SIT Arrest: మద్యం స్కాంలో ముంబై బులియన్ వ్యాపారి అరెస్టు
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:06 AM
జగన్ హయాంలో జరిగిన రూ.మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబై బులియన్ వ్యాపారి రోణక్‌కుమార్ జస్‌రాజ్‌ను ’సిట్’ అధికారులు అరెస్టు చేశారు.
రోణక్‌ను అదుపులోకి తీసుకున్న ‘సిట్’
వైసీపీ గ్యాంగ్ ఇచ్చిన రూ.100 కోట్లను వైట్ చేసిచ్చినట్లు చోఖ్రా వెల్లడి
అవేవీ తనకు తెలియదని.. అన్నయ్యే అన్నీ చూసుకుంటాడని విచారణలో రోణక్ వెల్లడి
అన్నతో మాట్లాడతానంటూ హాల్లోకి వెళ్లి జంప్.. ఎయిర్‌పోర్టులో పట్టుకున్న సిట్
అన్న చేతన్ కోసం ముంబైకి అధికారులు
సోదరులిద్దరినీ నిందితులుగా చేర్చిన వైనం
అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన రూ.మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబై బులియన్ వ్యాపారి రోణక్‌కుమార్ జస్‌రాజ్‌ను ’సిట్’ అధికారులు అరెస్టు చేశారు. అతడిని విచారణ నిమిత్తం విజయవాడకు పిలిపించగా.. బయట హాల్లో ఉంటానని చెప్పి తప్పించుకుని పారిపోతుండగా గన్నవరం విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయించి ముడుపుల రూపంలో వేల కోట్ల రూపాయలను వైసీపీ ముఠా వసూలు చేసింది. ఆ సొమ్ముతో ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు కొనడం మొదలుకొని.. పొరుగు రాష్ట్రాల్లో స్థిరాస్తులు, ముంబైలో బంగారం కొనుగోలు.. మనీలాండరింగ్, హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలింపు.. ఆ తర్వాత వైట్ మనీగా మార్చుకున్న రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ అక్రమాలను ఒక్కొక్కటిగా సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్‌పీవై ఆగ్రోస్ నుంచి ముంబైకి చెందిన అనిల్ చోఖ్రా సృష్టించిన సెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి రూ.78 కోట్లు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. చోఖ్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని.. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ‘ఆదాన్, లీలా, ఎస్‌పీవై యజమానులతో నాకు ప్రత్యక్షంగా సంబంధాల్లేవు.
ముంబైలోని హవాలా డాన్లలో ఒకరైన చాముండ బులియన్ యజమాని చేతన్‌కుమార్ జస్‌రాజ్ నన్ను పిలిచి హైదరాబాద్ నుంచి రూ.100 కోట్లు వస్తాయి.. ఆర్వోసీలో మేనేజ్ చేసి షెల్ కంపెనీలు సృష్టించి కేవైసీ ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అడిగారు.. కమీషన్ మాట్లాడుకుని నేను 30 కంపెనీల పేర్లు, ఖాతాల వివరాలు చేతన్‌కుమార్‌కు అందజేశాను.. తర్వాత ఆదాన్, లీలా, ఎస్‌పీవై ఖాతాల నుంచి నా పరిధిలో ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాలకు రూ.78 కోట్లు వచ్చాయి.. నకిలీ ఇన్వాయి్‌సలు, ఫేక్ జీఎస్‌టీతో కొంత, బులియన్ ద్వారా బంగారం కొనుగోలు చేసినట్లు మరికొంత వైట్‌గా మార్చేసి కమీషన్ పోను మిగతా సొమ్ము తిరిగి చెల్లించా’ అని చోఖ్రా వెల్లడించాడు. దీంతో సిట్ అధికారులు చేతన్‌కుమార్‌కు ఫోన్ చేసి చోఖ్రాతో కలిపి ప్రశ్నించాల్సి ఉందని, విజయవాడకు రమ్మని పిలిచారు.