Share News

Family Loss: కన్నీటి మంట ఊరట చెమ్మ

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:58 AM

మెదక్‌ రూరల్‌ మండలం శివాయిపల్లికి చెందిన ఆ ఇద్దరు తల్లీకూతుళ్లది ఎంత దురదృష్టం! ప్రయాణాన్ని వాయిదాలు వేస్తూ వేస్తూ చివరికి మృత్యువును ఆహ్వానించుకున్నారేమో అనిపిస్తోంది.

Family Loss: కన్నీటి మంట ఊరట చెమ్మ

గురువారానికి వాయిదానే ప్రాణాలు తీసింది

కర్నూలు క్రైం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మెదక్‌ రూరల్‌ మండలం శివాయిపల్లికి చెందిన ఆ ఇద్దరు తల్లీకూతుళ్లది ఎంత దురదృష్టం! ప్రయాణాన్ని వాయిదాలు వేస్తూ వేస్తూ చివరికి మృత్యువును ఆహ్వానించుకున్నారేమో అనిపిస్తోంది. ఐటీ ఉద్యోగి అయిన కుమార్తె చందనను బెంగళూరులో దిగబెట్టి.. తాను మస్కట్‌లో భర్త ఆనంద్‌గౌడ్‌ వద్దకు వెళ్లాలనేది తల్లి సంధ్యారాణి ప్రణాళిక. సెప్టెంబరు 14న తన తండ్రి సంవత్సరీకం కోసం సంధ్యారాణి మస్కట్‌ నుంచి స్వస్థలానికొచ్చింది. సెలవులు రావడంతో చందన కూడా తల్లి వద్దకొచ్చింది. తల్లీకూతుళ్లు 15 రోజుల క్రితమే తిరుగు ప్రయాణం పెట్టుకున్నా సంఽధ్యారాణికి జ్వరం రావడంతో వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత మెదక్‌లో శుభకార్యం ఉండటంతో ఆలస్యమైంది. చివరికి.. బుధవారం బెంగళూరు బస్సెక్కాలనుకున్నా చివరి క్షణాల్లో వాయిదా వేసుకున్నారు. గురువారం వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సెక్కి ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.

Untitled-6 copy.jpg


‘నాన్నా.. బస్‌ ఎక్కా’.. అదే చివరిమాట!

యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చెందిన 22 ఏళ్ల మహేశ్వరం అనూషా రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నిరుడే బెంగళూరులోని ఓ కంపెనీలో చేరింది. దీపావళి కోసం ఈనెల 16న స్వగ్రామానికొచ్చింది. గురువారం బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు హైదరాబాద్‌కొచ్చింది. రాత్రి లకిడీకాపూల్‌లో బస్సెక్కింది. రాత్రి 9:30కు తండ్రి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్‌ చేసి ‘నాన్న బస్‌ ఎక్కా’నని చెప్పింది. తమ బిడ్డ నుంచి అవే చివరిమాటలయ్యాయని దంపతులు శ్రీనివాస్ రెడ్డి, విజిత గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Untitled-6 copy.jpg

పిల్లల చదువు కోసమే హైదరాబాద్‌ వచ్చి..

ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తూరు శ్రీనివాసరావు, విజయలక్ష్మి కుమారుడు మేఘనాథ్‌ (25)కు ఐటీ కంపెనీలో చక్కని ఉద్యోగం వచ్చిందన్న సంతోషం వారికి ఏడాదైనా మిగల్లేదు. బస్సు ప్రమాదంలో అతడు సజీవదహనమయ్యాడని తెలిసి ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏడు నెలల క్రితం మేఘనాథ్‌కు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. దీపావళికి హైదరాబాద్‌కొచ్చి.. గురువారం తిరుగు ప్రయాణమై ప్రమాదంలో మరణించాడు.

Untitled-6 copy.jpg


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పెళ్లి కల ‘బుగ్గి’

ఇంకొల్లు/బాపట్ల/రావులపాలెం/అనపర్తి:అగ్ని ప్రమాదం... కొన్నాళ్లలో పెళ్లి పీటలెక్కాల్సిన సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని బలి తీసుకుంది. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి(27) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దీపావళి సెలవులకు హైదరాబాద్‌లోని మేనమామ శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లారు. సెలవులు ముగించుకుని బెంగళూరుకు తిరిగి వెళుతూ కావేరీ బస్సు ఎక్కి.. మృత్యువాత పడ్డారు. త్వరలోనే ఆమెకు వివాహం చేయాలని భావించామని.. ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయిందంటూ తల్లి వాణి కన్నీరుమున్నీరుగా విలపించారు.

Untitled-6 copy.jpg

బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ..

బెంగళూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ఉన్న తల్లి సేవ కోసం వేల రూపాయల వేతనాన్ని, ఉద్యోగాన్ని కూడా వదులుకుని తల్లిసేవలో పునీతులవుతున్నారు. కానీ, కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఆ తల్లిని, కుమారుడిని కూడా బలితీసుకుంది. బెంగళూరు టిన్‌ ఫ్యాక్టరీ ప్రాంతంలోని నారాయణపురలో నివసిస్తున్న ఫిలోమిన్‌ బేబి(64), ఆమె కుమారుడు కిశోర్‌ కుమార్‌(41) బస్సు ప్రమాదంలో సజీవదహనమయ్యారు. కిశోర్‌ కుమార్‌ ఉద్యోగం చేసేవారు. తల్లికి సేవ చేసేందుకు పెళ్లిని, ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. ఫిలోమినా బంధువులు హైదరాబాద్‌లో ఉన్నారు. వారితో కొంతకాలం గడిపేందుకు తల్లీకొడుకు ఇటీవల అక్కడకు వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి తిరిగి బెంగళూరుకు కావేరీ బస్సులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇరువురు అశువులు బాశారు.

Untitled-6 copy.jpg

Updated Date - Oct 25 , 2025 | 05:05 AM