updated Date - Dec 20 , 2025 | 05:35 AM