తనకు ఆరోగ్యం బాగాలేదంటూ తన తమ్ముడు రోణక్ కుమార్‌ను పంపాడు. మంగళవారం ఉదయం సిట్ కార్యాలయానికి వచ్చిన రోణక్‌ను అధికారులు చోఖ్రాతో కలిపి సాయంత్రం వరకు విచారించారు. అతడు చెబుతున్న విషయాలేవీ తనకు తెలియవని, అంతా తన అన్నే చూసుకుంటాడని రోణక్ చెప్పడంతో.. ‘చేతన్‌ను రేపు(బుధవారం) రమ్మను.. ముగ్గురినీ కలిపి ప్రశ్నిస్తాం’ అంటూ సిట్ అధికారులు సూచించారు. ఫోన్లో ఈ విషయం చెబుతానని, హాల్లో ఉంటానని చెప్పిన రోణక్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. గన్నవరం విమానాశ్రయానికి పరారయ్యాడు. ముంబై విమానం ఎక్కేందుకు బోర్డింగ్ పాస్‌తో సిద్ధంగా రోణక్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూనాభాయ్ సోదరులిద్దరినీ నిందితులుగా చేర్చారు. అతడిని ఏ-50గా, చేతన్‌కుమార్‌ను ఏ-51గా పేర్కొంటూ ఏసీబీ కోర్టుకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో ఈ కుంభకోణం కేసులోని నిందితుల సంఖ్య 51కి చేరింది.
రోణక్ అరెస్టుతో చేతన్ ఫోన్ స్విచాఫ్..
వాస్తవానికి చేతన్‌కుమార్ తాను విజయవాడ వస్తున్నానంటూ.. బుక్ చేసుకున్న విమాన టికెట్‌ను సిట్ అధికారులకు పంపాడు. ఆ తర్వాత అరెస్టు తప్పదన్న భయంతో తన తమ్ముడు పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడినట్లు తెలియగానే తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో అతడి కోసం సిట్ బృందాలు ముంబై వెళ్లనున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో చేతన్‌తో ఇటీవల ఎక్కువగా మాట్లాడినవారిలో వైసీపీ ముఠాకు చెందినవారెవరైనా ఉన్నారా అనే కోణంలో సాంకేతికంగా ఆరా తీస్తున్నారు.
వైసీపీ ముఠా నుంచి బ్లాక్.. అనిల్ చోఖ్రాతో వైట్..
ముంబైలో పూనాభాయ్‌గా పేరుగాంచిన జస్‌రాజ్ పాల్గొటా అనే వ్యాపారి చాముండ బులియన్ పేరుతో మహాలక్ష్మి జ్యుయెలరీ, రుచిత జ్యుయెలరీ తదితర పేర్లతో చాలా ఏళ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్నారు. మనీలాండరింగ్‌లో దిట.్ట నల్ల ధనం ఇస్తే దేశంలో ఎక్కడైనా వైట్ మనీగా మార్చి చెల్లిస్తాడని అంటారు. నకిలీ వే బిల్లులు, ఫేక్ జీఎ్‌సటీలు సృష్టించడం.. బంగారం కొనుగోలు చేసి.. బిల్లులు లేకుండా తీసుకెళ్లే చిన్న చిన్న బంగారం వ్యాపారులకు విక్రయించి ఆ సొమ్ము వైట్‌గా మారుస్తాడని.. అన్నింటికీ మించి కమీషన్ ఎక్కువగా ఇస్తే దుబాయ్‌తో పాటు 25-30 దేశాల్లో అడిగిన చోటుకు డబ్బు చేర్చగల సమర్థుడని ప్రచారంలో ఉంది. ఆయనకు వయసు మీద పడడంతో ప్రస్తుతం కుమారులు చేతన్, రోణక్ వ్యాపారాలు చూసుకుంటున్నారు. వారితో వైసీపీ ముఠా సంప్రదింపులు జరిపి వంద కోట్ల రూపాయలు వైట్‌గా మార్చి ఇవ్వాలని కోరింది. అనిల్ చోఖ్రాతో పూనాభాయ్ కుమారులు వ్యవహారం నడిపించారు.