Reliance Chairman Mukesh Ambani: తిరుమలలో వంటశాల నిర్మాణానికి ముఖేశ్ అంబానీ రూ.100 కోట్ల విరాళం
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:49 AM
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ఆయన తిరుమలతో పాటు కేరళలోని గురువాయూర్....
తిరుమల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ఆయన తిరుమలతో పాటు కేరళలోని గురువాయూర్, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల తరఫున చేపట్టే వివిధ సేవా కార్యక్రమాలకు భూరి విరాళాలను ప్రకటించారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ పూర్తయ్యాక ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో నూతన శాటిలైట్ కిచెన్(వంటశాల) నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు. నిత్యం 2లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలను తయారు చేసేందుకు వీలుగా ఈ వంటశాలను నిర్మించనున్నారు. ‘కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మహాభాగ్యం’ అని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, నాథ్‌ద్వారాలో భక్తుల సౌకర్యార్థం రూ.50 కోట్లకు పైగా వ్యయంతో యాత్రికుల సముదాయాన్ని వచ్చే మూడేళ్లలో నిర్మించనున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. తొలి విడతలో భాగంగా రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి గాను మొదటి విడతగా రూ.15 కోట్లు చెక్కును అందజేశారు.