Share News

రసాభాసగా మున్సిపల్‌ కౌన్సిల్‌

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:03 AM

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ రసాభాసగా జరిగింది.

    రసాభాసగా మున్సిపల్‌ కౌన్సిల్‌
మున్సిపల్‌ అధికారులను ప్రశ్నిస్తున్న కౌన్సిల్‌ సభ్యులు

సమాచారం ఇవ్వకుండా తీర్మానాల తయారీపై

కౌన్సిలర్ల ఆగ్రహం

ఎక్కడో తయారు చేస్తే.. తామెందుకంటూ నిలదీత

తీర్మాన ప్రతులను చించేసిన కోఆప్షన సభ్యులు

మున్సిపల్‌ అధికారుల తీరు నచ్చక

సభ నుంచి వెళ్లిపోయిన కౌన్సిలరు

ఆత్మకూరు, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ రసాభాసగా జరిగింది. తీర్మానాల తయారీ విషయంలో కనీసం కౌన్సిల్‌కు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్‌ అధికారులు వ్యవహరించిన తీరును చైర్‌పర్సన డాక్టర్‌ మారూఫ్‌ ఆసియాతో సహా పలువురు కౌన్సిలర్లు తప్పుపట్టారు. పైగా తమకు తెలియకుండా ఎక్కడో తీర్మానాలు తయారు చేస్తే.. తామెందుకంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడే వార్డుల్లో ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలపై ఏమని సమాధానం చెప్పుకోవాలని మున్సిపల్‌ అధికాలను ప్రశ్నించారు. ఒకానొక సమయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన, కోఆప్షన సభ్యులు తండ్రి ఎంఏ.రషీద్‌ అజెండా పత్రాలను చించేసి ఏం తమాషా చేస్తున్నారా..? మున్సిపల్‌ కౌన్సిల్‌, చైర్‌పర్సన అంటే లెక్కలేదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ పరిస్థితుల్లో మున్సిపల్‌ అధికారులు కౌన్సిల్‌ సభ్యులకు ఏమీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయారు. ఇలా ఉత్కంఠ సాగిన కౌన్సిల్‌ సభలో మున్సిపల్‌ అఽధికారులు ప్రవేశపెట్టిన తీర్మానాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. దీంతో కౌన్సిలర్లు సభను బాయికాట్‌ వేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపరించింది.

ఆశ్చర్యం కలిగించేలా తీర్మానాల రూపకల్పన :

మున్సిపల్‌ కౌన్సిల్‌కు సమాచారం ఇవ్వకుండా అధికారులే స్వయం తయారు చేసిన తీర్మానాలపై సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి గురికావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. రూ.72.97లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఐదు వర్క్‌ల ఆమోద తీర్మానాన్ని ప్రతిపాదించగా ఆ వర్క్‌లన్ని అభివృద్ధి చెందిన కాలనీలకు మాత్రమే కుటాయించడం పట్ల మెజార్టీ సభ్యులు మండిపడి తిరస్కరించారు. అదేక్రమంలో వడ్లరామాపురం రస్తా నుంచి డంపింగ్‌ యార్డుకు వాహనాలు వెళ్లేందుకు రూ.26లక్షల జనరల్‌ ఫండ్‌తో రస్తా, కల్వర్టు నిర్మాణ పనులకు సంబంబంధి రెండు తీర్మానాలు ప్రతిపాదించగా రూ.20లక్షలు జనరల్‌ ఫండ్‌ ఉంటే రూ.26లక్షల నిధులను జనరల్‌ ఫండ్‌ నుంచి ఖర్చు చేయాలని నిర్ణయించడం ఏమంటని ప్రశ్నించారు. అదేక్రమంలో ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు కేసుల నిమిత్తం 29.03.205 తేదీన కేశవరెడ్డి అడ్వకేట్‌ను నియమించడం జరిగింది. ఆయనకు గౌరవ వేతనం కింద 1.04.2025 - 31.03.2025 వరకు నెలకు రూ.15వేల చొప్పున రూ.1.8లక్షల వేతనం ముందే ఇవ్వాలని ప్రతిపాదించగా నెలలు పూర్తికాకుండా అడ్వాన్స చెల్లింపులు ఏంటని సభ్యులు నిలదీశారు. అదేవిధంగా గతంలో మున్సిపల్‌ కార్యాలయంలో కోర్టు కేసుల నిమిత్తం నియమించబడిన సుబ్రమణ్యం అనే అడ్వకేట్‌కు 2012 నుంచి 2021 వరకు అప్పుడప్పుడు పెండింగ్‌లో ఉంచిన 72నెలలకు సంబంధించి నెలకు రూ.15వేల చొప్పున రూ.10.80లక్షలను చెల్లించాలని కౌన్సిల్‌ను కోరగా ఇంతకాలం ఎందుకు పెండింగ్‌లో ఉంచారో చెప్పాలని ప్రశ్నిస్తూ ఈ రెండు తీర్మానాలను వాయిదా వేశారు. కాగా 15 ఆర్థిక సంఘం ద్వారా రూ.1,09,46,356 నిధులతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం 2.0, అమృత 2.0 పనులకు సంబంధించి వార్షిక ప్రణాళిక తయారు చేయాలని తీర్మానించారు.

సంతకాలు పెట్టేందుకేనా మేము

- డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా, మున్సిపల్‌ చైర్‌పర్సన:

ఎక్కడో కూర్చోని తీర్మానాలు తయారు చేసుకుని ఆ పేపర్లపై ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేందుకేనా తాము వుండేదంటూ మున్సిపల్‌ చైర్‌పర్సన డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా మున్సిపల్‌ కమిషనర్‌ రమే్‌షబాబుపై మండిపడ్డారు. ఇకనుంచి తీర్మానాల అంశం కౌన్సిల్‌తో చర్చించి తన కార్యాలయంలోనే రూపొందించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో చర్చ జరిగిన తర్వాత ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని తీర్మానాలను తయారు చేయాలని సూచించారు. ఇకనుంచి ఇలాంటి ఉపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు.

Updated Date - Aug 01 , 2025 | 12:03 AM