Share News

మట్టి దందా!

ABN , Publish Date - May 16 , 2025 | 12:41 AM

తోట్లవల్లూరు మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. పొట్టిదిబ్బలంకలో అనుమతుల్లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టింది. రెండు రోజులుగా ఎక్స్‌కవేటర్‌తో రేయింబవళ్లు లారీల్లోకి మట్టి లోడింగ్‌ చేయించి ఉయ్యూరు వైపు యథేచ్ఛగా తరలిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఫీజుకు సైతం ఎగనామం పెడుతోంది. మట్టి తవ్వకాల విషయం బయటకు రావడంతో తమకు ఇప్పుడే తెలిసిందన్నట్టు వీఆర్వో నాగేశ్వరరావు ఓవరాక్షన్‌ చేశారు. మట్టి లారీలకు తన స్కూటీని అడ్డుపెట్టి మరీ ఆపారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ లారీలను వదిలేశారు. రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మట్టి దందా!

- పొట్టిదిబ్బలంకలో అనుమతి లేకుండా తవ్వకాలు

- 2 రోజులుగా ఎక్స్‌కవేటర్‌తో రేయింబవళ్లు లారీల్లోకి మట్టి లోడింగ్‌

- రాయల్టీ చెల్లింపులు లేకుండా ఉయ్యూరు వైపు రవాణా

- స్కూటీని అడ్డుపెటి లారీలను ఆపిన వీఆర్వో

- ఆ తర్వాత లారీలు, ఎక్స్‌కవేటర్‌ను వదిలివేసిన వైనం

- రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

తోట్లవల్లూరు మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. పొట్టిదిబ్బలంకలో అనుమతుల్లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టింది. రెండు రోజులుగా ఎక్స్‌కవేటర్‌తో రేయింబవళ్లు లారీల్లోకి మట్టి లోడింగ్‌ చేయించి ఉయ్యూరు వైపు యథేచ్ఛగా తరలిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఫీజుకు సైతం ఎగనామం పెడుతోంది. మట్టి తవ్వకాల విషయం బయటకు రావడంతో తమకు ఇప్పుడే తెలిసిందన్నట్టు వీఆర్వో నాగేశ్వరరావు ఓవరాక్షన్‌ చేశారు. మట్టి లారీలకు తన స్కూటీని అడ్డుపెట్టి మరీ ఆపారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ లారీలను వదిలేశారు. రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తోట్లవల్లూరు, మే 15 (ఆంధ్రజ్యోతి):

తోట్లవల్లూరుల మండలం దేవరపల్లి రెవెన్యూ పరిధిలోని పొట్టిదిబ్బలంకలో కళ్లంవారిపాలేనికి చెందిన రైతు దేవరపల్లి వెంకటేశ్వరరావు పొలంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తవ్వకాలు చేపట్టారు. గత రెండు రోజులుగా 24 గంటలు పెద్ద యంత్రంతో మట్టిని తవ్వి లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. మండల కేంద్రమైన తోట్లవల్లూరులో ప్రభుత్వ కార్యాలయాల పక్కగానే ఉయ్యూరు వైపుగా లారీలు మట్టిని రవాణా చేస్తున్నాయి. బుధవారం రాత్రి తోట్లవల్లూరు సెంటర్లో మట్టి లారీలు ఆగాయి. ఆరా తీస్తే పొట్టిదిబ్బలంక నుంచి అని తెలిసింది. గురువారం ఉదయం పొట్టిదిబ్బలంక వెళ్లి పరిశీలించగా, 200 పవర్‌ గల యంత్రంతో మట్టిని తవ్వి లారీల్లోకి నింపుతున్నారు. అక్కడ ఓ యువకుడు పుస్తకం చేతపట్టి లారీల నెంబరు రాస్తు కూర్చున్నాడు. అనుమతి ఉందా ఎవ్వరు తవ్విస్తున్నారు అని అడగ్గా గన్నవరానికి చెందిన శైలేష్‌ తవ్విస్తున్నారు, నా ఊరు గన్నవరం అని సమాధానం ఇచ్చాడు. అనుమతి ఉందా అంటే నాకు తెలియదని, నేను లారీలను నోట్‌ చేసుకోవటమేనని చెప్పాడు. రెండు రోజులుగా సుమారు అరెకరం పొలంలో మట్టిని అక్రమంగా తవ్వేశారు. అధికారులకు తెలిసే అక్రమ మట్టితవ్వకాలు చేపట్టారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి.

రైతు వెంకటేశ్వరరావు ఈ పొలంలో మొక్కజొన్న పంట పండించినట్టు స్థానికులు తెలిపారు. పంటలు సాగు చేసుకునేందుకు అనువైన భూమిని కేవలం డబ్బుల కోసమే మట్టి తవ్వకాలకు ఇచ్చారని చెబుతున్నారు. పంటల సాగుకు అనుకూలంగా లేకుంటే అధికారులకు అర్జీ పెట్టి అనుమతి పొంది చదును చేసుకోవచ్చు. రెండేళ్ల క్రితం పక్క రైతులు ఇదేవిధంగా అక్రమంగా మట్టి తవ్వకాలు చేయటంతో రైతు వెంకటేశ్వరరావు కూడా తవ్వకాలకు భూమిని ఇచ్చినట్టు తెలుస్తోంది.

రహదారికి ప్రమాదం

ప్రస్తుతం వెంకటేశ్వరరావు పొలంలో జరిపిన మట్టితవ్వకాలతో రహదారికి ప్రమాదమని పొట్టిదిబ్బలంక ప్రజలు చెబుతున్నారు. ఓ పక్క రహదారి, మరో పక్క కృష్ణానది అంచున ఉన్న పొలంలో భవిషత్తులో సంభవించే నష్టాలను ఆలోచించకుండా మట్టిని తవ్వటంపై మిగితా రైతులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణానదికి వరదలు సంభవించినపుడు రహదారి కోతకుగురై విరిగిపోయో ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు.

పట్టుకున్న లారీలను వదిలేసిన వీఆర్వో

మట్టితవ్వకాల వద్దకు విలేకరులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న వీఆర్వో బి.నాగేశ్వరరావు పొట్టిదిబ్బలంక వచ్చారు. ఆయన వచ్చినపుడు రెండు మట్టిలోడు లారీలు నదీపాయలోని రహదారిలో ఎదురుపడ్డాయి. దాంతో వీఆర్వో నాగేశ్వరరావు తన స్కూటీని లారీలు వెళ్లకుండా రహదారిలో అడ్డుగా పెట్టారు. ఎక్స్‌కవేటర్‌ను కూడా ఆపేశారు. అనుమతులు లేకుండా ఎవ్వరు తవ్వమన్నారని వీఆర్వో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏమీ మతలబు జరిగిందో గాని పట్టుకున్న రెండు మట్టిలోడు లారీలను, ఎక్స్‌కవేటర్‌ను విడిచిపెట్టాశారు. ఈ విషయమై తహసీల్దార్‌ ఎం.కుసుమకుమారిని వివరణ కోరగా మట్టితవ్వకాలకు అనుమతులు లేవన్నారు. తవ్వకాలను నిలిపివేశామని చెప్పారు. లారీల్లో మట్టిని ఖాళీ చేయించి పంపించేశామన్నారు. కాగా, అధికారుల చర్యపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మండలంలో అనేక చోట్ల అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలను ఇలాగే ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 16 , 2025 | 12:41 AM