Municipal Actions: వీధి కుక్కలపై ‘మున్సిపల్ దృష్టి’
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:43 AM
రాష్ట్రంలో వీధి కుక్కల బెడద తగ్గించేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది.
స్టెరిలైజేషన్,వ్యాక్సిన్ తప్పనిసరి
జనన నియంత్రణ, కుక్కకాటు ప్రమాదాల నివారణే లక్ష్యం
123 పట్టణాల్లో 5.15 లక్షలు ఉన్నట్లు అంచనా
197 మంది హ్యాండ్లర్లు, డాగ్ క్యాచర్ల నియామకం
ఆదేశాలు జారీ చేసిన ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీధి కుక్కల బెడద తగ్గించేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు, 2023 జంతు జనన నిబంధనల ప్రకారం కుక్కలకు స్టెరిలిజైషన్, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడంపై మున్సిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలిచ్చింది. కుక్కకాటు ప్రమాదాలను తగ్గించడానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణాల్లో సుమారు 5.15 లక్షల వీధి కుక్కలున్నట్లు అంచనా వేశాం. 2024 జూన్ 1 నాటికి 2,24,732, ఆ తర్వాత మరో 1,36,656 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశాం. మున్సిపాలిటీల్లో 197 మంది శిక్షణ పొందిన హ్యాండ్లర్లు, డాగ్ క్యాచర్ల నియామకం చేపట్టాం. రేబిస్ సోకిన కుక్కలను వెంటనే గుర్తించి ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సూచించాం. రాష్ట్ర, మున్సిపల్ స్థాయిలో జంతు జనన నియంత్రణ కమిటీలు నియమించాలని, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించాం. అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, క్రీడా పాంగణాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చాం. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టకుండా ప్రత్యేక జోన్‌లు కేటాయించాలని పేర్కొన్నాం. వీధి కుక్కల విషయంలో నిబంధనలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండవద్దని కమిషనర్లకు స్పష్టం చేశాం’ అని సురేశ్ కుమార్ పేర్కొన్నారు.