Tadepalligudem: ఏపీ నిట్‌లో ఎంటెక్ పునఃప్రారంభం
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:18 AM
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఎంటెక్ కోర్సులను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 95 సీట్లతో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు

తాడేపల్లిగూడెం అర్బన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఎంటెక్ కోర్సులను పునః ప్రారంభిస్తున్నారు. ఐదేళ్ల క్రితమే ఏపీ నిట్‌లో ఎంటెక్ కోర్సులు ఉన్నప్పటికీ తాత్కాలికంగా నిలిపివేశారు. అధ్యాపక సిబ్బంది కొరతతో ఈ కోర్సు అందుబాటులో లేకుండా పోయింది. ఇటీవల అధ్యాపకులను నియమించారు. రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. ప్రొఫెసర్ల నియామకం పూర్తి చేసారు. మొత్తంమీద 65 మంది అధ్యాపక సిబ్బంది అదనంగా భర్తీ కావడంతో ఎంటెక్ కోర్సులను పునః ప్రారంభించేందుకు ఏపీ నిట్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేసి, ఈ ఏడాది అడ్మిషన్లు నిర్వహించనున్నారు. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్, బయో టెక్నాలజీ, మెటలర్జీ విభాగంలో 95 ఎంటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరో వైపు బీటెక్ ఇంజనీరింగ్ విభాగాలలోనూ సీట్ల సంఖ్య పెంపుపై తర్జన భర్జన పడుతున్నారు. గత ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఏపీ నిట్‌లో బీటెక్ సీట్ల సంఖ్య 750 కు చేరింది. అధ్యాపక సిబ్బంది కొరత ఉందన్న కారణంతో సీట్ల సంఖ్యను 480కి కుదించారు. బీటెక్‌లో సీట్లు పెంచాలంటే మరికొంత ఫ్యాకల్టీ అవసరం ఉందని భావిస్తున్నారు.